అయ్యో..! అతివ

3 Feb, 2017 23:29 IST|Sakshi
అయ్యో..! అతివ
  • రాజధాని నగరంలో మహిళల భద్రత ప్రశ్నార్థకమే
  • విజయవాడలో హడలెత్తిస్తున్న మహిళలపై నేరాలు
  • 2016లో అమాంతంగా పెరిగిన కేసుల సంఖ్య
  • ‘శాంతిభద్రతలు... ప్రత్యేకించి మహిళల భద్రత విషయంలో అత్యంత కఠినంగా ఉంటాం. అమరావతి ప్రాంతాన్ని ప్రజా రాజధానిగా తీర్చిదిద్దుతాం’అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనంగా చెప్పుకుంటున్నారు. కానీ విజయవాడలో మహిళల భద్రత గాలిలో దీపంలా మారింది. మహిళలకు ఏమాత్రం రక్షణలేని, దాడులు పెరుగుతున్న నగరంగా విజయవాడ రూపాంతరం చెందుతుండటం ఆందోళన  కలిగిస్తున్న వాస్తవం.
     – సాక్షి, అమరావతిబ్యూరో

    సాక్షి, అమరావతిబ్యూరో : విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మహిళలకు రక్షణ లేకుండాపోయింది. మహిళా హత్యలు, వరకట్న హత్యలు, వేధింపులు, ఆత్మహత్య చేసుకునేలా వేధింపులు, లైంగికదాడులు... ఇలా  అన్ని రకాల కేసులు పెరుగుతున్నాయి. 2015 కంటే 2016లో నగర పరిధిలో మహిళలపై దాడులు, వేధింపుల కేసులు బాగా పెరిగాయి. 2015లో  మొత్తం 464 కేసులు నమోదయ్యాయి. 2016లో ఏకంగా 760 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్న వాస్తవం. అంటే నేరాలు  63 శాతం అధికమయ్యాయి.

    ► 2015లో ఒక్క వరకట్న హత్య కూడా లేదు.  2016లో ఐదు వరకట్న హత్యలు జరిగాయి.
    ► మహిళలపై వివిధ రకాల వేధింపుల కేసులు 2015లో 175 నమోదయ్యాయి.  2016లో ఏకంగా 411 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
    ► కమిషరేట్‌ పరిధిలో మహిళలపై లైంగిక దాడులు అమాంతం పెరుగుతున్నాయి. 2015లో నగరంలో లైంగికదాడులు కేసులు 53 నమోదయ్యాయి. 2016లో 70 నమోదు కావడం ఆందోళనకరంగా మారింది.
    ► మహిళలను అపహరించిన కేసులు 2015లో 21 నమోదయ్యాయి. 2016లో 26 కేసులు నమోదు కావడం గమనార్హం.
    ► మహిళలపై దాడులకు పాల్పడి వారి గౌరవానికి భంగం కలిగిస్తున్న కేసులు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. 2015లో ఇలాంటి కేసులు 156 నమోదయ్యాయి.  2016లో 198 కేసులు నమోదు కావడం మహిళలపై పెరుగుతున్న దాడులకు నిదర్శనం.
    ► 2015లోనూ, 2016లోనూ నగర పరిధిలో వరకట్న వేధింపుల వల్ల ఆత్మహత్యలు 10 చొప్పున నమోదయ్యాయి.
    ► ఆత్మహత్య చేసుకునేలా వేధింపులకు గురిచేసిన కేసులు కూడా 2015లో 25 ఉండగా,  2016లో 24 నమోదయ్యాయి.

    లైంగికదాడులను అరికట్టలేరా!
    మహిళలపై నేరాల్లో లైంగికదాడులు, వేధింపులు పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రాజధానిగా రూపాంతరం చెందిన తరువాత నగరంలో లైంగికదాడు లు అధికం కావడం విస్మయకర వాస్తవం.
    ► 2012లో 47, 2013లో 40 లైంగిక దాడులు జరిగాయి. 2014 నుంచి పెరుగుతూ వస్తున్నాయి. 2014లో 61, 2015లో 53  కేసులు నమోదయ్యాయి. 2016లో ఏకంగా 70 కేసులు నమోదు కావడం గమనార్హం.

    ప్రభుత్వం ఏం చేస్తున్నట్టో...!
    ముఖ్యమంత్రి చంద్రబాబు సహా అధికార యంత్రాంగం అంతా విజయవాడలోనే కేంద్రీకృతమై ఉంది. కానీ రాజధానికి తగ్గట్లుగా రక్షణ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయ లేదు. కేవలం వీఐపీల భద్రత, హంగు ఆర్భాటాలకే పోలీసు వ్యవస్థను వాడుకుంటు న్నారు. దాంతో సామాన్యులకు ప్రత్యేకించి మహిళల రక్షణపై దృష్టిసారించలేకపోతు న్నామని పోలీసు వర్గాలే చెబుతుండటం గమనార్హం.

    సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చిన తరువాత కూడా...
    మహిళలపై వేధింపులు, దాడులకు సంబంధించిన కేసులను ఏకపక్షంగా నమోదు చేయొద్దని 2014లో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. మొదట ఇరువర్గాలతో మాట్లాడి వాస్తవాలను తెలుసుకోవాలని  పోలీసులను ఆదేశించింది. అప్పటి నుంచి వచ్చిన ఫిర్యాదులను యథాతథంగా కేసులుగా నమోదు చేయడం లేదు. ఇరువర్గాలతో సంప్రదించి వీలైనంతవరకు రాజీ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. దాంతో కేసుల సంఖ్య తగ్గుతుందని అంతా భావించారు. కానీ 2014 తరువాత విజయవాడలో మహిళలపై దాడులు, వేధింపుల కేసులు మాత్రం అమాంతంగా పెరుగుతూనే ఉన్నాయి. అంటే నేరాల తీవ్రత ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది.

>
మరిన్ని వార్తలు