స్వపక్షంలో విపక్షం

7 Apr, 2017 22:58 IST|Sakshi
స్వపక్షంలో విపక్షం
పారిపాలన తీరుపై వాదోపవాదాలు 
– తీర్మానాల అమలు ఆలస్యంపై వాగ్వాదం 
– మేయర్‌పై ధ్వజమెత్తిన టీడీపీ, బీజేపీ ప్రజాప్రతినిధులు 
– నిరసనగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వాకౌట్‌ 
– సభలో ఎమ్మెల్యే గోరంట్ల ఉద్వేగం 
 
*‘‘నాకు మూడు నెలలుగా కంప్యూటర్‌ ఆపరేటర్‌ లేరు. ఇప్పటి వరకు నియమించిన వారు సరిగా పనిచేయడం లేదు. నా అభీష్టం మేరకు కంప్యూటర్‌ను నియమించకపోతే ఎలా? ప్రెస్‌నోట్లు, కమిషనర్‌కు నోట్లు ఎలా ఇవ్వాలి’’ : కౌన్సిల్‌ సాక్షిగా మేయర్‌ ఆవేదన ఇది..
* ‘‘పాలకవర్గం, అధికార యంత్రాంగం మధ్య సమన్వయ లోపంతో నగరంలో అభివృద్ధి కుంటుపడుతోంది. కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి సకాలంలో జీతాలు అందడం లేదు.’’ : పాలక పక్షం ఆగ్రహం
* ‘‘ఇకపై తాను సభలోకి రాకపోవచ్చు. సభ్యులందరూ నగర అభివృద్ధికి కృషి చేయాలి. పదవులు శాశ్వతం కాదు. ఈ విషయం అందరూ గుర్తుంచుకోవాలి’’ : ఎమ్మెల్యే గోరంట్ల నిర్వేదం.
* ‘‘ఇకపై తీర్మానాలపై సంతకాలు, ప్రతివారం స్టాండింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించేలా పాలన జరగాలి. లేదంటే అందరూ ఇబ్బందులు పడతారు’’ : ఎమ్మెల్యేలు గోరంట్ల, ఆకుల హెచ్చరిక
 
ఇలా ఎన్నో విషయాలు, మరెన్నో సమస్యల ప్రస్తావనకు వేదికగా నిలిచింది రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కౌన్సెలింగ్‌ సమావేశం. నగరపాలక సంస్థ బడ్జెట్‌ ఆమోదం కోసం ఏర్పాటు చేసిన ఈ సర్వసభ్య సమావేశంలో కార్పొరేషన్‌ పరిపాలన తీరుపై చర్చసాగింది. పాలక మండలి, అధికార యంత్రాంగం మధ్య సమన్వయ లోపంతో నగరంలో అభివృద్ధి ఏవిధంగా కుంటుపడుతోంది? కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందికి సకాలంలో జీతాలు అందకపోవడం, తదితర విషయాలపై సభ్యులు, ప్రజాప్రతినిధులు ధ్వజమెత్తారు. - సాక్షి రాజమహేంద్రవరం
 
