రబీ ఆశలపై నీళ్లు

21 Jan, 2017 22:51 IST|Sakshi
రబీ ఆశలపై నీళ్లు

- కేవలం 35 శాతం విస్తీర్ణంతో ముగిసిన రబీ
అనంతపురం అగ్రికల్చర్‌ : ఖరీఫ్‌ను కకావికలం చేసిన వరుణుడు రబీలోనూ కరుణించకపోవడంతో మరింత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆగస్టు, సెప్టెంబర్‌లో వర్షాలు రాకపోవడంతో 7.62 లక్షల హెక్టార్లలో ఖరీఫ్‌ పంటలు నిలువునా ఎండిపోయాయి. అక్టోబర్‌లోనూ వరుణుడు ముఖం చాటేయడంతో ప్రస్తుత రబీ సీజనూ రైతన్నలను చావు దెబ్బ తీసింది. రెండు సీజన్లలోనూ వర్షాలు లేకపోవడంతో ‘అనంత’ అన్నదాతలకు కోలుకోలేని నష్టం వాటిల్లింది. మునుపెన్నడూ లేని విధంగా జిల్లా చరిత్రలో ఖరీఫ్, రబీలు దెబ్బమీద దెబ్బ కొట్టడంతో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది.

పడిపోయిన విస్తీర్ణం
సీజన్‌ ముగుస్తున్నా రబీ పంటల విస్తీర్ణం 35 శాతానికి మించలేదు. ఈ రబీలో అన్ని పంటలు కలిపి 1.31 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగవ్వాల్సి ఉండగా, 44 వేల హెక్టార్లకే పరిమితమయ్యాయి. 77,564 హెక్టార్లలో సాగులోకి వస్తుందనుకున్న ప్రధానపంట పప్పుశనగ 23 వేల హెక్టార్లు, 20 వేల హెక్టార్లలో వేయాల్సిన వేరుశనగ 12,500 హెక్టార్లలోనే సాగైంది. జొన్న 6.672 హెక్టార్ల సాధారణ సాగుకు గానూ 2,500 హెక్టార్లు, మొక్కజొన్న 6 వేల హెక్టార్లకు గానూ 3 వేల హెక్టార్లు, పొద్దుతిరుగుడు 4,673 హెక్టార్లకు గానూ 1,200 హెక్టార్లు, ఉలవ 3,855 హెక్టార్లకుగానూ కేవలం 180 హెక్టార్లకు పరిమితమయ్యాయి.

వర్షాల్లేక భూగర్భజలాలు అడుగంటిపోవడం వల్ల బోర్లలో నీటి లభ్యత గణనీయంగా పడిపోయింది. దీంతో వరి 10 వేల హెక్టార్ల సాధారణ సాగుకు గానూ ప్రస్తుతానికి 1,400 హెక్టార్లలోనే సాగవుతోంది. సజ్జ, రాగి, మినుము, అలసంద, పెసర, కుసుమ, ధనియాలు, పత్తి తదితర అన్ని పంటల సాగు విస్తీర్ణమూ గణనీయంగా పడిపోయింది. వేసిన పప్పుశెనగ కూడా వర్షాలు లేక ఎండిపోవడంతో ఎకరాకు 50 కిలోలు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదంటున్నారు. పెట్టుబడుల్లో సగం కూడా దక్కడం కష్టమనే ఆందోళన వ్యక్తమవుతోంది.

వెంటాడిన వర్షాభావం
వర్షాభావ పరిస్థితులు రబీని కూడా వెంటాడటంతో సాగు విస్తీర్ణం పడిపోయింది. కీలకమైన అక్టోబర్, నవంబర్‌లో వర్షాలు పూర్తిగా మొహం చాటేయడంతో అరకొర తేమలో అక్కడక్కడ పంటలు సాగు చేశారు. సాగైన పంటలు కూడా దిగుబడులు లేక దయనీయంగా తయారయ్యాయి. అక్టోబర్‌లో 110.7 మి.మీ. భారీ వర్షపాతం నమోదు కావాల్సివుండగా కేవలం 7.1 మి.మీ. వర్షమే పడింది. నవంబర్‌లోనూ 34.7 మి.మీ. గానూ కేవలం 1.7 మి.మీ. కురిసింది. రెండు మూడు తుఫాన్లు వచ్చినా జిల్లాపై కనీస ప్రభావం చూపలేకపోవడంతో రబీ ఆశలు గల్లంతయ్యాయి.

మొత్తమ్మీద రబీలో 155.5 మి.మీ. వర్షం పడాల్సి ఉండగా కేవలం 26.6 మి.మీ. కురిసింది. మొత్తమ్మీద ఈ సంవత్సరం ఇప్పటివరకు 495 మి.మీ.గానూ 283 మి.మీ. వర్షం కురిసింది. అంటే 43 శాతం తక్కువగా వర్షాలు పడ్డాయి. కనీసం ఒక్క మండలంలోనూ సాధారణ వర్షపాతం​ కూడా నమోదు కాలేదు. గుమ్మగట్ట, రామగిరి, కగానపల్లి లాంటి కొన్ని మండలాల్లో 60 నుంచి 80 శాతం తక్కువగానూ, మరో 30 మండలాల్లో 40 నుంచి 60 శాతం తక్కువగానూ నమోదైంది. వరుసగా 45 రోజులు, 52 రోజుల పాటు వర్షం పడని విరామం (డ్రైస్పెల్స్‌) నమోదు కావడంతో భూగర్భజలాలు రికార్డుస్థాయిలో పాతాళానికి పడిపోయాయి. బోర్లలో నీళ్లు రావడం గగనంగా మారింది. ప్రస్తుతం భూగర్భజలమట్టం 22.40 మీటర్లుగా ఉంది.

మరిన్ని వార్తలు