ప్రమాణాలొద్దు.. విచారణకు సిద్ధం కండి

4 Sep, 2016 22:25 IST|Sakshi
ప్రమాణాలొద్దు.. విచారణకు సిద్ధం కండి
ఎమ్మెల్యే పెందుర్తికి జక్కంపూడి ప్రతి సవాల్‌
ఫరిజల్లిపేట (రాజానగరం) : అవినీతి ఆరోపణలను నిరూపించేందుకు గుడిలో ప్రమాణాలు కాదు, ధైర్యం ఉంటే సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా స్థానిక ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌కు ప్రతి సవాల్‌ చేశారు. నియోజకవర్గంలో మట్టి, ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే పెందుర్తి స్థానిక గాంధీ బొమ్మ సెంటర్‌లో ఆదివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మట్టి, ఇసుక మాఫియాను ఏనాడు ప్రోత్సహించలేదని, కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తన తల్లిపై ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని, మీరూ సిద్ధమా? అంటూ సవాల్‌ చేయడంపై రాజా ప్రతిస్పందించారు. ప్రమాణాలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయవద్దని, చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణను కోరాలని డిమాండ్‌ చేశారు. అందుకు గవర్నర్‌ను, సీఎంను కలిసేందుకు తాను కూడా వస్తానని చెప్పారు.
ముగ్గళ్ల, కాటవరం, వంగలపూడి, సింగవరం ర్యాంపుల్లో ఎక్కడెక్కడ, ఎవరి వద్ద ఎంత తీసుకున్నారనేది ప్రజలందరికీ తెలుసని రాజా పేర్కొన్నారు. కాటవరం ర్యాంపులో శనివారం రాత్రి రూ.10 లక్షలు తీసుకుని, కార్యకర్తలకు ఆదివారం భోజనాలు పెట్టిన మాట నిజం కాదా? అని ప్రశ్నించారు. సీతానగరం మండలంలో ఇసుక అక్రమ రవాణా ద్వారా సుమారు రూ.ఆరు కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణా కారణంగా జాలిముడి వద్ద దుర్గ అనే పేద మహిళ మరణిస్తే, ఇంతవరకు ఆ కుటుంబానికి ఎటువంటి సాయం అందించలేదని చెప్పారు.
చెవిలో పువ్వు, ముక్కున వేలుతో నిరసన
సీఎం చంద్రబాబు, నియోజకవర్గంలో ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ ప్రజలను మభ్యపెడుతున్నారంటూ రాజాతో పాటు పార్టీ నేతలు చెవిలో పూలు పెట్టుకుని, ముక్కున వేలు పెట్టి  ఫరిజల్లిపేటలో నిరసన ప్రదర్శన చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే వెంకటేష్‌ తగిన సమాధానం చెప్పలేక, నల్లబ్యాడ్జీలతో నిరసన అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. అలాగే ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి కూడా, న్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక చంద్రబాబు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడం నీతిమాలిన చర్యగా పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఉండమట్ల రాజబాబు, పార్టీ మండల కన్వీనర్‌ మండారపు వీర్రాజు, రాష్ట్ర, జిల్లా కమిటీల నాయకులు పేపకాయల విష్ణుమూర్తి, అనదాస సాయిరామ్, అడబాల చినబాబు, నాతిపాము సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
కేసు నుంచి తప్పించుకునేందుకే స్టే
ఈదరాడ (మామిడికుదురు) : ఓటుకు నోటు కేసులో సాక్ష్యాధారాలతో దొరికిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆరోపించారు. పార్టీ మండల శాఖ అధ్యక్షుడు బొలిశెట్టి భగవాన్‌ అధ్యక్షతన ఆదివారం ఇక్కడ జరిగిన సమావేశంలో రాజా మాట్లాడారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఓటుకు నోటు కేసులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని డిమాండ్‌ చేశారు. దోపిడీ, బరితెగింపు ధోరణిలో టీడీపీ ప్రభుత్వ విధానం ఉందని ఎద్దేవా చేశారు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆలోచన అని, అదే బాటలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పయనిస్తున్నారని రాజోలు కో–ఆర్డినేటర్‌ బొంతు రాజేశ్వరరావు పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు నల్లి డేవిడ్, తోరం సూర్యభాస్కర్, జక్కంపూడి వాసు, రావి ఆంజనేయులు, విస్సా నాగేశ్వరరావు, అడబాల బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు