శివన్న పంటా పోయింది!

22 Oct, 2016 23:17 IST|Sakshi
శివన్న పంటా పోయింది!

అమడగూరు : స్వయాన సీఎం చంద్రబాటు రక్షకతడులను ప్రారంభించిన రైతు శివన్న పొలంలోనే వేరుశనగ పంట ఎత్తిపోయింది. చెట్టుకు ఒకట్రెండు కాయలు కూడా లేకపోవడంతో రైతు ఆవేదన చెందుతున్నాడు. తొమ్మిది ఎకరాల పంట పూర్తిగా పోయిందని, పెట్టుబడి కోసం చేసిన రూ.లక్ష అప్పు ఎలా తీర్చాలోనని వాపోతున్నాడు. అమడగూరు మండలం గుండువారిపల్లికి చెందిన రైతు శివన్న పొలంలో ఆగస్టు 28న సీఎం చంద్రబాబు రెయిన్‌గన్లతో రక్షకతడులు ప్రారంభించారు. ఇక తన పంట పండినట్టేనని రైతు ఆశపడ్డాడు.  పంటను శనివారం ట్రాక్టరుతో దున్నించేశాడు.

దిగుబడి ఏమాత్రమూ లేదు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి డీఎస్‌ కేశవరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎద్దుల శ్రీధర్‌రెడ్డి, మండల కన్వీనర్‌ శేషూరెడ్డి తదితరులు రైతును పరామర్శించారు. ఈ సందర్భంగా అతను గోడు వెళ్లబోసుకున్నాడు. ‘టీడీపీ నాయకులు వచ్చి నీ పొలానికి సీఎం చంద్రబాబు వస్తున్నారు.. రక్షకతడుల ద్వారా పంటను కాపాడతారని చెప్పారు.  సీఎం వచ్చిన రోజు కాసేపు రెయిన్‌గన్లు బిగించారు.

ఆయన వెళ్లగానే అదే రోజు సాయంత్రం ఫారంపాండ్‌లోని కవరు, రెయిన్‌గన్లు అన్నీ తీసుకెళ్లిపోయారు. పంటంతా ఎండిపోయింద’ని వాపోయాడు.  సీఎం వచ్చి రెయిన్‌గన్లను ప్రారంభించిన పంట పొలమే పూర్తిగా ఎండిపోతే..ఇక మిగిలిన రైతుల పరిస్థితి ఏంటని వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రభుత్వంపై మండిపడ్డారు. రక్షక తడుల పేరుతో కోట్ల రూపాయలను కొల్లగొట్టారే కానీ రైతులకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు.  కార్యక్రమంలో  సర్పంచ్‌ శశికళ, నాయకులు సుధాకర్‌రాజు, రషీద్, మోహన్‌రెడ్డి, రమణారెడ్డి, అంజినప్ప, రామప్ప తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా