గరీబ్రథ్ ఎక్స్ప్రెస్ రైలుకు తప్పిన ప్రమాదం

22 Oct, 2016 15:00 IST|Sakshi
దెబ‍్బతిన్న ట్రాక్‌
- కుంగిన రైల్వే ట్రాక్‌ 
- అధికారులు గుర్తించి రైళ్ల రాకపోకల నిలిపివేత
- సాయంత్రం ఆరు గంటలకు లైన్‌ క్లియర్‌ 
 
నంద్యాల:
నంద్యాల రైల్వే స్టేషన్‌ సమీపంలో శనివారం త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. నంద్యాల - డోన్‌ రైల్వే మార్గంలో ట్రాక్‌ కింద మట్టి కుంగిన విషయాన్ని అధికారులు గుర్తించి అప్రమత్తమయ్యారు. కొద్ది నిమిషాల ముందు ఓ ఎక్స్‌ప్రెస్‌ రైలు అదే ట్రాక్‌పై క్షేమంగా వెళ్లడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  నంద్యాల రైల్వే స్టేషన్‌రెండు కి.మీ సమీపంలో బొమ్మలసత్రం ప్రాంతంలో కొద్ది రోజులుగా కుందూ బ్రిడ్జి వద్ద మరో కొత్త వంతెన నిర్మిస్తున్నారు. అయితే మట్టి పనులు జరిగే ప్రాంతాల్లో ట్రాక్‌ బలహీనమైంది. దీంతో రెండు రోజుల నుంచి ఆ ప్రాంతంలో రైళ్ల వేగాన్ని 20 కి.మీ.కి తగ్గించారు. శుక్రవారం సాయంత్రం ట్రాక్‌ కింద మట్టి మరింత కుంగడాన్ని గుర్తించి వేగాన్ని 10కి.మీకి పరిమితం చేశారు. శనివారం పూరీ నుంచి బెంగళూరుకు వెళ్లే గరీబ్‌ ఎక్స్‌ప్రెస్‌ నంద్యాల స్టేషన్‌కు ఉదయం11.30 గంలకు చేరాల్సి ఉంది. అయితే రైల్వే స్టేషన్‌కు 12కి.మీ దూరంలోని నందిపల్లె వద్ద ఏసీ కోచ్‌ మెకానిక్‌ ప్రమాదవశాత్తూ రైలులో నుంచి కింద పడి మృతి చెందాడు. దీంతో రైలు అరగంట ఆలస్యంగా, మధ్యాహ్నం 12 గంటలకు స్టేషన్‌కు చేరింది. తర్వాత 12.05 గంటలకు రైలు బయల్దేరి, బలహీనంగా ఉన్న ట్రాక్‌పై 10కి.మీ వేగంతో వెళ్లింది. రైలు వెళ్లిన కుదుపులకు ట్రాక్‌ దిగువనున్న మట్టి పూర్తిగా తొలగి పోయింది. వెంటనే అధికారులు రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. సాయంత్రం 6 గంటలకు ట్రాక్‌ మరమ్మతు పనులు పూర్తి కావడంతో రాత్రి నుంచి రైళ్ల రాకపోకలు యథావిధిగా నడుస్తున్నాయి. 
 
ప్రయాణికుల ఆందోళన
గుంటూరు నుంచి కాచిగూడ వెళ్లే ప్యాసింజర్‌ శనివారం మధ్యాహ్నం నంద్యాల స్టేషన్‌కు చేరుకుంది. ట్రాక్‌ మరమ్మతులతో స్టేషన్‌లో ఉండిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. విషయం తెలుసుకుని తమ టికెట్ల డబ్బు ఇవ్వాలని వాగ్వాదానికి దిగగా అధికారులు సర్ది చెప్పారు. విజయవాడ - హుబ్లి ప్యాసింజర్‌ రైలు 4.20గంటలకు రైల్వే స్టేషన్‌ను చేరింది. ఈ రైలు ఆలస్యంగా 6.10 గంటలకు బయల్దేరింది.  
 
మద్దరు నుంచి వెనుదిరిగిన కడప ప్యాసింజర్‌
కడప - నంద్యాల ప్యాసింజర్‌ రైలు మధ్యాహ్నం 2.15 గంటలకు నంద్యాలకు 10 కి.మీ దూరంలోని మద్దూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ట్రాక్‌ మరమ్మతులు పూర్తి కాకపోవడంతో నంద్యాలకు రాకుండానే అక్కడి నుంచి వెనుదిరిగింది. నంద్యాల నుంచి రైలు రద్దు కావడంతో ప్రయాణికుల టికెట్లను వాపస్‌ చేశారు.   

 

మరిన్ని వార్తలు