పీవీకేకే కళాశాల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

3 Aug, 2017 21:49 IST|Sakshi

- ర్యాగింగ్‌ భరించలేకనే అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానం

అనంతపురం సెంట్రల్‌: మాజీ మంత్రి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డికి చెందిన పీవీకేకే కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం సంచలనం రేపింది. నితీష్‌కుమార్‌రెడ్డి అనే బీటెక్‌ విద్యార్థిని ఆలమూరురోడ్డులోని పీవీకేకే కళాశాలకు కూతవేటు దూరంలో మంగళవారం గొంతుకోసిన విషయం విదితమే. గురువారం ఆర్టీసీ బస్టాండ్‌లో ఎంకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పురుగులు మందు తాగింది.  24 గంటలకు గడవకముందే ఇద్దరు విద్యార్థులు ఆస్పత్రి పాలుకావడంతో మంత్రి కళాశాలలో అసలు ఏం జరుగుతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాధితులు, పోలీసుల వివరాల మేరకు.. ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన సర్దానప్ప కుమార్తె రిజ్వాన ఆర్టీసీ బస్టాండ్‌కు సమీపంలోని పీవీకేకే కళాశాలలో ఎంకాం ద్వితీయ సంవత్సరం చదువుతోంది.

గురువారం మధ్యాహ్నం సమయంలో కళాశాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థిని..ఆర్టీసీ బస్టాండ్‌లోకి వెళ్లింది. అప్పటికే తన వద్దనున్న పురుగుల మందును తాగింది.   స్థానికులు గమనించి ప్రభుత్వాస్పత్రికి తరలించి, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం వెనుక అనేక అనుమానాలకు తావిస్తోంది. వరుసగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ర్యాగింగ్‌ రక్కసి వల్లే విద్యార్థులు ఆత్మహత్యాయత్నం చేస్తున్నారని, హత్యాయత్నాలకు పాల్పడుతున్నారని  ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంగళవారం జరిగిన ఘటనలో ముగ్గురు యువకులు ముఖానికి మాస్క్‌లు ధరించి కంపచెట్లలోకి తీసుకెళ్లి గొంతుకోశాడని బాధిత యువకుడు నితీష్‌కుమార్‌రెడ్డి సృహలోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు తెలియజేశాడు. ప్రస్తుతం సదరు విద్యార్థిని కూడా ర్యాగింగ్‌ వల్లే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటుందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ అంశంపై పోలీసులు మాత్రం సదరు విద్యార్థిని అనారోగ్య సమస్యల వల్ల తండ్రికి భారం కాకూడదనే ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఫిర్యాదులో తెలియజేశారని వివరిస్తున్నారు. ఘటనపై త్రీటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

మరిన్ని వార్తలు