భార్యను పుట్టింటికి తీసుకెళ్లారని..

30 Aug, 2016 00:57 IST|Sakshi

శాలిగౌరారం
తన భార్యను పుట్టింటికి తీసుకెళ్లిన అత్తమామలు తిరిగి కాపురానికి పంపాలని ఓ వ్యక్తి సోమవారం రాత్రి మండలకేంద్రంలోని ఓ సెల్‌టవర్‌ ఆందోళన చేశాడు. సుమారు రెండు గంటలపాటు తీవ్ర ఉత్కంఠను కలిగించిన ఆ వ్యక్తిని పోలీసులు కిందకు దించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మనిమద్దె గ్రామానికి చెందిన పోలేపాక సుధాకర్‌ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కంపనీలో గత సంవత్సరం సూపర్వైజర్‌గా పనిచేశాడు. ఆ సమయంలో అదే కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న నేరేడుచర్ల మండలం సజ్జాపురం గ్రామానికి చెందిన బైరి వసంతలు ప్రేమించుకున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరు 5 మార్చి 2016న ఉప్పల్‌లోని సాయిబాబా దేవాలయంలో వివాహం చేసుకున్నారు. అనంతరం మీర్‌పేట సీఐ రాములును కలిశారు. దీంతో ఆయన ఇరువురి తల్లిదండ్రులను పిలిపించి విచారించగా వసంత తల్లిదండ్రులకు పెళ్లి ఇష్టం లేక వెళ్లిపోయారు. సుధాకర్, వసంతలు మేజర్‌ కావడంతో మీ ఇష్టప్రకారం నడుచుకోవాలని సీఐ చెప్పారు. దీంతో సుధాకర్‌ తన సొంత గ్రామమైన మనిమద్దెకు వచ్చి కుటింబీకులతో కలిసి కాపురం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వసంత కుటింబీకులు, బంధువులు సుధాకర్‌ను పలుమార్లు ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడ్డారు. ఇదిలా ఉండగా వసంత తల్లిదండ్రులు ఈనెల 23న వసంతను బలవంతంగా లాక్కెళ్లారు. ఆ సమయంలో అడ్డువచ్చిన సుధాకర్‌ తల్లిని చంపుతామని బెదిరించారు.  వెంటనే సుధాకర్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈనెల 24న సజ్జాపురం వెళ్లగా అక్కడ వసంత ఆచూకీ లభించలేదు. దీంతో వారి బంధువుల వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో భార్యను కాపురానికి పంపకుండా తన అత్తమామలు వ్యవహరిస్తున్నారంటూ మనస్తాపానికి గురైన సుధాకర్‌ సోమవారం పోలీస్‌స్టేషన్‌కు వచ్చివెళ్తూ సాయంత్రం  మండలకేంద్రంలోని సెల్‌టవర్‌ను ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. విషయం తెలుసుకున్న సుధాకర్‌ తల్లిదండ్రులు, స్నేహితులతో పాటు ఎస్‌ఐ అయోధ్య సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని సుధాకర్‌కు నచ్చజెప్పి కిందకు దించేందుకు నానాహైరాన పడ్డారు. న్యాయం జరిగేలా చూస్తామని ఎస్‌ఐ హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు రాత్రి 7.30 గంటలకు సుధాకర్‌ సెల్‌టవర్‌ దిగికిందకు వచ్చాడు. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
 

మరిన్ని వార్తలు