రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాల్సిందే

26 Mar, 2017 22:55 IST|Sakshi
రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాల్సిందే
 -చంద్రబాబు హామీని నిలబెట్టుకోవాలి
-రజక చైతన్య సేవాసంస్థ డిమాండ్‌
కాకినాడ రూరల్‌ : తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలంటూ ఏపీ రజక చైతన్య సేవా సంస్థ జిల్లా కార్యవర్గం డిమాండ్‌ చేసింది. ఆదివారం ఇంద్రపాలెంలోని రజక సంక్షేమ సంఘ భవనంలో జరిగిన జిల్లా రజక చైతన్య సేవా సంస్థ సమావేశంలో పలువురు నాయకులు  ప్రసంగించారు. ఇప్పటికే 17 రాష్ట్రాల్లోనూ, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ రజకులు ఎస్సీ జాబితాలో కొనసాగుతున్నారన్నారు. చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా రజకులను ఎస్సీల్లో చేరుస్తామని వాగ్దానం చేశారని, అదే విధంగా గవర్నర్‌ నరసింహన్‌ బడ్జెట్‌ సమావేశాల్లో ఎస్సీల్లో చేర్చేందుకు ప్రకటన చేశారని నాయకులు గుర్తు చేశారు.  గ్రామాల్లో రజకులు దుస్తులు ఉతికేందుకు ఉన్న చెరువులను ఆయా గ్రామపంచాయతీలు వేర్వేరు కులాలకు లీజుకు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలా కాక పూర్తిగా రజక సంఘాలకే ఆ చెరువులను కేటాయించాలని సమావేశం డిమాండ్‌ చేసింది. రాష్ట్ర రజక చైతన్య సేవా సంస్థ అధ్యక్షుడు కాకినాడ రామారావు మాట్లాడుతూ ప్రభుత్వం రజకులను చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దాట వేస్తోందని నిరసించారు. రజకులను ఎస్సీలలో చేర్చే విషయమై గ్రామాల వారీ ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి, రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేసేందుకు రజకులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఉద్యమంలో భాగంగా మొదట జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద శాంతియుత ఆందోళన చేపట్టాలని సమావేశం నిర్ణయించింది. జిల్లా అధ్యక్షుడు వాడపర్తి కామేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మురమళ్ల రాజబాబు, గౌరవాధ్యక్షుడు ముంగళ్ల నాగసత్యనారాయణ తదితరులు సంఘ సభ్యులనుద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రజక సంఘాలకు చెందిన ప్రతినిధులు  పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు