నిన్న హిందూపురం..నేడు అనంతపురం

29 Sep, 2016 22:43 IST|Sakshi

– పరీక్షలకు ముందే విద్యార్థుల చేతుల్లో ప్రశ్నపత్రాలు
– చివరిరోజూ ఇంగ్లిష్‌ పరీక్షలోనూ అదేతంతు

అనంతపురం ఎడ్యుకేషన్‌ : నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానం అమలులో భాగంగా 6–10  తరగతుల విద్యార్థులకు నిర్వహిస్తున్న సమ్మేటివ్‌–1 పరీక్షల నిర్వహణ అభాసుపాలవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా తొలిసారి కామన్‌ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో చాలా పకడ్బందీగా నిర్వహించాలంటూ రాష్ట్ర స్థాయి అధికారుల ఆదేశాలు నవ్వులపాలయ్యాయి. పరీక్ష రోజు 15 నిముషాల ముందు హెచ్‌ఎంల సమక్షంలో ప్రశ్నపత్రాలు బండిళ్లు తెరవాలంటూ జిల్లా విద్యాశాఖ అధికారి అంజయ్య, డీసీఈబీ సెక్రటరీ నాగభూషణం సూచించారు. అయితే క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా  జరుగుతోంది. ప్రశ్నపత్రం ముందు రోజే విద్యార్థుల చేతుల్లో ఉంటోంది. జిల్లాలో చాలాచోట్ల ఈ పరిస్థితులే కనిపించాయి.

రెండు రోజుల కిందట హిందూపురం పట్టణంలోని పలు ప్రాంతాల్లో  జిరాక్స్‌ సెంటర్లలో  ప్రశ్నపత్రాలు అమ్మిన సంగతి తెలిసిందే. తాజాగా గురువారం నిర్వహించిన చివరి పరీక్ష ఇంగ్లీష్‌ ప్రశ్నపత్రం కూడా అనంతపురం నగరంలోని వివిధ స్కూళ్ల విద్యార్థుల చేతుల్లో ఉదయాన్నే దర్శనమిచ్చాయి. వాస్తవానికి ఈ పరీక్ష ఈనెల 23న జరగాల్సి ఉండగా...గురువారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. నగరంలోని  వివిధ ప్రైవేట్‌ స్కూళ్లలో ఉదయం 6.30 కే పదో తరగతి విద్యార్థులు ఇంగ్లిష్‌ ప్రశ్నపత్రాలు చేతిలో పట్టుకుని  జవాబులు నేర్చుకుంటున్న వైనాన్ని యాజమాన్యాలు గుర్తించాయి. ప్రశ్నపత్రాలు చూసి అవాక్కయ్యారు.  

అధికారుల అలసత్వం
పరీక్షల నిర్వహణలో సంబంధిత అధికారుల అలసత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.  తరలింపులో జరిగిన నిర్లక్ష్య కారణంగానే ప్రశ్నపత్రాలు బయటకు లీకయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమ్మేటివ్‌–1,2 పరీక్షలకు ఎలాంటి ప్రాధాన్యత ఉండదనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేసినా...అధికారులు చేస్తున్న హడావుడితో తక్కువ మార్కులు వస్తే ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయనే భయంతోనే కొన్ని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ప్రశ్నపత్రాలు ముందుగానే విద్యార్థులకు ఇచ్చినట్లు తెలిసింది. ఒకే మారు రెండువేల స్కూళ్లల్లో పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో రహస్యంగా నిర్వహించడం అసాధ్యమని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. అందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయలేదని వారు ఆరోపిస్తున్నారు.  కాగా ప్రశ్నపత్రాలు లీకైన విషయంపై విద్యాశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

మరిన్ని వార్తలు