తెలుగు సాహిత్యంలో చెరగని సంతకం రావిశాస్త్రి

28 Jul, 2016 21:47 IST|Sakshi
తెలుగు సాహిత్యంలో చెరగని సంతకం రావిశాస్త్రి
 • –తెలుగువారికి అపూర్వ అక్షరసంపద అందించిన రావి శాస్త్రి 
 • –30న రావిశాస్త్రి లిటరరీ ట్రస్ట్‌ ఆవిర్భావం
 • –రామతీర్థకు అవార్డు బహూకరణ
 • కొన్ని రచనలు చదువుతున్నప్పుడు నవ్వు ఆపుకోవడం మనవల్లకాదు. మరికొన్ని ఇందుకు భిన్నంగా ఒకలాంటి విషాదంలో ముంచెత్తుతాయి. ఓ తెలుగు రచన చదువుతున్నంత సేపు పాఠకులకు నవ్వును, దుఃఖాన్ని, ఏకకాలంలో అనుభవంలోకి తీసుకురాగలిగిన రచయితల్లో రాచకొండ విశ్వనాథ శాస్త్రి రచనలేనని చెప్పాలి. ఆధునిక వచన సాహిత్యంలో ఆయనదొక ఆచార్యపీఠం. అయనొక కులపతి. రెండుమూడు దశాబ్దాల యువ రచయితలపై ఆయన రచనలు, వ్యక్తిగత ప్రభావం పడింది. ఇకపై మన సాహిత్యవీధులవలె విశాఖపట్నం వీధులు కూడా ఆయన లేని లోటు పూడ్చడానికి ఉత్తరాంధ్ర సన్నద్ధమైంది. కొన్ని దశాబ్దాలలో రావిశాస్త్రి సాహిత్యసష్టి తక్కువేమీ కాదు. సారోకథలు, సారా కథలు, ఖాకీ కథల వంటి కొన్ని వందల కథలు, రాజు–మహిషి, రత్తాలు–రాంబాబు, గోవులొస్తున్నాయి జాగ్రత్త, సొమ్ములు పోనాయండి వంటి నవలలు, నిజం, విషాదం,తిర‌స్కృతి వంటి నాటకాలు, ఇంకా ఎన్నో ఇతర రచనలు ఆయన తెలుగు వారికిచ్చి పోయిన సాహిత్య వారసత్వం. 
  –విశాఖకల్చరల్‌   
   
   కళింగాంధ్ర మాండలిక రచనా చక్రవర్తి రాచకొండ విశ్వనాథశాస్త్రి తెలుగు సాహిత్యంలో ఆయన ఉండేడువంటి పేరుప్రఖ్యాతలు అనన్యమైనవి. విశాఖలో పుట్టిపెరిగిన రావిశాస్త్రిగారి గురించి ఆయన తెలుగు సాహిత్యానికి చేసిన సేవల దష్ట్యా రావిశాస్త్రి జ్ఞాపకాన్ని స్థిరస్థాయిగా ఉండేవిధంగా చేయాల్సిన బాధ్యత తెలుగు సాహితీ ప్రేమికులపై ఎంతైనా ఉంది.  ముఖ్యంగా విశాఖ రచయితలకు ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే రావిశాస్త్రి 95వ జయంతి రోజున (జూలై30న ) ఒక ప్రముఖ సాహితీవేత్తకు అవార్డు ఇవ్వాలనే సంకల్పం పుట్టింది. కొంతకాలం ఈ ఆలోచన నలుగుతున్నప్పటికీ రావిశాస్త్రి కుటుంబ సభ్యుడు (తమ్ముడు) రాచకొండ నరసింహ శర్మ, రావిశాస్త్రి కుమారుడు ఉమా కుమారశర్మ ముందుకు రావడంతో విశాఖలో ఉన్న సాహితీ ప్రముఖలంతా ‘రావిశాస్త్రి లిటరరీ ట్రస్ట్‌’ ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్‌లో ఆచార్య చందు సుబ్బారావు, సాహితీ సురభి వ్యవస్థాపకుడు సాహితీవేత్త  కల్యాణరామారావు, బహుభాషా సాహితీవేత్త, కేంద్ర సాహితి అకాడమీ అవార్డు గ్రహీత ఎల్‌.ఆర్‌.స్వామి, సాహితీవేత్త పి.జయశీలరావు, కవయిత్రి జగద్ధాత్రి తదితరులు సభ్యులు. 
  సాహితీ మిత్రుల సహకారం చాలా గొప్పది  
   విశాఖసాహిత్యమిత్రులతో కలసి నాన్నగారి ఆశయాన్ని ఆయన సాహిత్య గుళికల్ని సమాజానికి మరింత చేరువ చేసేందుకు సహకరిస్తారని ఆశిస్తున్నాను. ప్రతి ఏడాది భారత దేశంలో ఉన్న సాహిత్యసేవ చేసే సాహితీమిత్రులందరూ రావిశాస్త్రి అవార్డు పొందడానికి అర్హులే. రావిశాస్త్రి శతజయంతి మరో ఐదేళ్లలో రాబోతున్న ఈ తరుణంలో ఈ ట్రస్ట్‌ ఆవిర్భావం, అందుకు నగరానికి చెందిన సాహితీ మిత్రులు సహకరించడం ఈ ట్రస్టు ముందుకు కొనసాగుతుందని అభిలషిస్తున్నాను.
  –రాచకొండ ఉమా కుమార శాస్త్రి, ట్రస్ట్‌ నిర్వాహకులు
   
  అక్షర‘తీర్థం’..సముచిత సత్కారం
  నగరానికి చెందిన రామతీర్థ ప్రముఖ కవి, సాహితీ విమర్శకుడు,అనువాదకులు, ఆంధ్రాంగ్ల భాషల సాహితీవేత్త. సాహితీ సమావేశాల నిర్వాహకులు. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్న రచయిత. ఆయనకు ‘రావిశాస్త్రి అవార్డు–2016’ ఇవ్వటం సముచితమని తెలుగు సాహిత్యలోకం ముక్త కంఠంతో ప్రశంసిస్తోంది.
  –ఎల్‌.ఆర్‌.స్వామి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత
  సంతృప్తినిచ్చింది 
  రావిశాస్త్రి 20 శతాబ్దాలు తెలుగు వచన సాహిత్యంలో మహా వటవక్షంలాంటివారు. ఇలాంటి చెట్ల కింద మొక్కలు మొలవని అంటారు కానీ..ప్రపంచ ధర్మంలో రావిశాస్త్రిగారి నీడలో తెలుగులో అనేకమంది కథకులు సమాజం గురించి,పేద బడుగు బలహీన జీవిత అవసరాల గురించి కళాత్మకంగా రాయడానికి ఎంతో స్ఫూర్తి పొందారు. అటువంటి రావిశాస్త్రి పేరిట ఒక ట్రస్ట్‌ ఏర్పడి, విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తూ తమ తొలి ‘రావిశాస్త్రి అవార్డు–2016’ను నాకు ప్రకటించడం పట్ల నేను కూడా జీవిస్తున్న ఈ ఊరు, ఇక్కడి సాహిత్యలోకం నన్ను గుర్తించినందుకు ఒక సంతృప్తి ఉంది. ఈ స్ఫూర్తితో తెలుగు సాహిత్యానికి వెలుగు దివిటీలుగా మన ప్రాంతం నుంచి గత శతాబ్దంలో విస్తారమైన కృషి చేసిన సాహిత్యవేత్తల ప్రతిష్ట, ప్రయోజనం, ఇంకా ప్రజాపక్షంగా విశాలమయ్యేలా ఇది ఒక మంచి సందర్భంగా నేను భావిస్తున్నాను. ట్రస్ట్‌కు కతజ్ఞతలు. 
  –రామతీర్థ, ప్రముఖ కవి, సాహితీ విమర్శకుడు, అనువాదకుడు

   

   
  ఆధునిక సాహిత్యాన్ని  భుజాన వేసుకుని
  విశాఖలో ఆధునిక సాహిత్యాన్ని భుజానవేసుకుని మోస్తున్న రచయితల్లో రామతీర్థ ఒకరు. సమాజ హితానికే సాహిత్యం ఉపయోపగపడాలనే దీక్షాపరుడు. సామాజిక రచయితలైన శ్రీశ్రీ, రాచకొండ విశ్వనాథశాస్త్రి,ఆరుద్ర, సోమసుందర్, పురిపండా వారసత్వాన్ని కొనసాగించడానికి కషి చేస్తున్నవాళ్లలో ప్రధానమైన రచయిత. మంచి అనువాదాలు. సాహిత్యాన్ని విస్తృత‌మైన‌ ప్రచారం కల్పించడానికి అహర్నిశలు కషి చేస్తున్నారు. స్వార్థం లేకుండా సాహితీ వ్యక్తుల ప్రాధాన్యత కోసం కృషి చేస్తూ, రచయితల్లో ఒక చైతన్యాన్ని నెలకొల్పడానికి నిర్విరామంగా పనిచేస్తున్నారు. విశాఖలో సామాజిక సాహిత్య వర్గానికి కొంత మేలు జరుగుతుందనే భావనతో రామతీర్థను ఎంపిక జరిగింది.
  –ఆచార్య చందు సుబ్బారావు, రావిశాస్త్రి లిటరరీ ట్రస్ట్‌ సభ్యుడు 
   
  నిరంతర చైతన్యశీలి  
  రామతీర్థ సాహిత్యంలో నిరంతర చైతన్యశీలి. పాశ్చత్య సాహిత్యాన్ని కూడా బాగా చదివిన రచయిత. చదివి వదిలేయకుండా పాశ్యాత్యసాహిత్య ధోరణికి, భారతీయ సాహిత్యధోరణికి  మధ్య గల తేడా, కారకాలను విశ్లేషించడం ఆయన ప్రత్యేకత. సాహిత్యోపన్యాసాలు చేస్తూ చైతన్య దీపికలను సిద్ధం చేస్తున్నారు.  
  – కల్యాణ రామారావు, సాహిత్య సురభి వ్యవస్థాపక అధ్యక్షుడు 
   
  రేపు రావిశాస్త్రి లిటరరీ ట్రస్ట్‌ ఆవిష్కరణ  
  రావిశాస్త్రి లిటరరీ ట్రస్ట్‌ తరఫున మొదటి రావిశాస్త్రి అవార్డు జూలై 30న విశాఖ పౌరగ్రంథాలయంలో జరిగే సభలో ట్రస్ట్‌ ఆవిర్భావం, అవార్డు ప్రదానోత్సవం నిర్వహిస్తారు. రావిశాస్త్రి లిటరరీ ట్రస్ట్‌ను  ‘సాక్షి’ ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ కె. రామచంద్రమూర్తి ప్రారంభించి ప్రముఖ కవి, సాహితీ విమర్శకుడు రామతీర్థకు ‘రావిశాస్త్రి–2016’ అవార్డును బహూకరిస్తారు.
    
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు