డీఈఓగా డైట్‌ ప్రిన్సిపాల్‌ రాఘవరెడ్డి?

30 Aug, 2017 23:23 IST|Sakshi
డీఈఓగా డైట్‌ ప్రిన్సిపాల్‌ రాఘవరెడ్డి?
– జిల్లాకు డీఈఓగా వచ్చేందుకు ఆసక్తి చూపని అధికారులు
– పీఓగా తాహెరా సుల్తానాను నియమించే అవకాశం?
 
కర్నూలు సిటీ: జిల్లా విద్యాశాఖ అధికారిగా పదోన్నతుల ద్వారా వచ్చేందుకు అధికారులు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. గతంలో జరిగిన సంఘటనలు, కొన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకుల తీరు, రాజకీయ నాయకుల జోక్యం అధికంగా ఉండడమే అందుకు కారణమనే విమర్శలున్నాయి. అయితే నిన్న, మొన్నటి వరకు డీఈఓగా గతంలో జిల్లాలో డిప్యూటీ ఈఓగా పని చేసిన సుబ్బారావు వస్తారని విద్యాశాఖ వర్గాల్లో చర్చ జరిగింది. ఇక్కడికి డీఈఓగా రావాలంటే అమరావతిలోని అధికారి పార్టీ నేతలకు కనీసం రూ.25 లక్షలు చెల్లించాలనే షరతు పెట్టడంతో అంతా మొత్తంలో చెల్లించలేనని చెప్పినట్లు తెలిసింది. కడప, అనంతపురం జిల్లాల్లో ఏదో ఓ జిల్లాకు ఆయన డీఈఓగా వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. 
 
28మందికి పదోన్నతులకు ఆమోదం
డిప్యూటీ ఈఓ, ప్రభుత్వ డైట్, బీఈడీ కాలేజీ ప్రిన్సిపాళ్లకు డీఈఓలుగా పదోన్నతులు కల్పించేందుకు మంగళవారం విజయవాడలో జరిగిన మంత్రి సమావేశంలో 28 మంది జాబితాతో డీపీసీ ఆమోదం పొందింది. మొదట్లో 14 మందితో జాబితా తయారు చేశారు. అయితే సర్వశిక్ష అభియాన్‌ పీఓలుగా కూడా డీఈఓ స్థాయి అధికారులుగా పని చేయాలనే ఉద్దేశం, విద్యాశాఖతో సంబంధంలేని వారు పీఓలుగా వస్తుండడం వల్ల ప్రయోజనం ఉండడం లేదని, అందుకే విద్యాశాఖతో సంబంధం ఉన్న వారిని డీఈఓ స్థాయి వారిని పీఓలుగా నియమించేందుకు మరో 14 మంది జాబితాను తయారు చేసి మొత్తంగా 28 మందికి డీపీసీ ఆమోదం తెలిపింది. ఈ కారణంతోనే ప్రస్తుత డీఈఓ ఎస్‌.తాహెరా సుల్తానా మంగళవారం విజయవాడకు వెళ్లారు. 
 
డైట్‌ ప్రిన్సిపాల్‌ రాఘవరెడ్డికి పదోన్నతి
అధికార పార్టీ నేతలు నిర్ణయించినంత సొమ్ము ఇచ్చి డీఈఓగా జిల్లాకు వచ్చేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో పదోన్నతుల జాబితాలో ఉన్నటువంటి కర్నూలు ప్రభుత్వ డైట్‌ ప్రిన్సిపాల్‌ రాఘవరెడ్డిని డీఈఓగా నియమించేందుకు ప్రిన్సిపల్‌ సెక్రటరీ అంగీకరించినట్లు సమాచారం. అయితే మంత్రి మరో రెండు రోజులు వేచి చూసి నిర్ణయించుదామని చెప్పినట్లు తెలిసింది. కాగా ప్రస్తుత డీఈఓ తాహెరా సుల్తానా కూడా తననే కొనసాగించాలని అధికార పార్టీ నాయకుల ద్వారా ప్రయత్నించినా, అధికారులు మాత్రం పీఓగా నియమించేందుకే నిర్ణయించినట్లు చర్చ జరుగుతోంది. ఏదిఏమైనా రెండు, మూడు రోజుల్లో కొత్త డీఈఓ నియమాకంపై ఉత్తర్వులు రానున్నాయి.
 
మరిన్ని వార్తలు