‘ప్రభు’ వెనకడుగు!

19 Jun, 2016 10:14 IST|Sakshi
‘ప్రభు’ వెనకడుగు!

రైల్వే జోన్ ప్రకటనపై సందిగ్ధం?
 
విశాఖపట్నం : విశాఖలో రైల్వే జోన్  ఏర్పాటుపై కే ంద్ర ప్రభుత్వం దొంగాట ఆడుతోంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం తందానతాన పాడుతోంది. ఈ రైల్వే జోన్‌పై ప్రకటనే తరువాయి అంటూ తొలుత లీకులివ్వడం, వాటిని అనుకూల మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయించడం పరిపాటిగా మారింది. ఇప్పుడు తాజాగా రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు ఈ నెల 21న విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి వస్తున్నారని, అదే రోజు విశాఖకు రైల్వే జోన్‌పై ప్రకటన చేస్తారని ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియా ద్వారా హడావుడి చేస్తున్నారు.
 
 ఇటీవలే సురేష్ ప్రభు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన ఈ నెల 20న విజయవాడ వస్తున్నారు. ఆ రోజు రాత్రి విజయవాడ-హైదరాబాద్ మధ్య కొత్త రైలును ప్రారంభించనున్నారు. ఆ మర్నాడు విశాఖలో యోగా దినోత్సవంలో పాల్గొంటారని తొలుత సమాచారం అందించారు. అయితే తాజా సమాచారం ప్రకారం సురేష్ ప్రభు 21న విశాఖ రావడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
 
 ఆరోజు రైల్వే మంత్రి విశాఖ వచ్చే అవకాశాలు లేవని అంటున్నారు. దీనిపై రైల్వే వర్గాలు కూడా స్తబ్దుగానే ఉన్నాయి. రైల్వే మంత్రి రాకపై ఆ వర్గాలు స్పష్టత ఇవ్వడం లేదు. శనివారం రాత్రి వరకూ విశాఖలోని బీజేపీ శ్రేణులకు కూడా రైల్వే మంత్రి పర్యటన ఖరారయినట్టు సమాచారం లేదు. ఒకవేళ ఆయన ఆఖరి నిమిషంలో వచ్చినా విశాఖకు రైల్వే జోన్‌పై ప్రకటన అనుమానమేనని చెబుతున్నారు.
 
ఆందోళనల భయంతోనే..?
రైల్వే జోన్ ఏర్పాటు అంశాన్ని రాష్ట్ర విభజన బిల్లులో స్పష్టంగా పేర్కొన్నారు. అయినప్పటికీ కేంద్రంలోని బీజేపీ సర్కారు తాత్సారం చేస్తూ వస్తోంది. విశాఖ రైల్వే జోన్ కోసం టీడీపీ, బీజేపీలు తప్ప వైఎస్సార్‌సీపీ, వామపక్షాలు, లోక్‌సత్తా, పలు ప్రజాసంఘాలు, విద్యార్థి, ఉద్యోగ, న్యాయవాదుల సంఘాలూ ఉద్యమాలు, ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఏప్రిల్‌లో అమరణ నిరాహార దీక్ష కూడా చేపట్టారు.

ఈ పరిణామాల నేపథ్యంలో విశాఖకు రైల్వే జోన్ ఆకాంక్ష ఉత్తరాంధ్ర వాసుల్లో బలంగా నాటుకుపోయింది. ఈ పరిస్థితుల్లో యోగా దినోత్సవం నాడు విశాఖ పర్యటనకు వచ్చిన ఆయనను ఆయా పార్టీల నేతలు, వివిధ సంఘాల నాయకులు రైల్వే మంత్రిని గట్టిగా నిలదీసే అవకాశాలున్నాయి. ఈ సంగతి తెలిసే ఆయన విశాఖ రాకపోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు ప్రధానితో విభజన చట్టంలో పేర్కొన్న కీలకమైన రైల్వే జోన్‌పై ప్రకటన చేయించాలన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారన్న వాదన కూడా వినిపిస్తోంది.

మరిన్ని వార్తలు