క్రొవిడి లింగరాజు సభా మందిరంలో శుక్రవారం నగరపాలక సంస్థ బడ్జెట్‌ సమావేశం మేయర్‌ పంతం రజనీశేషసాయి అధ్యక్షతన జరిగింది. నగరంలో ఇప్పటి వరకు జరిగిన, ఇకపై జరగబోయే అభివృద్ధి విషయాలను మేయర్‌ సభ్యులకు వివరించారు. ప్రస్తుత సమావేశంలో బడ్జెట్‌పై చర్చించాలని, ఈ నెలలోనే మరో సాధారణ సమావేశం ఏర్పాటు చేసి, ప్రజాసమస్యలు, ప్రశ్నోత్తాలు, ఇతర సమస్యలపై చర్చిద్దామని చెప్పారు. వెంటనే వర్రే శ్రీనివాసరావు మాట్లాడుతూ నగరపాలక సంస్థలో పని చేస్తున్న కంప్యూటర్‌ ఆపరేటర్లకు ఆరు నెలలుగా జీతాలు ఇవ్వకపోడంపై సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. పాలకమండలి తీర్మానాన్ని ఆమోదించినా ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పట్టుబట్టారు. అసలు తప్పు ఎవరిదో చెప్పాలని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి ప్రశ్నించారు. రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల జోక్యం చేసుకుని తీర్మానాలను వెంటనే అమలు చేయాలని కోరారు. 
నాడు ఏం చేశారు?
ఇదే విషయమై గతంలో మేయర్‌కు మద్దతుగా నిలిచిన టీడీపీ ప్రజాప్రతినిధులు, ఇప్పుడు సఖ్యత చెడడంతో మేయర్‌ను నిలదీస్తున్నారా? అనిÐð వైఎస్సార్‌సీపీ చీఫ్‌ విప్, 19వ డివిజన్‌ కార్పొరేటర్‌ మింది నాగేంద్ర టీడీపీ సభ్యులపై ధ్వజమెత్తారు. అధికార పార్టీలో అంతర్గత కుమ్ములాట్ల వల్ల చిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.
2017–18 బడ్జెట్‌పై సభ్యుల సూచనలు... 
* బడ్జెట్‌పై చర్చ సందర్భంగా పలువురు సభ్యులు అందులోని లోపాలను ఎత్తి చూపుతూ సలహాలు, సూచనలు చేశారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది రెవెన్యూ రాబడులు ఎందుకు తగ్గాయో అధికారులు చెప్పాలని వైఎస్సార్‌సీపీ ఫ్లోర్‌లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి ప్రశ్నించారు. ఆశీలు ఒక్కసారిగా నాలుగురెట్లు పెంచడం సరికాదని, అధికారులు పునరాలోచన చేయాలని కోరారు. 2002 నుంచి ఆశీలు పెంచకపోవడం వల్ల ఈ ఏడాది నాలుగు రెట్లు పెంచామని కమిషనర్‌ వి.విజయరామరాజు చెప్పారు. గత ఏడాది ఆశీలు వల్ల రూ.51 లక్షల ఆదాయం వస్తే ఈ ఏడాది పెంచిన రేట్ల వల్ల రూ.1.6కోట్లు రానుందని చెప్పారు.  టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ వర్రే శ్రీనివాసరావు మాట్లాడుతూ పాఠశాలల్లో మరిన్ని సదుపాయాలు కల్పించాలన్నారు.  ఫీజులు చెల్లించిన తర్వాత బీపీఎస్‌ ప్రొసీడింగ్స్‌ ఇవ్వడంలో ప్రజలను అధికారులు చెక్‌లిస్ట్‌ తేవాలని ఇబ్బందులు పెడుతున్నారని 23 డివిజన్‌ కార్పొరేటర్, స్టాండింగ్‌ కమిటీ సభ్యుడు ఇన్నమూరి శ్రీరామచంద్రమూర్తి సభ దృష్టికి తీసుకొచ్చారు. బడ్జెట్‌ ఉగాది పచ్చడిలా ఉందని 12వ డివిజన్‌ స్వతంత్ర కార్పొరేటర్‌ గొర్రెల సురేష్‌ వ్యాఖ్యానించారు. మోరంపూడి–స్టేడియం రోడ్డు 100 అడుగులని మాస్టర్‌ప్లాన్‌లో పెట్టామని ఆరోడ్డు వెడల్పు వంద అడుగులో, లేక 80 అడుగులో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 
మిగులు బడ్జెట్‌... 
నగరపాలక సంస్థ 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను పాలక మండలి ఆమోదించింది. మొత్తం బడ్జెట్‌ విలువ రూ.304 కోట్ల 25లక్షల 35 వేలుగా పేర్కొన్నారు. ఇందులో గత ఏడాది ప్రారంభ నిల్వ రూ.74కోట్ల 63 లక్షలు కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.229 కోట్ల62 లక్షల 30 వేలు వివిధ విభాగాల నుంచి ఆదాయం, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి నిధులు, గ్రాంట్ల రూపంలో రానుందని పేర్కొన్నారు. మొత్తం బడ్జెట్‌ ఖర్చులు రూ. 283 కోట్ల 34 లక్షలుగా చూపారు. ఇక రూ.20 కోట్ల 91 లక్షల 35 వేలను మిగులుగా చూపారు. 
సభలో గోరంట్ల ఉద్వేగం...
టంగుటూరి, ఏబీ నాగేశ్వరరావు, ఏసీవై రెడ్డి లాంటి మహానుభావులెందరో నగర అభివృద్ధికి కృషి చేశారని, ఆ అవకాశం 35 ఏళ్లుగా తనకు దక్కినందుకు సంతోషంగా ఉందని చెబుతూ రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల ఉద్వేగానికి లోనయ్యారు. ఇకపై తాను సభలోకి రాకపోవచ్చని, సభ్యులందరూ నగర అభివృద్ధికి కృషి చేయాలన్నారు. పదవులు శాశ్వతం కాదన్న విషయం అందరూ గుర్తుంచుకోవాలని సూచించారు. 
సభ నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వాకౌట్‌
ఇకపై తీర్మానాలపై సంతకాలు, ప్రతివారం స్టాండింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించేలా పాలన జరగాలని ఎమ్మెల్యేలు గోరంట్ల, ఆకుల విజ్ఞప్తి చేశారు. లేదంటే అందరూ ఇబ్బందులు పడతారని హెచ్చరించారు. మేయర్‌ స్పందించకపోవడంతో ఎమ్మెల్యే ఆకుల, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి సభ నుంచి వాకౌట్‌ చేశారు. మేయర్‌కు వెంటనే కంప్యూటర్‌ ఆపరేటర్‌ను ఇస్తున్నట్టు కమిషనర్‌ ప్రకటించారు.
మరిన్ని వార్తలు