కదం తొక్కిన విద్యార్థులు

7 Feb, 2017 18:18 IST|Sakshi
కదం తొక్కిన విద్యార్థులు

రాజాం : రాజాం పట్టణంలో రోడ్ల విస్తరణను చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ నెరవేరకపోవడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు విస్తరణ పేరుతో ప్రభుత్వ కార్యాలయాల ప్రహరీలను తొలగించేసి టీడీపీ నేతలు వదిలేశారు. దీంతో ప్రజలకు విసుగొచ్చింది. విద్యార్థులు, ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి.  ఉత్తిత్తి హామీలు ఇస్తే తాటతీస్తామంటూ హెచ్చరించాయి. వివరాల్లోకి వెళితే..

రాజాం ప్రధాన రహదారి విస్తరణకు అధికార టీడీపీ నేతలు హడావుడి చేశారు. అంతటితో ఆగని ఎమ్మెల్సీ ప్రతిభాభారతి నిధులు వచ్చేశాయంటూ  ప్రభుత్వ కార్యాలయాల ప్రహరీలను డిసెంబర్‌ నెలలో తొలగించేసి వదిలేశారు. దీంతో ఉన్న రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. ప్రజలకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే జనవరి ఆరో తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజాం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు విస్తరణకు నిధులు మంజూరు చేసినట్లు ప్రకటించేశారు. ఇది జరిగి నెలరోజులు గడుస్తున్నా ఇంత వరకు రోడ్డు విస్తరణ ప్రక్రియ ప్రారంభం కాలేదు. దీనికితోడు అస్తవ్యస్తంగా తయారైన రోడ్డు కారణంగా ట్రాఫిక్‌ అధికమై ప్రమాదాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో డోలపేటకు చెందిన డిగ్రీ ఫైనలియర్‌ విద్యార్థిని వి.దేవి రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన అందరినీ కలచి వేసింది. దీంతో సోమవారం వందలాది మంది విద్యార్థులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు రాజాం చేరుకొని ధర్నాకు దిగారు.  

4 గంటల పాటు బైఠాయింపు
రాజాం ప్రధాన రహదారి విస్తరణ జాప్యాన్ని నిరసిస్తూ ఫోరం ఫర్‌బెటర్‌ రాజాం సభ్యులు, వైఎస్‌ఆర్‌ సీపీ లీగల్‌ సెల్‌ విభాగం నేతలు, పలువురు సామాజిక కార్యకర్తలు ధర్నాకు పెద్ద ఎత్తున తరలిరాగా మరోవైపు రాజాంలోని పలు కళాశాలలకు చెందిన విద్యార్థులతోపాటు పరిసర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు వీరికి మద్దతు పలికారు. తొలుత అంబేడ్కర్‌ కూడలి వద్దకు పది గంటలకు చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి రోడ్డు విస్తరణ చేస్తారా? చేయరా అంటూ నినదించారు. జనమంతా రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. విషయం తెలుసుకున్న రాజాం సీఐలు శంకరరావు, శేఖర్‌బాబులు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపుచేసే ప్రయత్నం చేశారు.

మరోవైపు రాజాం తహసీల్దార్‌ వై.శ్రీనివాసరావు, నగరపంచాయతీ ఏఈ సురేష్‌కుమార్‌లు రాగా.. వీరిపై విద్యార్థులు విరుచుకుపడడంతో వెనుదిరిగారు. అనంతరం పాలకొండ డీఎస్పీ సీహెచ్‌ ఆదినారాయణ సంఘటన స్థలానికి చేరుకొని ఆరా తీశారు. అంతకుముందు రాజాం సీఐ శంకరరావుతోపాటు సిబ్బంది ధర్నా చేస్తున్న విద్యార్థులను రెక్క పట్టుకొని బయటకు లాగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో ఆవేశానికి గురైన విద్యార్థులు అక్కడే ఉన్న టీడీపీ నాయకుల బ్యానర్లను దహనం చేశారు. ముఖ్యమంత్రి చంద్ర బ్యానర్‌ సైతం చించే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. నాలుగు గంటల పాటు రోడ్డుపై బైఠాయించి సీఎం డౌన్‌ డౌన్, పోలీసులు గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. మృతిచెందిన విద్యార్థి ప్రాణాన్ని తిరిగి తీసుకురాగలరా అంటూ పోలీసులను నిలదీశారు. రాజకీయం చేయకుండా సమస్యలు పరిష్కరించాలని, ఉత్తిత్తి హామీలు ఇస్తే తమ సత్తా చూపుతామని హెచ్చరించారు.

ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం
ఇదిలా ఉండగా ప్రధాన కూడలి వద్ద విద్యార్థులు, ప్రజాసంఘాలు బైఠాయించడంతో రాజాం మీదుగా బొబ్బిలి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పాలకొండ తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులు, వాహనాలు నిలిచిపోయాయి. ఓ వైపు జీఎంఆర్‌ ఐటీ వరకు, మరోవైపు అంతకాపల్లి వరకు, ఇంకోవైపు ఫైర్‌స్టేషన్, గాయత్రి కాలనీల వరకు వాహనాలు నిలిచిపోయాయి. ద్విచక్ర వాహనదారులు సైతం వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

పనులు ప్రారంభిస్తాం..శాంతించండి:కలెక్టర్‌
విద్యార్థుల ఆందోళన ఉధృతం అవుతున్నట్టు గమనించిన పాలకొండ డీఎస్పీ సీహెచ్‌ ఆదినారాయణ అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్‌ లక్ష్మీనరసింహంతో విద్యార్థులను ఫోన్‌లో మాట్లాడించారు. ఈ సందర్భంగా వాగ్దేవి అనే విద్యార్థిని కలెక్టర్‌తో మాట్లాడి సమస్యలను వివరించారు. దీనికి ఆయన స్పందిస్తూ ఒక్క రోజు వ్యవధిలో రోడ్డు పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఏడో తేదీ నుంచి పనులను ప్రారంభిస్తామని కలెక్టర్‌ హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళనను విరమించారు. ఈ సందర్భంగా విద్యార్థిని వాగ్దేవి ‘సాక్షి’తో మాట్లాడుతూ మంగళవారం నుంచి రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించకపోతే అదే రోజు మధ్యాహ్నం నుంచి విద్యార్థులంతా ధర్నాకు దిగుతామని హెచ్చించారు.

మరిన్ని వార్తలు