ఏటీఎం.. ఎనీ టైమ్ ప్రాబ్లమ్!

12 Jul, 2015 11:04 IST|Sakshi
ఏటీఎం.. ఎనీ టైమ్ ప్రాబ్లమ్!

ఏటీఎం కార్డుంటే చాలు.. ఇక జేబులో కరెన్సీ నోట్లెందుకు? అనేంతలా చాలామంది ఏటీఎంలకు అలవాటుపడిపోయారు. ఏటీఎంలు ఒక్క గంట పని చేయకపోతేనే చేతుల్లో సొమ్ములాడని పరిస్థితికి వచ్చేశాం. అలాంటిది కోట్లాదిమంది పుష్కర భక్తులతో కిక్కిరిసే రాజమండ్రి నగరంలో ఏటీఎంలు మొరాయిస్తే యాత్రికులు, స్థానిక ప్రజలు పడే అవస్థలు చెప్పక్కర్లేదు. ఈ పరిస్థితిని ఎదుర్కొనే విషయమై అటు బ్యాంకర్లు కానీ ఇటు ప్రభుత్వం కానీ ఇప్పటివరకూ దృష్టి సారించనేలేదు.
 
సాక్షి, రాజమండ్రి: ఒకప్పుడు ఏదైనా ఊరికో, తీర్థయాత్రలకో వెళ్లాలంటే ఖర్చులను ముందుగా అంచనా వేసుకుని, తగిన నగదు వెంట తీసుకువెళ్లేవారు. ప్రస్తుతం ఎవరు ఏ ప్రయాణం పెట్టుకున్నా రవాణా ఖర్చులకు తప్ప అధిక మొత్తాలను జేబులో పెట్టుకుని వెళ్లడం లేదు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఉండే ఏటీఎంలలో నగదు డ్రా చేసి తమ అవసరాలు తీర్చుకునేందుకు అలవాటుపడ్డారు. ఇదే ఈ పుష్కరాల్లో ఓ సమస్యగా మారనుంది. పుష్కరాల సందర్భంగా రాజమండ్రి నగరానికి ప్రతి రోజూ లక్షలాదిగా యాత్రికులు రానున్నారు. ఈ 12 రోజుల్లో సుమారు 4 కోట్ల మంది పుణ్యస్నానాలు చేస్తారని ప్రభుత్వం లెక్కలు కడుతోంది. ప్రస్తుతం నగరంలో ఉన్న ఏటీఎంలు ఇక్కడి ప్రజల అవసరాలకే చాలడంలేదు. ఇటువంటి పరిస్థితుల్లో లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఉన్న ఏటీఎంలు ఏవిధంగా సరిపోతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. నగరంలో వివిధ బ్యాంకులకు చెందిన సుమారు 96 ఏటీఎంలు ఉన్నాయి.
 
 వీటిలో నిత్యం పది పదిహేను శాతం ఏటీఎంల వద్ద సాంకేతిక సమస్యలతో ఎప్పుడూ ఔట్ ఆఫ్ ఆర్డర్ బోర్డులు దర్శనమిస్తూంటాయి. మిగిలిన ఏటీఎంలలో మరో 10 శాతం చాలినంత నగదు లేక మూత పడుతూంటాయి. ఉన్న ఏటీఎంలలో మూడో వంతు ఏటీఎంలకు కూడా సరైన రక్షణ లేదు. ఒక్కో ఏటీఎంలో ప్రతి రోజూ రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ నగదు విత్‌డ్రా చేస్తూంటారు. ఈ లెక్కన నగరంలోని మొత్తం ఏటీఎంల ద్వారా ప్రతి రోజూ రూ.10కోట్ల నుంచి రూ,15 కోట్ల వరకూ విత్‌డ్రాయల్స్ జరుగుతాయి. పుష్కరాల్లో రోజుకు కనీసం రూ.50 కోట్లకు పైగా లావాదేవీలు జరుగుతాయని అంచనా. ఏటీఎంలలో నగదు నింపే బాధ్యత ప్రైవేటు ఏజెన్సీలదే. సాధారణంగా 24 గంటలకోసారి కానీ ఈ ఏజెన్సీలు నగదు నింపవు. కొన్ని సందర్భాల్లో రెండు మూడు రోజులొకోసారి కూడా వీటివైపు కన్నెత్తి చూడరు. పుష్కరాల వేళ నగదు పెట్టిన గంటల్లో ఏటీఎంలు ఖాళీ అయ్యే పరిస్థితులుంటాయి. మూడు పూటలా అవసరమైతే రాత్రుళ్లు కూడా నగదు నింపితేనే కానీ భక్తుల అవసరాలు తీరవు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు మొబైల్ ఏటీఎంలు ఏర్పాటు చేయాలని బ్యాంకర్లకు ప్రభుత్వం సూచించినా ఇప్పటివరకూ ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
 
 
 మొబైల్ ఏటీఎంలు ఏర్పాటు చేస్తాం
 పుష్కరాల నేపథ్యంలో ఆంధ్రాబ్యాంక్ తరఫున రాజమండ్రి నగరంలో ఒక మొబైల్ ఏటీఎం ఏర్పాటు
 చేస్తున్నాం. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. దీంతో ఒక్క ఏటీఎంకే అనుమతి వచ్చింది. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేస్తున్న ఒక స్టాల్‌లో ఏటీఎం సర్వీసు కోసం తీసుకున్నాం. దీనిలో బిజినెస్ కరస్పాండెంట్‌ను ఏర్పాటు చేసి, ఏటీఎంలపై నగదు బట్వాడా చేస్తాం. నగరంలో ఉన్న మా బ్రాంచిలలో రూ.లక్ష చొప్పున చిల్లర నాణేలు సిద్ధంగా ఉన్నాయి. అవసరమైనవారు తీసుకోవచ్చు.
 - శేషగిరిరావు, డీజీఎం, ఆంధ్రాబ్యాంక్

మరిన్ని వార్తలు