ఘాట్‌లు పర్యాటక క్షేత్రాలవ్వాలి

21 Aug, 2016 21:09 IST|Sakshi
ఘాట్‌లు పర్యాటక క్షేత్రాలవ్వాలి
అప్పుడే వెచ్చించిన వ్యయానికి సార్థకత
ప్రముఖ గాయకుడు గజల్‌ శ్రీనివాస్‌
 
చింతపల్లి (అచ్చంపేట): కోట్లాది రూపాయలతో నిర్మించిన పుష్కర ఘాట్లు, పుష్కరాలు అయిపోగానే అంతరించకూడదని, నవ్యాంధ్రలో పర్యాటక కేంద్రాలుగా రూపుదిద్దుకోవాలని, అప్పుడే ప్రభుత్వం వెచ్చించిన వ్యయానికి సార్థకత వస్తుందని సుప్రసిద్ధ గజల్‌ గాయకుడు గజల్‌ శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం ఆయన చింతపల్లి పుష్కర ఘాట్‌ను, ఘాట్‌ ఒడ్డునే నిర్మాణంలో ఉన్న  శ్రీ విష్ణు పంచాయతన దివ్యమహాక్షేత్రాన్ని సందర్శించారు.  దేవాలయాలను కుల్చివేస్తున్న  ఈ తరుణంలో వందల సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతన దేవాలయాల పునరుద్ధరణకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. గోమాత, గోపురం, దేవాలయం, గంగ (నదీజలం) ఎక్కడ పూజింపబడతాయో అక్కడ సంపదలు, మంచి ఆరోగ్యం, శాంతి ఉంటాయని ఆయన చెప్పారు.  గుండె బాగుంటేనే దేహం బాగుంటుందని, గుడి బాగుంటేనే దేశాలు బాగుంటాయని అన్నారు.  కృష్ణానది ఒడ్డున మంగళగిరి, కోటప్పకొండ, అమరావతి వంటి పుణ్య క్షేత్రాలు ఉండబట్టే వాటికి అంత ప్రాముఖ్యత వచ్చిందన్నారు.  రానున్న కాలంలో చింతపల్లి ఒక మహాపుణ్య క్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా రుపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. గొప్పగొప్ప రుషులు ఎన్నో యజ్ఞాలు, యాగాలు చేసి దేవాలయాలను నిర్మించారని, వాటిని రక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. నదీ పరివాహక ప్రాంతాలలోని దేవాలయాలలో దేవతలు సంచరిస్తూ ఉంటారని, సంగీతం ఆలపిస్తుంటారని సనాతన ధర్మం చెబుతోందన్నారు. సీనీ గాయకుడు నాగూర్‌బాబుతో కలసి గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన్‌మందిరంలో ప్రోగ్రాం ఇచ్చానని, అందులో వచ్చిన ఆదాయాన్ని ఈ ఆలయ అభివృద్ధికి కేటాయిస్తున్నానన్నారు. ఆలయ నిర్మాణానికి తనతో పాటు సహకరించిన  పీసీసీ ప్రధాన కార్యదర్శి పక్కాల సూరిబాబు  మిట్టుపల్లి రమేష్, గుంటూరు మాస్టర్‌మైండ్స్, తాడిశెట్టి మురళి, యర్రంశెట్టి వేణుగోపాల్‌ తదితరులను ఆయన ఘనంగా సత్కరించారు.
 
మరిన్ని వార్తలు