రైల్వే డివిజన్‌కు గట్టి దెబ్బ

23 Sep, 2016 18:20 IST|Sakshi
రైల్వే డివిజన్‌కు గట్టి దెబ్బ
* ట్రాక్‌ పునరుద్ధరణకు రెండు రోజులు
సమాచారం కోసం ప్రత్యేక కంట్రోల్‌ రూం 
 
నగరంపాలెం: గుంటూరు రైల్వే డివిజను పరిధిలో అతి పెద్ద నష్టం వాటిల్లింది. సత్తెనపల్లి, పిడుగురాళ్ల మధ్యలో వరదనీటికి రైల్వే ట్రాకు కనీసం పది నుంచి పదిహేను చోట్ల దెబ్బతింది. సత్తెనపల్లి– రెడ్డిగూడెం మధ్యలో ఎక్కువ చోట్ల, రెడ్డిగూడెం– బెల్లంకొండ, బెల్లంకొండ– పిడుగురాళ్ల మధ్యలో అక్కడక్కడ రైల్వే ట్రాకు మీద నుంచి వర్షంనీరు ప్రవహించింది. వర్షం ప్రారంభం నుంచే రైల్వే అధికారులు అప్రమత్తతతో వ్యవహరించటంతో ట్రాకు దెబ్బతిన్న సమాచారం తక్షణమే తెలుసుకొని ఎక్కడి రైళ్లు అక్కడే నిలిపివేశారు. గురువారం సాయంత్రం వరకు ట్రాక్‌ సమీపంలో నీటి ప్రవాహం తగ్గకపోవటంతో నష్టంపై కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు. నిలిచిపోయిన పల్నాడు, పలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ల వద్దకు వెళ్లటానికి రోడ్డు మార్గం సక్రమంగా లేకపోవటంతో మధ్యాహ్నానికి అధికారులు అక్కడకు చేరుకున్నారు. ట్రాక్‌ పునరుద్ధరణకు కనీసం రెండు రోజుల సమయం పట్టే అవకాశముంది.
 
ప్రత్యేక కంట్రోల్‌ రూం ఏర్పాటు..
డివిజనులో రద్దు, దారిమళ్లిన రైళ్లు, ఇతర సమాచారం కోసం గుంటూరు రైల్వేస్టేషన్‌లో కంట్రోల్‌ రూం ను ఏర్పాటు చేశారు. వివరాల కోసం 9701379072, 0863–2222014, రైళ్లరాకపోకలకు సంబంధించి సెంట్రల్‌ కంట్రోల్‌ రూం 9701379073, 9701371072 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

 

>
మరిన్ని వార్తలు