సార్.. నేను బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాను...

20 Aug, 2015 22:41 IST|Sakshi

ఆదోని: సర్, నేను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను. మీ ఏటీఎం కార్డు బ్లాక్ అయింది. దానిపై ఉన్న నెంబర్లు చెబితే అన్‌లాక్ చేస్తాం అని ఓ అఘంతకుడు ఫోన్ చేయగానే పట్టణంలోని సంతపేటకు చెందిన రిటైర్డ్ టీచర్ ఆరీఫుల్లా వెనకాముందు ఆలోచించకుండా ఏటీఎం కార్డుపై ఉన్న నంబరును చెప్పేశారు. 20నిమిషాల వ్యవధిలో రూ.41,900, 47,900 మొత్తం రూ.96,800 అరీఫుల్లా బ్యాంక్ అకౌంట్ నుంచి డ్రా అయ్యాయి. అయితే తన అకౌంట్ నుంచి రెండు విడతల్లో మొత్తం రూ.96,800 డ్రా అయినట్లు గురువారం తన సెల్‌ఫోన్‌కు మెస్సేజ్ రావడంతో ఆరీఫుల్లా అవాక్కయ్యారు.

వెంటనే తన అకౌంట్ ఉన్న స్టేట్ బ్యాంక్‌కు వెళ్ళి విచారించారు. సదరుమొత్తం బెంగుళూరులోని ఓ ఏటీఎం నుంచి డ్రా అయినట్లు మేనేజర్ తెలిపారు. దిక్కు తోచని రిటైర్డ్ టీచర్ వన్ టౌన్ పోలీసుల వద్దకు వెళ్ళి తన గోడు వెళ్ళబోసుకున్నారు. గుర్తు తెలియని అఘంతకులు ఫోన్ చేసి అడిగితే ఏటీఎం నంబరు ఎలా చెప్పారంటూ ఎస్‌ఐ రామయ్య అడిగిన ప్రశ్నకు బాధితుడి నోట మాట రాలేదు. అగంతకులు ఎలా మోసాలకు పాల్పడుతున్నారో పత్రికలు, టీవీల్లో విస్తృతంగా కథనాలు వస్తున్నా అమాయకులు బలవుతూనే ఉన్నారని చెప్పేందుకు అరీఫుల్లా తాజా ఉదాహరణ. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 420ఛీటింగ్, 66సి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ రామయ్య తెలిపారు.

రెండు విడతల్లో డ్రా అయిన మొత్తం ఫ్లిప్‌కాట్, అమెజాన్ సంస్థల బ్యాంక్ అకౌంట్లకు జమ అయినట్లు బెంగుళూరులో ఉన్న అరీఫుల్లా బంధువుల ద్వారా తెలిసిందని, అఘంతకులు ఆ రెండు సంస్థల్లో పలు వస్తువులు కొనుగోలు చేసి అరీఫుల్లా ఏటీఎం కార్డును దుర్వినియోగం చేసినట్లు తెలుస్తోందని ఎస్‌ఐ రామయ్య అన్నారు. వస్తువులు ఇంకా సంబంధిత వ్యక్తులకు పంపలేదని, ఆ రెండు సంస్థల ద్వారా అగంతకులను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ చెప్పారు.

>
మరిన్ని వార్తలు