ఉపాధికి ఎసరు

3 May, 2017 23:43 IST|Sakshi
ఉపాధికి ఎసరు
– జైల్‌రోడ్డులో చిరువ్యాపారులపై నగరపాలక సంస్థ యంత్రాంగం ప్రతాపం 
– రోడ్డు పక్కల వ్యాపారాలు చేయకూడదంటూ హుకుం 
– ఆశీల దోపిడీ ఆపాలని కోరిన చిరువ్యాపారులు 
– అది పట్టించుకోకుండా బడుగుజీవుల ఉపాధిపై వేటు 
– వైఎస్సార్‌సీపీ నేతల జోక్యంతో ఊరట 
సాక్షి, రాజమహేంద్రవరం: కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంగా ఉంది నగరంలోని బడుగుజీవుల పరిస్థితి. తమ వద్ద ఆశీలు కాంట్రాక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా మార్కెట్‌ సరిహద్దులు దాటి వచ్చి మరీ రోజుకు రూ. 20 నుంచి రూ. 40లు వసూలు చేస్తున్నారని, ఈ దోపిడీ ఆపాలని కోరిన చిరు వ్యాపారులకు నగరపాలక సంస్థ యంత్రాంగం దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. నగరంలోని వై జంక్షన్‌ నుంచి లాలాచెరువు వరకు ఉన్న జైల్‌ రోడ్డుకు ఇరు వైపులా చిరు వ్యాపారులు సైకిళ్లు, మోటారు సైకిళ్లు, బుట్టలు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నారు. ఇలా కోరుకొండ రోడ్డు, ఏవీ అప్పారావు, జేఎన్‌ రోడ్డు, పేపర్‌ మిల్లు రోడ్డులు, జన సంచారం ఉన్న ప్రాంతాల్లో తిరుగుతూ వ్యాపారం చేసుకుంటున్నారు. జైల్‌ రోడ్డులో దాదాపు 200 మంది బడుగు జీవులు పుచ్చకాయ, బొప్పాయి, తాటిముంజలు, సపోటా తదితర ఫలాలు అమ్ముకుంటూ సాయంత్రానికి ఇంటికి వెళ్లిపోతున్నారు. వీరిలో పది మంది వికలాంగులు కూడా ఉన్నారు. వారికి ప్రభుత్వం ఎలాంటి ఉపాధి చూపకపోయినా సొంతంగా వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. నాలుగు రోజుల నుంచి నగరపాలక సంస్థ అధికారులు ఈ తరహా వ్యాపారులపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. అధికారులు, పోలీసులు వచ్చి ఈ రోడ్డుకు ఇరువైపులా వ్యాపారాలు చేయకూడదని హడలెత్తిస్తున్నారు. ‘ఈ రోడ్డు రాజవీధి లాంటిది. ఎంతో మంది రాజులు (వీఐపీలు) ఈ రోడ్డులో ప్రయాణిస్తుంటార’నే కారణం చెబుతూ హడావుడి చేస్తున్నారు.
రాజధానుల్లో  లేని నిబంధనలు ఇక్కడా...?
వీఐపీలు తిరిగే ఈ రహదారిలో చిరువ్యాపారులు జీవనం సాగిస్తుంటే తప్పేంటని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి రాజధాని హైదారాబాద్‌లో, విజయవాడలో ముఖ్యమంత్రులు, మంత్రులు, ఉన్నతాధికారులు వచ్చీపోయే సచివాలయం ఎదుట, దేశ, విదేశాల యాత్రికులు సందర్శించే ట్యాంక్‌ బండ్‌పైన చిరుతిళ్ల బండ్లు, షోడా బండ్లు, జామ, పుచ్చకాయల వ్యాపారాలు చేసుకుంటూ వందలాది మంది జీవిస్తుంటారు. సచివాలయం, ట్యాంక్‌బండ్‌లు నగరంలోని జైల్‌రోడ్డు కంటే ప్రాముఖ్యమైనవి కాదా?, అక్కడ బడుగు జీవులు చిరువ్యాపారాలు చేసుకుని బతుకుతుండగా లేనిది ఇక్కడ విచిత్ర నిబంధనలు పెడుతున్నారని మండిపడుతున్నారు. ఆశీలు కాంట్రాక్టర్లు నగరంలో దొరికినకాడ దొరికినట్లు రూ.20 నుంచి రూ.40 వరకు వసూలు చేస్తుంటే పట్టించుకోని యంత్రాంగం తమ ఉపాధిని పోగొట్టేలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. 
వైఎస్సార్‌సీపీ జోక్యంతో బడుగుజీవులకు న్యాయం..
 తమకు న్యాయం చేయాలని వైఎస్సార్‌సీపీ నేతలకు చిరువ్యాపారులు విన్నవించుకున్నారు. బుధవారం వైఎస్సార్‌సీపీ నేతలు కందుల దుర్గేష్, రౌతు సూర్యప్రకాశరావు, మేడపాటి షర్మిలారెడ్డి, గుత్తుల మురళీధర్‌రావు తదితరులు అధికారులతో మాట్లాడి చిరు వ్యాపారులకు అన్యాయం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. 
మరిన్ని వార్తలు