సాగు.. బిరబిరా

20 Jun, 2017 00:09 IST|Sakshi
సాగు.. బిరబిరా

∙ విత్తనాలు విత్తే పనిలో నిమగ్నమైన అన్నదాతలు
∙ ఇప్పటికే 13వేల హెక్టార్లలో వివిధ పంటల సాగు
∙ సాగుకు అనుకూలంగా కురిసిన వర్షాలు
∙ ఇదే తరుణమంటున్న వ్యవసాయ అధికారులు


అన్నదాతలు సాగులో మునిగిపోయారు. ఈ నెలలో సాధారణానికి మించి వర్షపాతం నమోదు కావడంతో విత్తనాలు వేసే పనిలో పడ్డారు. ఇప్పటికే జిల్లాలో 13వేల హెక్టార్లలో విత్తనాలు వేశారు. మరో 15 రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరగనుంది. ఎక్కువ మంది రైతులు ఈ సారి పత్తిపంట సాగు చేస్తుండగా, రెండోస్థానంలో మొక్కజొన్నపై మక్కువ చూపుతున్నారు.

రంగారెడ్డి జిల్లా: అన్నదాతలు పంటల సాగులో తలమునకలయ్యారు. వివిధ రకాల విత్తనాలు విత్తే పనిలో నిమగ్నమయ్యారు.ఇప్పుడిప్పుడే పంట సాగు ఊపందుకుంటోంది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో పొలాలు సాగుకు అనుకూలంగా మారాయి. సాధారణంగా 6 నుంచి 7 సెంటీమీటర్ల వాన పడితేనే పొలాలు సాగుకు సానుకూలంగా తయారవుతాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. తద్వారా ఐదారు రోజుల వరకు భూమిలో తేమ ఉంటుందని.. ఆ లోపు విత్తితే అధికభాగం మొలకెత్తుతాయని వివరిస్తున్నారు. ఆ తర్వాత మరోసారి వర్షం పడితే.. మొలకలకు ఢోకా ఉండదని పేర్కొంటున్నారు. అయితే జిల్లాలో
సోమవారం నాటికి సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. ఈ నెలలో ఇప్పటివరకు ఫరూఖ్‌నగర్, కొందుర్గు, మహేశ్వరం, నందిగామ, కొత్తూరు తదితర మండలాల్లో అత్యధికంగా 20 సెం.మీలకు మించి వర్షాలు కురిసినట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన మండలాల్లోనూ 7 సెం.మీ పైగానే వర్షపాతం నమోదు కావడంతో.. పుడిమి బిడ్డలు పొలం పనులతో బిజిబిజీగా ఉన్నారు.

సాగు దిశగా అడుగులు..
ప్రస్తుత ఖరీఫ్‌లో జిల్లాలో 1.60లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ పంటలు  సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అత్యధికంగా 60వేల హెక్టార్లలో రైతులు పత్తి పంట వేసే అవకాశం ఉందని పేర్కొంది. ఇందుకు అనుగుణంగానే ఇప్పటివరకు పత్తి పంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. సోమవారం నాటికి 5వేలకు పైగా హెక్టార్లలో సాగైందని వెల్లడిస్తున్నారు. ఆ తర్వాత మొక్కజొన్న 2,500, కంది 254, పెసర 85, వరి 52, జొన్న 51హెక్టార్లలో సాగయ్యాయని వివరిస్తున్నారు. వీటితోపాటు ఇతర ఆహార ధాన్యాలు, ఉద్యాన పంటలు కలుపుకుంటే.. 10వేల హెక్టార్లలో పంటలు వేసినట్లు చెబుతున్నారు. అయితే అనధికారికంగా మరో 3 వేల హెక్టార్లు అధికంగానే సాగయ్యాయని సమాచారం. 10 నుంచి 15 రోజుల్లో పంటలకు సాగుకు రైతులు ఉపక్రమించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు.

ఇదే మంచి తరుణం..
సాధారణానికి మించి వర్షం కురవడం.. పంటల సాగుకు కలిసివచ్చే అంశమని జిల్లా వ్యవసాయ అధికారి కేఎస్‌ జగదీష్‌ తెలిపారు. అన్ని మండలాల్లో 7 సెం.మీలకు పైగా వర్షం కురవడంతో.. నిరభ్యంతరంగా రైతులు విత్తనాలు విత్తుకోవచ్చని చెప్పారు. సాగులో మెలకువలు పాటిస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని చెప్పారు. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని (ఏఈఓ) నియమించాని, వీరు రైతులకు నిత్యం అందుబాటులో ఉంటారని చెప్పారు. పంటల సాగుకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా.. వారిని సంప్రదించాలని చెప్పారు. వీరితోపాటు ప్రతి మండల కేంద్రంలో వ్యవసాయ అధికారులు (ఏఓ)లు ఉంటారని, అవసరమైతే వీరి సహాయం కూడా తీసుకోవచ్చని తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌కు జిల్లాకు వివిధ రకాల సబ్సిడీ విత్తనాలను దాదాపు 18వేల క్వింటాళ్లు కేటాయించారు. వీటిని అన్ని పీఏసీఎస్, ఏఈఓ క్లసర్‌ కేంద్రాల్లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.

ప్రైవేటు డీలర్లు, పీఏసీఎస్‌లలో ఎరువులు ఉన్నాయన్నారు. జొన్నలు కూడా త్వరలో జిల్లాకు వస్తాయి. విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాకు కేటాయించినవే కాకుండా.. రైతుల అవసరాన్ని బట్టి సరఫరా అధికంగా చేస్తామన్నారు. విత్తనాలు వేసే ముందు మట్టి నమూనా పరీక్షలు చేయించుకుంటే మంచిదని రైతులకు సూచించారు. ఆ పొలంలో పోషక విలువలుంటే పెట్టుబడి వ్యయం గణనీయంగా తగ్గుతుందన్నారు. అన్నదాతలకు వ్యవసాయ శాఖ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని జగదీష్‌ చెప్పారు.
 

మరిన్ని వార్తలు