అమ్మా మేమిక్కడ చదవలేం..!

4 Nov, 2016 02:22 IST|Sakshi
అమ్మా మేమిక్కడ చదవలేం..!

రిమ్స్‌లో ర్యాగింగ్ భూతం!
గుంటూరు తరహా ఘటనలు జరగకుండా నివారణ చర్యలేవీ?
ర్యాగింగ్ నిరోధక కమిటీల జాడ ఏదీ?
ఫ్రెషర్స్‌డే రోజు వరకు వేధింపులు తప్పవా? 

సమాజంలో ఎంతో గౌరవప్రదమైన వ్యక్తి వైద్యుడు. ప్రజలు దేవుడితో సమానంగా వారిని చూస్తారు. అలాంటి వృత్తిలోకి త్వరలో వారంతా అడుగుపెట్టేవారే.. కానీ ఆ విలువలను కాలరాస్తూ తమ తర్వాత వచ్చేవారికి ఆదర్శంగా ఉండటం మాని వారితో వికృతంగా ప్రవర్తిస్తున్నారు. జూనియర్లను వేధిస్తూ వికృతానందం పొందుతున్నారు.. ఇటీవల కాలంలో రిమ్స్‌లో జరుగుతున్న ర్యాగింగ్ ఘటనలు వెలుగులోకి రాకపోరుునా.. బాధిత విద్యార్థులతల్లిదండ్రుల ద్వారా వినతులు మీడియాకు చేరుతున్నారుు. గుంటూరు లాంటి ఘటనలు చోటుచేసుకోకముందే అధికారులు మేల్కోవాల్సి ఉంది. 

అనంతపురం జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని సీనియర్ విద్యార్థులు వేధిస్తున్నారు. ముఖ్యం గా రూమ్‌లో, బయట తరగతులకు వెళ్లేటపుడు, అధ్యాపకులు రాని సమయంలో ర్యాగింగ్ చేస్తున్నారు. మొదటిరోజు తనతోపాటు మరో ఇద్దరిని కూడా బహిరంగంగా హాస్టల్ వద్ద నిలిపి ఇబ్బందికరంగా ప్రవర్తించమని వేధించారు. ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఏడ్చాడు.

 నెల్లూరు జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని దంత వైద్య కళాశాలలో ఇటీవలే చేరారు. ఆమెకు కేటారుుంచిన మంచాన్ని ఇవ్వకుండా సీనియర్ విద్యార్థులు ఇబ్బందులు పెట్టి, తాము చెప్పినట్లు చేయాలని వేధిస్తున్నారు. సదరు విద్యార్థిని తల్లిదండ్రులకు ఫోన్ చేసి బోరుమంది. తాను ఇక్కడ చదవలేనని, ఇంటికి వచ్చేస్తానని ఆవేదన వ్యక్తం చేసింది.

 ఈ ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రు లు ’సాక్షి’కి ఫోన్ చేసి తమ ఆవేదన వ్యక్తం చేశా రు. పోలీసులు, కేసులు అంటే తమ కుమార్తె భయపడుతోందని, సున్నితంగా వ్యవహరించి ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌ను అరికట్టాలని వారు విజ్ఞప్తిచేశారు. ఇలా బయటకు చెప్పుకోలేక పలువురు జూని యర్ విద్యార్థులు లోలోన కుమిలిపోతున్నారని తెలిసింది.

కడప అర్బన్: కడప రిమ్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రజల వైద్య కలల ప్రాకారం. 2006 నుంచి వైద్య విద్య కోర్సును అభ్యసించేందుకు 150మంది విద్యార్థులు వచ్చారు.. వస్తున్నారు. 2016-17 బ్యాచ్‌లో కూడా 150మంది విద్యార్థులు మొదటి సంవత్సరంలో అడుగుపెట్టారు. రిమ్స్‌లో తరగతులు ప్రారంభమయ్యేరోజు డెరైక్టర్, ప్రిన్సిపాల్, అధ్యాపక సిబ్బంది, వైద్య విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సమక్షంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అభ్యసించాలని ఆహ్వానాలు పలుకుతూ  సమావేశాలు నిర్వహించారు. కానీ ఇటీవల ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌లాంటి భూతాలు మొదటి సంవత్సరం విద్యార్థులను పట్టిపీడిస్తున్నారుు. తమను సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నారని బాధితులు బయటకు చెప్పుకోలేకపోతున్నారు.

తమ తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాము ఇక్కడ చదవలేమని రోదిస్తున్నారు. ఈ వ్యవహారం బయటకు వెళితే తర్వాత భరతం పడతామని కూడా సీనియర్ విద్యార్థులు బెదిరిస్తున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నారుు. దసరా, దీపావళి సెలవులకు వెళ్లకముందే నూతనంగా రిమ్స్ కళాశాల ఆవరణలోకి అడుగుపెట్టిన వైద్య విద్యార్థులకు చేదు అనుభవాలు ఎదురయ్యారుు. ఈ విషయాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చారుు. గుంటూరు తరహా దురదృష్ట ఘటనలు చోటుచేసుకోకముందే అధికారులు స్పందించాల్సిన అవసరం ఉందని కొందరు జూనియర్ విద్యార్థులు కోరుతున్నారు. కళాశాల అధికారులు, అధ్యాపకులు, మరోవైపు పోలీసు యంత్రాంగం వారు కూడా అప్రమత్తమై విద్యార్థులకు అవగాహన కల్పించాలని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.

 కనిపించని కమిటీలు
రాష్ట్రంలో వైద్య కళాశాలల్లోగానీ, ఇతర కళాశాలల్లోగానీ ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌ల ద్వారా నష్టం జరిగినపుడు మాత్రమే ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌ల కమిటీలు గుర్తుకొస్తారుు. అలాకాకుండా ప్రతి కళాశాలలోనూ ఈ కమిటీలను ఏర్పాటుచేసి ఫిర్యాదులను రహస్యంగా బాక్సుల్లో వేసేలా చర్యలు చేపట్టాలి. బాధితులు ఎవరైనా ఉంటే ఆ బాక్సులో ఫిర్యాదులు వేయవచ్చు.

దంత వైద్య కళాశాలలో..
దంత వైద్య కళాశాలలో కూడా సీనియర్ విద్యార్థులు జూనియర్లపై జులుం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నారుు. జూనియర్ విద్యార్థులకు కేటారుుంచిన మంచం, ఇతర వస్తువులను ఉపయోగించుకోకుండా సీనియర్ విద్యార్థినులు వేధిస్తున్నట్లు, సూటిపోటి మాటలతో దెప్పిపొడుస్తున్నట్లు బాధితులు తమ తల్లిదండ్రులకు చెప్పుకొని వాపోతున్నారు.

ఫ్రెషర్స్‌డే రోజున అవగాహన కల్పిస్తాం
రిమ్స్‌లో త్వరలో ఫ్రెషర్స్‌డే నిర్వహించనున్నాం. ఆకార్యక్రమంలో ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్‌లపై అవగాహన కల్పిస్తాం. పోలీసు అధికారులతో కూడా చర్చించి తగిన ఏర్పాట్లు చేస్తాం. - డాక్టర్ మాజేటి శశిధర్, రిమ్స్ డెరైక్టర్, కడప

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం
రిమ్స్ వైద్య కళాశాలలోగానీ, దంత వైద్య కళాశాలలోగానీ ర్యాగింగ్‌లు, ఈవ్‌టీజింగ్‌లు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి విద్యార్థులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాం. తర్వాత కూడా మార్పురాకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.  - మోహనప్రసాద్, రిమ్స్ సీఐ

మరిన్ని వార్తలు