తెలంగాణ, ఉత్తర కోస్తాకు వర్షసూచన

7 Apr, 2016 02:42 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణ, రాయలసీమల్లో సాధారణం కంటే ఒకట్రెండు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. ఫలితంగా వడగాడ్పుల తీవ్రత తగ్గింది. అయినప్పటికీ ఆయా ప్రాంతాల్లో ఎండల ప్రభావం కనిపిస్తూనే ఉంది. బుధవారం కర్నూలు, అనంతపురంలలో 42, రామగుండంలో 41, హైదరాబాద్, తిరుపతి, రెంటచింతలలో 40 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు గాలుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.

ప్రస్తుతం నైరుతి నుంచి గాలులు వీస్తున్నాయి. తెలంగాణ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో వచ్చే 24 గంటల్లో తెలంగాణ, కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు గాని, ఉరుములతో కూడిన జల్లులు గాని కురిసే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు బుధవారం తెలిపారు. రాయలసీమలో పొడి వాతావరణం నెలకొంటుందని చెప్పారు.
 

మరిన్ని వార్తలు