ఆగస్టులో ఆశాజనకంగా వర్షాలు

31 Aug, 2017 21:45 IST|Sakshi

అనంతపురం అగ్రికల్చర్‌: జూన్, జూలైలో దారుణంగా దెబ్బతీసిన వర్షాలు ఆగస్టులో మాత్రం ఆశాజనకంగా కురిశాయి. అయితే అప్పటికే ప్రధాన పంట వేరుశనగ, ప్రత్తి, ఆముదం, కంది లాంటి పంటలు వేసుకునేందుకు పుణ్యకాలం ముగిసిపోవడంతో ఖరీఫ్‌ నిరాశాజనకంగా సాగుతోంది. జూన్‌లో 63.9 మి.మీ గానూ 59.2 మి.మీ, జూలైలో మరీ దారుణంగా 67.4 మి.మీ గానూ 31 మి.మీ వర్షం కురిసింది. దీంతో ఈ సారి కరువు ఛాయలు ముందుగానే ఆవరించడంతో జిల్లా అంతటా ఆందోళన నెలకొంది. ఆగస్టు 5 నుంచి వాతావరణం మారిపోవడం, తేలికపాటి నుంచి చెప్పుకోదగ్గ వర్షాలు కురవడం ప్రారంభమయ్యాయి.

నెల ముగిసేనాటికి 88.7 మి.మీ గానూ 9 శాతం ఎక్కువగా 96.8 మి.మీ వర్షం కురిసింది. అందులోనూ గత 15 రోజుల్లోనే 80 మి.మీ వర్షపాతం నమోదు కావడం విశేషం. అంతవరకు 32 శాతం లోటు వర్షపాతం కొనసాగుతుండగా ప్రస్తుతం 15 శాతానికి చేరుకుంది. ఆగస్టులో తాడిపత్రి, ఉరవకొండ, బొమ్మనహాల్, డి.హిరేహాల్, వజ్రకరూరు, విడపనకల్, గుంతకల్లు, పెద్దవడుగూరు, యాడికి, శింగనమల, పామిడి, గార్లదిన్నె, కూడేరు, బెళుగుప్ప, కనేకల్లు, బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం, నల్లచెరువు, కంబదూరు, తలుపుల, పుట్లూరు, సోమందేపల్లి, పరిగి తదితర మండలాల్లో 100 నుంచి 150 మి.మీ మేర వర్షపాతం నమోదైంది.

ఇక చెన్నేకొత్తపల్లి, అనంతపురం, కనగానపల్లి, ఆత్మకూరు, రాయదుర్గం, బత్తలపల్లి, గోరంట్ల, కొత్తచెరువు మండలాల్లో తక్కువగా వర్షాలు పడ్డాయి. మిగతా మండలాల్లో 60 నుంచి 100 మి.మీలోపు వర్షపాతం నమోదైంది. ప్రస్తుతానికి వేసిన పంటలు పచ్చదనం సంతరించుకున్నా దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక ఇటీవల కురిసిన వర్షాలకు అంతోఇంతో ప్రత్యామ్నాయ పంటలు సాగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల అంటే సెప్టెంబర్‌లో సాధారణ వర్షపాతం 118 మి.మీ నమోదు కావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు