పుష్కర పనులు ఎక్కడివక్కడే!

2 Aug, 2016 19:55 IST|Sakshi
పుష్కర పనులు ఎక్కడివక్కడే!
కృష్ణా పుష్కరాలకు ఇంకా పది రోజులే సమయం
పూర్తికాని ఘాట్లు, రోడ్ల నిర్మాణ పనులు
ప్రారంభ దశలోనే పుష్కరనగర్‌లు
 
కృష్ణా పుష్కరాలు తరుముకొస్తున్నాయి.. ఇంకా పదిరోజులే గడువున్నా క్షేత్రస్థాయిలో పనులు పూర్తికాలేదు. ఘాట్ల పనులే అసంపూర్తిగా ఉంటే భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసే పనులు ఎప్పటికి పూర్తవుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. అధికారుల మధ్య సమన్వయ లోపం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. 
 
సాక్షి, అమరావతి : జిల్లాలో పుష్కర పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత నెల 31 నాటికే పనులన్నీ పూర్తిచేస్తామని మంత్రులు, అధికారులు ప్రకటించినా క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోలేదు. పుష్కరాలకు వచ్చే భక్తులకు చేయాల్సిన ఏర్పాట్లదీ అదే పరిస్థితి. పుష్కరాల విధుల్లో పాల్గొనే సిబ్బందికి భోజనం, వసతి ఏర్పాట్లు పూర్తికాలేదు. ఎక్కడ ఏర్పాటు చేయాలనేదానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. 
అసంపూర్తిగా పనులు..
జిల్లాలో ప్రధాన ఘాట్ల పనులు ఇంకా పూర్తికాలేదు. అమరావతిలో ఇంకా టైల్స్‌ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. అవి పూర్తయ్యాక టూరిజం శాఖ ఆధ్వర్యంలో విద్యుద్దీకరణ పనులు చేపట్టాల్సి ఉంది.  పుష్కర నగర్‌ల పనులు ప్రారంభ దశలోనే ఉన్నాయి. పిండ ప్రదానం షెడ్ల పనులూ మందకొడిగా సాగుతున్నాయి. సీతానగరం, పెనుమూడి ఘాట్ల పనులు కొలిక్కిరాలేదు. ఈ పనులన్నీ ఎప్పటికి పూర్తవుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. దాదాపు 15 ఘాట్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయి.. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే ముఖ్యమైన ఘాట్ల పనులు పూర్తికాకపోవడం అధికారులను కలవరపెడుతోంది. ఆర్‌అండ్‌బీ శాఖ చేపట్టే పనులూ ఇంకా పూర్తికాలేదు. ఈ నెల ఐదో తేదీ నాటికి పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గుంటూరు నగరంలో రోడ్డు పనులు ఆశించిన స్థాయిలో జరగటం లేదు. ఇంకా కార్పొరేషన్‌ అధికారులే డ్రెయిన్ల పనులు పూర్తి చేయని పరిస్థితి నెలకొంది. రోడ్లు భవనాల శాఖ పనులు కూడా పూర్తిస్థాయిలో పూర్తవలేదు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా తాత్కాలికంగా రోడ్డు పనులు చేసి సరిపెట్టే యత్నాల్లో ఆ శాఖ అధికారులు ఉన్నారు.
 
అధికారుల్లో సమన్వయలోపం..
  • పుష్కర పనుల్లో వివిధ శాఖల అధికారుల మధ్య సమన్వయలోపం స్పష్టంగా కనిపిస్తోంది. 
  • ఘాట్ల వద్ద బారికేడింగ్‌ ఏర్పాట్లు ఎవరు చేయాలనే అంశం ప్రత్యేకాధికారి రాజశేఖర్‌ సమీక్ష చేసేవరకు పట్టించుకోకపోవడం గమనార్హం. 
  • దేవాదాయ, నీటిపారుదల, రహదారులు, భవనాల శాఖల మధ్య సమన్వయం కొరవడటమే దీనికి కారణం.
  •  వైద్యశాఖ తరఫున శిబిరాల ఏర్పాటు, మందుల కొనుగోలు కోసం అధికారులను నియమించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎవ్వరూ దృష్టిసారించలేదు. 
  •  దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఆలయాల ఆధునికీకరణకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించినా పనులు మాత్రం పూర్తికాలేదు. 
  • ఘాట్లలో పూజలు చేసేందుకు వీలుగా పూజారులను గుర్తించామని చెబుతున్నా, వారికి గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు.
  •  జిల్లాలో జరుగుతున్న పుష్కర పనులు, ఏర్పాట్లపై ఆదివారం జరిగిన సమీక్ష సమావేశంలో పుష్కరాల ప్రత్యేకాధికారి రాజశేఖర్‌ పలు శాఖల అధికారులపై మండిపడ్డారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పనులు, ఏర్పాట్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 
  •  కనీసం జిల్లాలో పుష్కర పనులకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్‌లో సమాచారాన్ని అప్‌డేట్‌ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని వార్తలు