మాటలే.... చేతల్లేవ్‌....!

11 Aug, 2016 18:09 IST|Sakshi
మాటలే.... చేతల్లేవ్‌....!
ఆది పుష్కరాల ముగింపులో రాజమహేంద్రవరంపై సీఎం వరాల జల్లు
అంత్య పుష్కరాలు ముగుస్తున్నా అమలు ఊసేలేదు 
పుష్కరుడికి వీడ్కోలు పలికేందుకు నేడు సీఎం చంద్రబాబు రాక 
ఆశల చిగుళ్లతో బాబు ముందుకు నగర ప్రజలు
సాక్షి, రాజమహేంద్రవరం :
గతేడాది గోదావరి పుష్కరాల ముగింపు రోజున రాజమహేంద్రవరం అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించిన హామీలు ఏడాది తరువాత కూడా వెక్కిరిస్తున్నాయి.

ప్రణాళిక దశలోనే ‘అఖండ గోదావరి’
రాజమహేంద్రవరాన్ని టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తామని అఖండ గోదావరి ప్రాజెక్టును ప్రకటించగా ప్రస్తుతం అది ప్రతిపాదనల దశలోనే ఉంది. ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక అధికారిని నియమిస్తూ రూ.100 కోట్లు ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఆ పనులు ఎండమావులవుతున్నాయి.

తాగునీరేదీ?
10వ డివిజన్‌ గాయత్రి నగర్‌లో రూ.40 కోట్ల అంచనాతో మంచినీటి ట్యాంకు, మెయిన్‌ పంపింగ్‌ వ్యవస్థ ఏర్పాటుకు నగర కన్వెన్షన్‌ సెంటర్‌తోపాటు శంకుస్థాపన చేశారు. ఆ పనులు ఊరిస్తూనే ఉన్నాయి.
పేరు మారినా తీరు మారలేదు
రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మార్చారు. మెగా సిటీగా, ఆధునిక నగరంగా తీర్చిదిద్దుతామని సీఎం ప్రకటించారు. ఏడాదైనా పేరు గొప్ప ఊరు దిబ్బలాగే నగరం తీరు మారింది. గట్టిగా వర్షం పడితే రోడ్లు గోదావరి కాలువలను తలపిస్తాయి. జనాభా పెరిగినా ఇప్పటికీ బ్రిటిషు కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థే దిక్కు. మెయిన్‌ రోడ్డు, తాడితోట, శ్యామలా సెంటర్‌ ప్రాంతాల్లో ఇరుకు రోడ్లతో ట్రాఫిక్‌ సమస్యలు.

శిలాఫలకంలోనే నగర  కన్వెన్షన్‌ సెంటర్‌...
నగర కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణానికి 2015 మే ఒకటో తేదీన రూ.40 కోట్ల అంచనా వ్యయంతో ఆర్ట్స్‌ కాలేజీ ప్రాంగణంలో శంకుస్థాపన చేశారు. సెంట్రల్‌ జైలు ఎదుట ఆరు ఎకరాల విస్తీర్ణంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో దీన్ని నిర్మించడానికి నిర్ణయించారు. ఇందులో ఫుడ్‌ కోర్టులు, సమావేశ మందిరం, మల్టిప్లెక్స్‌ థియేటర్‌ నిర్మిస్తామన్నారు. ఈ ప్రతిపాదనలు ఇప్పటి వరకూ కార్యరూపం దాల్చలేదు. ఇదే ప్రాంతంలో ఫైవ్‌స్టార్‌ హోటల్‌ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇది కూడా హామీలకే పరిమితమైంది. 

కందుకూరికీ తప్పని హామీ మోసం
సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు నిర్మించిన పుర మందిరానికి పూర్వవైభవం తెస్తానని సీఎం ప్రజల సమక్షంలో హామీ ఇచ్చారు. పురమందిరం(టౌన్‌ హాలు)ను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతానని ఆ సందర్భంగా చెప్పారు. ఈ మాట చెప్పి ఏడాది కాలం గడుస్తున్నా నేటì కీ అతీ గతీ లేదు. పురమందిరం పూర్తిగా శిథిలమైంది. అలాగే కందుకూరి పేరుతో ఉన్న వీటీ కాలేజీని, గౌతమీ గ్రంథాలయం, దామోదర ఆర్ట్స్‌ గ్యాలరీని అభివృద్ధి చేస్తామని ప్రకటించి మరిచిపోయారు. గుర్తు చేయాల్సిన తెలుగు తమ్ముళ్లూ గజనీ వేషాలు వేస్తున్నారు.
 
గోదావరి మహా పుష్కర వనానికి మోక్షమెప్పుడు?
గోదావరి మహాపుష్కరాలు గుర్తుండేలా లాలా చెరువు సమీపంలో 240 ఎకరాల్లో మహాపుష్కర వనానికి 2015 జూలై 26న సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 30 రోజుల్లో దీన్ని అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు. మహాపుష్కరాల పైలాన్‌కు కూడా ఆవిష్కరించారు. అంతకు మించి వనంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఈ వనంలోనే సైన్సు విద్యార్థులకు ఉపయోగపడేలా బొటానికల్‌ గార్డెన్, ‘రాశి’ వనం దశ తికగలేదు.
మరిన్ని వార్తలు