ఫూటుగా తాగి రైల్వే టీసీ వీరంగం

8 Aug, 2016 23:19 IST|Sakshi
ఫూటుగా తాగి రైల్వే టీసీ వీరంగం
ప్రయాణికులను దుర్బాషలాడి, భయపెట్టిన వైనం
జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకున్న ఘటన
రాజమహేంద్రవరం సిటీ : విధి నిర్వహణలోనే మద్యంమత్తులో తూగుతూ, రైల్వే ప్రయాణికులను దుర్బాషలాడి, జైలులో పెట్టిస్తానంటూ భయంకంపితులను చేసిన రైల్వే టీసీ ఉదంతమిది. ప్రయాణికులు కాల్‌ సెంటర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది సోమవారం రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌లో ఆ టీసీ గంగాప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో టీసీ గంగాప్రసాద్‌ విధులు నిర్వహిస్తున్నాడు. మద్యం తాగి, విధులు నిర్వహిస్తున్న అతడు రైలు బయలుదేరినప్పటి నుంచి ప్రయాణికులను దుర్బాషలాడాడు. జైల్లో పెట్టిస్తానంటూ భయకంపితులను చేశాడు. ఈ మేరకు ప్రయాణికులు 182 కాల్‌సెంటర్‌కు ఫిర్యాదు చేశారు. వికలాంగులు, మహిళలతోనూ ఇబ్బందికరంగా ప్రవర్తించాడంటూ ప్రయాణికులు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది రైలు  రాజమహేంద్రవరం స్టేషన్‌కు చేరుకోగానే, గంగాప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో తాను  తప్పు చేశానంటూ ప్రయాణికుల  కాళ్లపైపడి ప్రాధేయపడ్డాడు. అయినా ప్రయాణికులు అతడిని కనికరించలేదు. రాజమహేంద్రవరం స్టేషన్‌ చీఫ్‌ కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు అతడి వద్దనుంచి రిజర్వేషన్‌ చార్ట్‌ను స్వాధీనం చేసుకుని, రైలులో ఉన్న మరో టీసీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. రైల్వే హెల్త్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎన్‌వీఎస్‌ కుమారి బ్రీత్‌ ఎనలైజర్‌ ద్వారా గంగాప్రసాద్‌కు పరీక్షలు నిర్వహించి, రక్తనమూనా సేకరించారు. అతడు ఇలా ప్రవర్తించడం రెండోసారి. జూలై నెలలో అతడు మద్యంమత్తులో ప్రయాణికులతో ఇబ్బందికరంగా ప్రవర్తించడంతో, ప్రభుత్వ రైల్వే పోలీసులకు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. తొలి తప్పుగా క్షమించాలని కోరడంతో, ప్రయాణికులు తమ ఫిర్యాదును రద్దు చేసుకున్నారు.
మరిన్ని వార్తలు