మేఘమా.. కురవవే!

30 Jun, 2017 23:38 IST|Sakshi
మేఘమా.. కురవవే!

ఊరిస్తున్న నైరుతి
- నిరాశాజనకంగా ఖరీఫ్‌ సీజన్‌
- నెల రోజులుగా ప్రభావం చూపని రుతు పవనాలు
- ఇప్పటి వరకు పదునైన వర్షం కరువు
- 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో గాలులు
- వరుణుడి కరుణ కోసం నిరీక్షణ


జూన్‌ నెల సాధారణ వర్షపాతం : 63.9 మి.మీ.,
నమోదైన వర్షపాతం : 59.2 మి.మీ.,
ఖరీఫ్‌ సాధారణ సాగు : 8.01 లక్షల హెక్టార్లు
ఇప్పటి వరకు చేపట్టిన సాగు : 32వేల హెక్టార్లు


అనంతపురం అగ్రికల్చర్‌ : జిల్లా వ్యవసాయానికి నైరుతి రుతు పవనాలే కీలకం. వీటి ప్రభావంతోనే లక్షలాది ఎకరాల్లో ఖరీఫ్‌ పంట సాగవుతుంది. లేదంటే.. అరకొర తేమలో విత్తనం వేసి రైతాంగం నష్టపోతోంది. ఏటా జూన్‌ 10 నుంచి 15 తేదీల మధ్య నైరుతి పవనాలు జిల్లాలోకి ప్రవేశిస్తాయి. అయితే ఈసారి కాస్త ముందుగా.. అంటే ఈనెల 8న రాత్రి జిల్లాను తాకినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. నైరుతి ముందస్తుగా ఊరించినా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోవడంతో రైతుల పరిస్థితి దారుణంగా మారుతోంది.

ప్రస్తుతం జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉష్ణోగ్రతలు 42-44 డిగ్రీల నుంచి 35-37 డిగ్రీలకు పడిపోయాయి. రాత్రి ఉష్ణోగ్రత కూడా బాగా తగ్గుముఖం పట్టింది. ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో గాలిలో తేమ శాతం పెరిగింది. ఆకాశం మేఘావృతమై వర్షం కురిసే వాతావరణం కనిపిస్తున్నా చినుకు రాలని పరిస్థితి ఉంది. శాస్త్రవేత్తలు వర్ష సూచన చేస్తున్నా ఫలితం లేకపోతోంది. అక్కడక్కడ తేలికపాటి వర్షం, మరికొన్ని ప్రాంతాల్లో తుంపర్లు మినహా చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షం పడటం లేదు. మరోపక్క విత్తనానికి అదను కావడంతో పదును కాక రైతులు దిక్కులు చూస్తున్నారు.

ఆషాడం గాలులతో మేఘాలు చెల్లాచెదురు
ఆషాఢమాసంలో వీస్తున్న బలమైన గాలులతో మేఘాలు చెల్లాచెదురవుతున్నాయి. సాధారణ రోజుల్లో గాలివేగం 6 నుంచి 12 కిలోమీటర్లుగా ఉంటుంది. అయితే ప్రస్తుతం 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో ఆవరించిన మేఘాలు చెదిరిపోతున్నాయి. అక్కడక్కడ తుంపర్లు కురిపించి కనుమరుగవుతున్నాయి. బ్రహ్మసముద్రం, గుమ్మగట్ట, పామిడి, డి.హిరేహాల్, తాడిపత్రి, అనంతపురం, బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు, యల్లనూరు, తాడిమర్రి, కనగానపల్లి, రామగిరి, కంబదూరు, బత్తలపల్లి, రాప్తాడు, గార్లదిన్నె, పెద్దపప్పూరు, కదిరి, కొత్తచెరువు.. ఇలా దాదాపు 35 మండలాల్లో 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో గాలులు హోరెత్తిస్తున్నాయి.

నైరుతి రాకమునుపే మంచి వర్షాలు
జూన్‌ 8న రాత్రి జిల్లాలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని రైతులు ఆనందపడ్డారు. ఇక ఏరువాక జోరందుకునే పరిస్థితి ఉందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. కానీ.. జూన్‌ 1 నుంచి 8వ తేదీ మధ్య 38 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. జూన్‌ 9 నుంచి 30వ తేదీ మధ్య 21.2 మి.మీ వర్షం మాత్రమే పడటం గమనార్హం. 32 మండలాల్లో సాధారణంకన్నా తక్కువ వర్షం కురిసింది. ఇందులోనూ జూన్‌ నెలలో ఎస్పీకుంట మండలంలో 8.8 మిల్లీమీటర్లు, శెట్టూరు 13.8, గమ్మగట్ట 14.7, గోరంట్ల 19.3 మిల్లీమటర్లు.. ఇలా చాలా మండలాల్లో కనీసం పదునుకు సరిపడా వర్షం కూడా కురవలేదు.

గతేడాది 1.35 లక్షల హెక్టార్లలో పంటలు
2016 ఖరీఫ్‌లో జూన్‌ నెల ముగిసే నాటికి 1.35 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. అందులో వేరుశనగ 1.18 లక్షల హెక్టార్లు, మిగతా విస్తీర్ణంలో ఇతరత్రా పంటలు వేశారు. గతేడాది జూన్‌లో వర్షపాతం 63.9 మిల్లీమీటర్లకు గాను 94.5 మిల్లమీటర్ల వర్షం కురవడంతో ఖరీఫ్‌ సాగు ఆశాజనకంగా సాగింది. అయితే ఈ జూన్‌లో వర్షపాతం 59.2 మిల్లీమీటర్లకే పరిమితం కావడం, అందులోనూ జూన్‌ మొదటి వారంలోనే బాగా కురవడం.. విత్తుకు అనుకూలమైన జూన్‌ 15 తర్వాత వర్షాలు లేకపోవడంతో సాగు మందగించింది. వ్యవసాయశాఖ అందించిన సమాచారం ప్రకారం ఇప్పటి వరకు జిల్లాలో 35వేల హెక్టార్ల విస్తీర్ణంలో మాత్రమే పంటలు సాగయ్యాయి. ఇందులో 32వేల హెక్టార్లలో వేరుశనగ, ఇతర పంటలు మరో 3వేల హెక్టార్లలో వేసినట్లు చెబుతున్నారు. వేసిన పంటలు కూడా గాలివేగానికి వాడుతుండటం గమనార్హం.

జూలైపైనే ఆశలు
దాదాపు అన్ని రకాల పంటల సాగుకు జూలై నెల కీలకమని శాస్త్రవేత్తలు ప్రకటించారు. వేరుశనగతో పాటు మిగతా అన్ని పంటలు వేసుకోవచ్చంటున్నారు. జూలైలో సాధారణ వర్షపాతం 67.4 మిల్లీమీటర్లు. ఖరీఫ్‌ సాధారణ సాగులో 10 శాతం పంటలు కూడా సాగు కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులు జూలై మాసంపై ఆశలు పెట్టుకుని వరుణుడి కరుణ కోసం ఆకాశానికేసి ఆశగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని వార్తలు