పట్టాలు తప్పిన రైల్వే జోన్‌!

7 Mar, 2017 22:44 IST|Sakshi
పట్టాలు తప్పిన రైల్వే జోన్‌!

ఆంధ్రకు ఓకే.. కానీ విశాఖకే డౌటు
కేంద్రం వైఖరిని పరోక్షంగా వెల్లడించిన బీజేపీ జాతీయ నేత
విలేకరుల సమావేశంలో విశాఖ ప్రస్తావనపై మౌనం
గుచ్చి గుచ్చి అడిగినా సమాధానం దాటవేత
ఎమ్మెల్సీ ప్రచారంలోనూ వ్యూహాత్మకంగా విస్మరణ


విశాఖ రైల్వే డివిజన్‌ను ప్రత్యేక జోన్‌గా ప్రకటించాలన్నది ఉత్తరాంధ్రుల చిరకాల కోరిక.. ఉద్యమాలకు ఊపిరులూదిన దశాబ్దాల డిమాండ్‌..
విశాఖకు రైల్వే జోన్‌ ఇస్తామని రాష్ట్ర విభజన చట్టంలోనూ నాటి కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.. కానీ ఎన్నికలు జరిగి కొత్తగా అధికారంలోకి వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఇంకా ‘పరిశీలన’ పేరుతోనే కాలక్షేపం చేస్తున్నాయి..దీనిపై ఐక్యంగా ఒత్తిడి తేవాల్సిందిపోయి.. కొందరు టీడీపీ ఎంపీలు విజయవాడ లేదా గుంటూరులో జోన్‌ ఏర్పాటు చేయాలని కొత్త పల్లవి అందుకున్నారు.. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సైతం స్పష్టత ఇవ్వకుండా.. జోన్‌ ఆంధ్రకు వస్తుందని వక్కాణించారు.. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఆ పార్టీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూడా జోన్‌ డిమాండ్‌ గురించి లేశమాత్రంగానైనా ప్రస్తావించడం లేదు.. ఇవన్నీ చూస్తే.. విశాఖ రైల్వే జోన్‌ పట్టాలు తప్పిందన్న అనుమానాలు బలపడుతున్నాయి.

విశాఖపట్నం : విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు ఆశలు దాదాపు గల్లంతయ్యాయి. ఈ జోన్‌ మంజూరును రెండున్నరేళ్లుగా అదిగో.. ఇదిగో.. అంటూ వాయిదాలేస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం చివరకు తన వైఖరిని ఆ పార్టీ నేతలు పరోక్షంగా వెల్లడించారు. రాష్ట్రానికి రైల్వే జోన్‌ ఇవ్వాలన్న నిర్ణయం జరిగిందని.. త్వరలోనే రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు ప్రకటన చేస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు స్పష్టం చేశారు. సోమవారం నగరంలోని జరిగిన విలేకర ఆయన మాట్లాడుతూ కేంద్రం వైఖరిని తేటతెల్లం చేశారు. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే జోన్‌ ప్రకటన తేదీ వెలువడుతుందని చెప్పారు. కానీ విశాఖకే ఇస్తారా లేదా అన్నదానిపై మౌనం వహించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి టీడీపీ, బీజేపీల ఉమ్మడి అభ్యర్థిగా పీవీ మాధవ్‌ ఎన్నికల బరిలో ఉన్నారు. ఆయన గెలుపు కోసం బీజేపీ శ్రేణులు విశాఖ కేంద్రంగా శ్రమిస్తున్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతో పాటు రాష్ట్రానికి చెందిన బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, పి.మాణిక్యాలరావులతో పాటు ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇక్కడే తిష్టవేసి ప్రచార వ్యూహాల్లో మునిగితేలుతున్నారు. అందులో భాగంగానే మురళీధరరావు వచ్చారు. విలేకరుల సమావేశం పెట్టారు. రాష్ట్రానికి కేంద్రం ఎంతో చేస్తోందని, త్వరలో ఏపీకి రైల్వే జోన్‌ కూడా ఇచ్చేస్తుందని చెప్పుకొచ్చారు. అయితే జోన్‌ ఏపీకా? విశాఖకా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు. పదేపదే నిలదీయగా ఆయన పక్కనే కూర్చున్న విశాఖ ఎంపీ హరిబాబు జోక్యం చేసుకుని విభజన చట్టానికి అనుగుణంగా నిర్ణయం జరుగుతుందని దాటేవేశారు. ఈ నెల 9న ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్‌ జరగనుంది.

అందువల్ల ఈ సమయంలో రైల్వే జోన్‌ విశాఖకు రాదని తేలితే పట్టభద్రుల ఓట్లు ఎక్కడ దక్కకుండా పోతాయోనన్న భయం బీజేపీ నేతలను వెంటాడుతోంది. అందువల్లే రైల్వే జోన్‌ను ఎమ్మెల్సీ ఎన్నికలయ్యే దాకా ప్రకటన చేయకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల ప్రచారంలోనూ బీజేపీ నాయకులు రైల్వే జోన్‌ గురించి ప్రస్తావన లేకుండా, దానికి ప్రాధాన్యమివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. కేంద్ర సాధారణ బడ్జెట్‌లోనూ రైల్వే జోన్‌ గురించి ప్రస్తావించని విషయం తెలిసిందే. అయినప్పటికీ విశాఖ సహా ఉత్తరాంధ్ర వాసులకు ఎక్కడో పిసరంత ఆశ ఇన్నాళ్లూ సజీవంగా ఉంది. కానీ తాజాగా బీజేపీ జాతీయ నేత మురళీధరరావు నోట వచ్చిన మాటతో ఆఖరి ఆశలు కూడా గల్లంతైపోయినట్టయింది. ఇక విశాఖకు రైల్వే జోన్‌ రాదని దాదాపు స్పష్టమైపోయింది. ఇదే విషయం ఇప్పుడు అన్ని వర్గాల్లోనూ ఆగ్రహావేశాలను రగిలిస్తోంది. రైల్వే జోన్‌ విశాఖలో కాకుండా విజయవాడలో ఏర్పాటు చేస్తారన్న ప్రచారం చాన్నాళ్లుగా ఉంది. ఇప్పుడు అదే నిజమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు