చెరిగిపోతున్న చరిత్ర

20 Jul, 2016 22:05 IST|Sakshi
చెరిగిపోతున్న చరిత్ర
అవనిగడ్డ  : 
కృష్ణా పుష్కరాల నేపథ్యంలో స్థానిక లక్ష్మీనారాయణస్వామి ఆలయంలో ఇష్టారాజ్యంగా చేస్తున్న రంగుల తొలగింపు కార్యక్రమం వల్ల ఎంతో విలువైన చారిత్రక ఆధారాలు చెదిరిపోతున్నాయి. రూ.17లక్షలతో ఆలయం చుట్టూ గ్రానైట్స్‌ ఏర్పాటు, గతంలో వేసిన రంగులు, ప్లాస్టింగ్‌ నిర్మాణాల తొలగింపు, సహజ రంగులు వేసే కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉంది. ఆలయం చుట్టూ గ్రానైట్‌ పనులను ఐదు రోజుల కిందటే ప్రారంభించారు. ఆలయం లోపల ఉన్న స్తంభాలపై పలు రకాల శిల్పాలు చెక్కగా, వాటిపై ప్లాస్టింగ్‌ చేయించి రంగులు వేయడంతో మరుగున పడిపోయాయి. వీటిని తొలగించి పూర్వ వైభవం తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టారు. ఎంతో సున్నితమైన ఈ పనులను జాగ్రత్తగా చేయకపోతే చాలా చిత్రాలు, ఆధారాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వెయ్యేళ్ల చరిత్రకు ముప్పు?
ఈ ఆలయాన్ని వెయ్యేళ్ల క్రితం చోళులు నిర్మించారని చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. శిల్పకళా సౌందర్యంతో కూడిన 32 స్తంభాలతో ర«థం ఆకృతిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయం లోపల స్తంభాలపై గోవర్థనోద్ధరణ, కాళింది మర్ధనం, వేణుగోపాల, షోడషభుజ, నటరాజ శిల్పాలతో పాటు ఎన్నో పౌరాణిక శిల్పాలు చెక్కారు. దక్షిణవైపున స్తంభాలపై శ్రీరామ పట్టాభిషేకం ఉంది. ఇవి ఏ కాలం నాటివో చెప్పలేకపోతున్నప్పటికీ.. తదనంతర కాలంలో జరిగిన అభివృద్ధి పనుల దృష్ట్యా కొన్ని స్తంభాలకు రకరకాల డిజైన్లతో ప్లాస్టింగ్‌ పనులు చేయించారు. దీనివల్ల పూర్వపు శిల్పకళా సౌందర్యం మరుగున పడింది. స్తంభాలపై చెక్కిన గుర్రం, మనిషి తల, చిన్నచిన్న గొలుసుల డిజైన్లు, ఆభరణాలు ఇక్కడికి వచ్చే భక్తులను ఎంతో అబ్బురపరిచేవి. అంతేకాదు చారిత్రక ఆనవాళ్లు తెలియజేసే పలు రకాల శాసనాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆలయం మూల భాగాల్లో చేసిన రాతి గొలుసులు ఆనాటి శిల్పకళకు అద్దం పడుతుండగా, నేటి జిమ్మాస్టిక్‌ని పోలిన స్త్రీల నాట్యభంగిమలు, శ్లాబుపై చెక్కిన నాగేంద్రుడి చిత్రాలతో పాటు ఎన్నో సున్నితమైన శిల్పాలు ఉన్నాయి. ప్రస్తుతం పాత పెయింటింగ్, ప్టాస్టింగ్‌ తొలగింపు కార్యక్రమం చేపట్టగా జాగ్రత్తగా పనులు చేయకపోతే చాలా చారిత్రక ఆధారాలు చెరిగిపోయే ప్రమాదముంది. ఇటీవల మూడు రోజుల పాటు  ఆలయం లోపల రెండు స్తంభాలపై చేసిన ప్లాస్టింగ్‌ని తొలగించే సమయంలో స్తంభాలపై చెక్కిన అద్భుత శిల్పకళా చిత్రాలు విరిగిపోయాయి. పనులు జాగ్రత్తగా చేయకపోతే చారిత్రక ఆధారాలు కనుమరుగయ్యే ప్రమాదముంది.
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా