రాష్ట్రంలో తగ్గిన వర్షపాతం

21 Aug, 2016 22:27 IST|Sakshi
రాష్ట్రంలో తగ్గిన వర్షపాతం
విజయవాడ సెంట్రల్‌ : 
ఈ నెలలో రాష్ట్ర సగటు వర్షపాతం బాగా తగ్గిందని జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. పుష్కర భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రకాశం బ్యారేజీ వద్ద 11.1 అడుగుల నీటి మట్టాన్ని ఉంచామని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల్లో సాధారణ వర్షపాతం 111.1 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా 21 ఎం.ఎం మాత్రమే నమోదైందని మంత్రి చెప్పారు.  జూన్‌లో 97 మి.మీ. కురవాల్సి ఉండగా 153 మి.మీలు, జులైలో 151 మి.మీ. గాను 121 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. నాగార్జున సాగర్‌ నుంచి కృష్ణా, పోలవరం నుంచి గోదావరి జలాలను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. 
డెల్టా కాలువలకు  16 వేల క్యూసెక్కులు 
కృష్ణాడెల్టాలోని కాల్వలకు నీరు వదిలిన దృష్ట్యా పర్యవేక్షణ కోసం పుష్కర విధుల్లో ఉన్న ఇరిగేషన్, వ్యవసాయశాఖల అధికారుల్ని రిలీవ్‌ చేసినట్లు పేర్కొన్నారు. డెల్టా చివరి భూముల వరకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో  16,001 క్యూసెక్కుల నీటిని కాల్వలకు విడుదల చేసినట్లు తెలిపారు. మేయర్‌ కోనేరు శ్రీధర్, డిప్యూటీ మేయర్‌ గోగుల వెంకట రమణరావు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు