ప్రశాంత వాతావరణం అవసరం

15 Jul, 2017 23:01 IST|Sakshi
ప్రశాంత వాతావరణం అవసరం

పోలీసుశాఖ ప్రతిష్ట దిగజారిస్తే ఉపేక్షించను
– ప్రజా సమస్యల పరిష్కారానికి ‘క్విక్‌ రెస్పాన్స్‌ టీం’
– నేర సమీక్షలో ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌


అనంతపురం సెంట్రల్‌ : పారిశ్రామికంగా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న జిల్లాలో ప్రశాంత వాతావరణం, భద్రత కల్పించాల్ని బాధ్యత పోలీసుశాఖపై ఉందని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. శనివారం నగరంలోని పోలీసు కాన్ఫరెన్స్‌హాలులో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ కరువు జిల్లా అభివృద్ధికి తోడ్పడుతూ ఉపాధి అవకాశాలు కల్పించే సంస్థలకు ప్రజల తరుఫున భరోసా ఇవ్వాలని సూచించారు. జిల్లాలో ఎట్టి పరిస్థితులలో శాంతి భద్రతలు అదుపులో ఉండాల్సిందేనన్నారు. జిల్లాకు చెడ్డపేరు తెస్తున్న ఫ్యాక‌్షన్, గ్రూపు తగాదాల కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మట్కా, పేకాట, క్రికెట్‌ బెట్టింగ్‌ తదితర అసాంఘిక కార్యకలాపాలను పక్కాగా నియంత్రించాలన్నారు. బాధితుల సమస్యలు తక్షణమే పరిష్కరించేందుకు త్వరలోనే ‘క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్‌’లను ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన సేవలందించాలని నిర్ణయించారు. కదిరి, హిందూపురం లాంటి పట్టణాల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పేలా అన్ని వర్గాల ప్రజలతో సఖ్యతగా వ్యవహరించాలని సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్‌ చాలా ముఖ్యమని హితవు పలికారు. సామాజిక సేవా కార్యక్రమాల సందర్భంగా యువత భాగస్వామ్యం తీసుకోవాలన్నారు. 

ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగించి పోలీసులపై విశ్వాసం పెంపొందించేలా కృషి చేయాలని తెలిపారు. పోలీసు శాఖ ప్రతిష్ట పెంచే విధంగా ప్రతి ఒక్కరూ విధులు నిర్వహించాలన్నారు. అంతేగానీ దిగజార్చే విధంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, రోడ్డు ప్రమాదాల నివారించేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు, పలువురు ఎస్‌ఐలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు