తలదించుకుని వెళ్లాలి..!

4 Sep, 2016 09:22 IST|Sakshi

సిద్ధార్థ ఫార్మశీ కళాశాలలో సీనియర్ల ర్యాగింగ్
ఎదురుతిరిగిన జూనియర్లు
ఇరువర్గాల మధ్య ఘర్షణ, తోపులాట
 
నూజివీడు : తాము ఎదురొస్తే తలదించుకుని వెళ్లాలి.. సీనియర్లు అంటే గౌరవం ఉండాలి.. తమ ముందు నడవకూడదని.. ఇలా సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం  పట్టణంలోని సిద్ధార్థ ఫార్మశీ కళాశాలలో ఇలాగే ర్యాగింగ్ చేశారని తెలిసింది. ఫార్మశీ నాలుగో సంవత్సరం విద్యార్థులు  ప్రథమ సంవత్సరం విద్యార్థులను ర్యాగింగ్ చేస్తుండడంతో వారు కూడా ఎదురు తిరిగారు.

ఇరువర్గాల మధ్య వివాదం తోపులాటకు దారితీసింది. సీనియర్ విద్యార్థుల పట్ల గౌరవంగా ఉండాలని, తాము ఎదురొస్తే తలవంచుకుని వెళ్లాలని, మా ముందు నడవకూడదని, పాటలకు డ్యాన్స్‌లు వేయాలని  ర్యాగింగ్ చేస్తున్నారు. అంతేగాకుండా తమ పేర్లు ఏమిటో చెప్పాలని సీనియర్ విద్యార్థులు అడుగుతున్నారని, దీనికి మీపేర్లు తెలియదని జూనియర్లు చెబితే, మా పేర్లు ఎందుకు తెలుసుకోలేదని చెంపమీద కొడుతున్నారు.

ఇలా కొట్టగా ఒక విద్యార్థి కళ్లజోడు కూడా పగిలింది. ఈ విధంగా ర్యాగింగ్ జరుగుతుండడంతో పట్టణానికి చెందిన ప్రథమ సంవత్సరం విద్యార్థి ఒకరు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు. వారు వచ్చి సీనియర్ విద్యార్థులను నిలదీసే క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం ఇరువర్గాల మధ్య జరిగిన వివాదం తోపులాటకు దారితీసింది.

ఈ విషయం పోలీసులకు తెలిసినప్పటికీ కళాశాల యాజమాన్యం గొడవ ఏమీలేదని తెలపడంతో వారు వెనుదిరిగి వెళ్లిపోయారే తప్పితే ర్యాగింగ్ అంశంపై ఆరా తీయలేదు. ర్యాగింగ్ విషయమై ప్రథమ సంవత్సర విద్యార్థులు కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకు వెళ్లినా సరిగా పట్టించుకోకపోవడంతో వారు తమ కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు.

వారు రావడంతో కళాశాల వెలుపల గొడవ, ఇరువర్గాల మధ్య తోపులాట  జరిగింది. రా్యాగింగ్‌కు కారణమైన ఆఖరి సంవత్సరం విద్యార్థులను తల్లిదండ్రులను తీసుకురమ్మంటూ యాజమాన్యం ఇంటికి పంపించడంతో వారు శనివారం కళాశాలకు రాలేదు.
 
చిన్నవిషయమే
కళాశాలలో విద్యార్థుల మధ్య ఇగో సమస్య కారణంగా ఉత్పన్నమైనదే తప్ప సమస్యేమీ కాదు.  తల్లిదండ్రులను తీసుకురమ్మని  విద్యార్థులకు తెలిపాం. ఇన్నేళ్లలో కళాశాలలో ఎన్నడూ ర్యాగింగ్ అనేది లేదు. - శ్రీనాథ్  నిశ్శంకరరావు, ప్రిన్సిపాల్

మరిన్ని వార్తలు