టీడీపీ రహస్య ఎజెండా

7 Dec, 2016 18:28 IST|Sakshi
టీడీపీ రహస్య ఎజెండా

అమరావతిః రాష్ట్రంలో విద్య వియ్యంకుల చేతుల్లోకి వెళ్లిన తర్వాత ప్రభుత్వ కళాశాలల అధ్యాపకుల పరిస్థితి దారుణంగా తయారైందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. డిమాండ్ల సాధనకోసం ప్రభుత్వ కళాశాలల్లో కాంట్రాక్టు పద్ధతిన విధులు నిర్వర్తిస్తున్న అధ్యాపకులు కొన్ని రోజులుగా విజయవాడలో నిరవధిగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. రఘువీరారెడ్డితో పాటు పీసీసీ నేతలు పి.బాలరాజు, గిడుగు రుద్రరాజు, టీజేఆర్ సుదాకర్ బాబు, మల్లాది విష్ణు, రాజీవ్ రతన్, శాంతిభూషణ్ తదితరులు బుధవారం వారి దీక్షా శిబిరం వద్దకు వెళ్లి మద్ధతు ప్రకటించారు.

దీక్షకు మద్ధతు తెలిపిన అనంతరం పీసీసీ అధ్యక్షులు మాట్లాడుతూ 16 ఏళ్లుగా చాలీచాలని జీతంతో కాంట్రాక్టు అధ్యాపకులు ఉద్యోగాలు చేస్తున్నారని, ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వ కళాశాలలను మూసివేసేందుకు టీడీపీ రహస్య ఎజెండాను అమలు చేస్తోందన్నారు. గతంలో స్పిన్నింగ్ మిల్లు, షుగర్ ఫ్యాక్టరీ, పాల డెయిరీలను మూసివేసిన టీడీపీ ప్రభుత్వం ప్రస్తుతం కార్పొరేట్ కశాశాల మాఫియాకు దోచిపెట్టేందుకు ప్రభుత్వ కళాశాలలను నిర్వీర్యం చేసి అనంతరం మూసివేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్దీకరించాలని, పదో వేతన సంఘం సిఫార్సులను అమలు చేయాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు