‘పుష్కర’ ఆధారాల సమర్పణ

9 Sep, 2016 21:10 IST|Sakshi
‘పుష్కర’ ఆధారాల సమర్పణ
  • సీఎం సెక్యూరిటీ వివరాలు ఇవ్వని పోలీసు శాఖ
  • ఈ నెల 20కు విచారణ వాయిదా
  • సాక్షి, రాజమహేంద్రవరం : 
    గత ఏడాది గోదావరి పుష్కరాల తొలిరోజు రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై నియమించిన జస్టిస్‌ సీవై సోమయాజులు ఏకసభ్య కమిషన్‌ శుక్రవారం మరోమారు బహిరంగ విచారణ చేపట్టింది. ఈ నెల మూడో తేదీన జరిగిన విచారణలో కమిషన్‌ ఆదేశించిన మేరకు ప్రభుత్వం తరఫు న్యాయవాది చింతపెంట ప్రభాకరరావు ప్రభుత్వ శాఖలు ఇచ్చిన సమాచారాన్ని కమిషన్‌ ముందుంచారు. 12 అంశాలకు గాను 11 అంశాల సమాచారాన్ని 13 ఫైళ్ల రూపంలో కమిషన్‌కు సమర్పించారు. ఏ సమాచారం ఉంది, ఏ సమాచారం లేదన్న విషయాన్ని కూడా అందులో పొందుపరిచామని తెలిపారు. పిటిషనర్లు కోరిన సీఎం, మంత్రుల సెక్యూరిటీ, సిబ్బంది వివరాలు మాత్రం ఇవ్వలేదు. ప్రతి ఫైల్‌లో విషయ సూచిక లేకపోవడంతో దానిని పొందుపరచాలని కమిషన్‌ ప్రభుత్వ తరఫు న్యాయవాదికి సూచించింది. సమాచారం ఇలా అస్తవ్యస్తంగా ఇస్తే తాము ఎలా విశ్లేషించగలమని, గడువులోపు విచారణ ఎలా పూర్తి చేయగలమని ప్రశ్నించింది.
    29లోగా పూర్తి కావాలి
    విచారణ పూర్తి చేయడానికి కమిషన్‌.. ఎక్కువ సమయం తీసుకుంటున్నట్టుగా ప్రజలు భావిస్తున్నారని ఏకసభ్య కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ సీవై సోమయాజులు అన్నారు. ఈ నెల 29 లోపు విచారణ పూర్తి కావాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం మూడు నెలలు గడువు పెంచినా, అందుకు సంబంధించిన జీఓ రావడానికి ఒకటిన్న నెలల సమయం పట్టిందని, ఇక్కడే సమయమంతా వృథా అయిందని కమిషన్‌ వ్యాఖ్యానించింది. సమాచారం పరిశీలనలో ఏదైనా సందిగ్ధత ఉంటే ప్రభుత్వ సిబ్బంది వచ్చి సహాయం చేస్తారని ప్రభుత్వ న్యాయవాది కమిషన్‌కు తెలిపారు. ఇందుకు సమ్మతించని కమిషన్‌ ప్రతి ఫైల్‌లో ఏముందో ముందుభాగంలో విషయ సూచికను రూపొందించాలని ఆదేశించింది. ఈ సమాచార ప్రతిని పిటిషనర్లు, వారి తరఫు న్యాయవాదులకు ఇవ్వాలని పేర్కొంది. ప్రభుత్వ శాఖలు సమర్పించిన సమాచారాన్ని నమోదు చేసుకున్న కమిషన్‌ ఈ నెల 20న ఇరుపక్షాల వాదనలు వింటామని తెలుపుతూ విచారణను ఆ రోజుకు వాయిదా వేసింది. విచారణకు పోలీసు శాఖ తరఫున డీఎస్పీలు అంబికా ప్రసాద్, రామకృష్ణ, జె.కులశేఖర్, న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు, కాంగ్రెస్‌పార్టీ లీగల్‌సెల్‌ సిటీ అధ్యక్షుడు కూనపురెడ్డి శ్రీనివాసులు హాజరయ్యారు. కమిషన్‌కు సహాయకులుగా న్యాయవాది మద్దూరి శివసుబ్బారావు వ్యవహరించారు.
     
>
మరిన్ని వార్తలు