ప్రజాశ్రేయస్సే పరమావధి

15 Jun, 2017 23:31 IST|Sakshi
ప్రజాశ్రేయస్సే పరమావధి
పోలీసు శాఖ ఉత్తమ సేవలు 
డీజీపీ సాంబశివరావు 
రాజవొమ్మంగి : ప్రజలు నిశ్చింతగా, ప్రశాంత వాతావరణంలో జీవించేలా సేవలు అందజేయడమే ప్రధాన లక్ష్యంగా పోలీస్‌ శాఖ పనిచేస్తోందని డీజీపీ నండూరి సాంబశివరావు అన్నారు. రాజవొమ్మంగిలో రూ.2 కోట్లతో నిర్మించిన ఫోర్టిఫైడ్‌ పోలీస్‌ స్టేషన్‌ కాంప్లెక్సుకు ఆయన గురువారం ప్రారంభించారు. తొలుత ఈ రెండస్తుల ఆధునిక పోలీస్‌స్టేషన్‌ ఎదుట నెలకొల్పిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు భారీ విగ్రహానికి పూలమాలలు వేసి  నివాళులర్పించారు. పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాశ్రేయస్సే పోలీస్‌ ప్రధాన కర్తవ్యమని ఆయన అన్నారు. 
గతంలో ఏజెన్సీకు రావాలంటూ ఒక రకమైన ఆందోళన వుండేదని పదేళ్లలో పోలీస్‌శాఖ పనితీరు మెరుగుపడడంతో ఏజెన్సీలో ప్రశాంత వాతావరణాన్ని చూస్తున్నామన్నారు.  ఏమాత్రం ఏమరపాటు లేకుండా శాంతి భద్రలకు విఘాతం కలగకుండా తమ పోలీసు సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు.నక్సల్స్‌ ప్రభావంతో గతంలో మనం ఎన్ని కష్టాలు అనుభవించామో, ఎన్నాళ్లు అభివృద్ధికి దూరంగా వున్నామో తెలియంది కాదని, అటువంటి దుష్పరిణామాలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. 
రాజవొమ్మంగి పోలీస్‌స్టేషన్‌ చారిత్రాత్మకమైనది 
అల్లూరి సందర్శించిన రాజవొమ్మంగి పోలీస్‌స్టేషన్‌ చారిత్రాత్మకమైనదని, దీనిని మరింత అభివృద్ధి చేసి ప్రజాసందర్శనకు వీలుగా పెడతామన్నారు. అల్లూరి తైలవర్ణ చిత్రాలు, ఆనవాళ్లతో ఇప్పటికే సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన రాజవొమ్మంగి పాత పోలీస్‌స్టేషన్‌ భవనాన్ని ఆయన ఆశక్తిగా తిలకించారు. డీజీపీకి అల్లూరి సీతారామరాజు యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పడాల వీరభద్రరావు జ్ఞాపిక అందజేశారు. ఆయనతో పాటు ఐజీపీ ఆంధ్రారీజన్‌ కుమార్‌ విశ్వజిత్, ఏలూరు రేంజ్‌ డీఐజీ పీవీఎస్‌.రామకృష్ణ, జిల్లా ఎస్పీ ఎం. రవిప్రకాశ్, ఓఎస్‌డీ రవిశంకరరెడ్డి, రంపచోడవరం ఏఎస్పీ అడ్నాన్‌ నయూం అస్మి హాజరు కాగా స్థానిక సీఐ వెంకట త్రినాథ్‌, ఎస్సైలు రవికుమార్, వెంకట నాగార్జున కార్యక్రమాలను పర్యవేక్షించారు. 
పాఠశాల చిన్నారులతో మమేకమైన డీజీపీ 
రాజవొమ్మంగి శ్రీ అల్లూరి సీతారామరాజు జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులతో డీజీపీ సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. డీజీపీ అడిగిన ప్రశ్నలకు సరైన జవాబు ఇవ్వక పోవడంతో ఇంకా బాగా చదువుకోవాలన్నారు. పాఠశాలలో ఏవైనా సమస్యలు వన్నాయా అని అడిగిన ప్రశ్నకు పిల్లలు టాయ్‌లెట్స్‌ డోర్స్‌లేవని బదులిచ్చారు. దీంతో వెంటనే రూ.25 వేల నగదు అందజేసి వెంటనే మరుగుదొడ్లను అన్ని సదుపాయాలతో తీర్చిదిద్దాలని ఆయన రంపచోడవరం ఏఎస్పీని ఆదేశించారు. ఇంకా అవసరమైతే నగదు అందజేస్తానని అన్నారు. అలాగే పేద విద్యార్థులు ఎవరైనా వున్నారా అని ప్రశ్నించిన డీజీపీ ఆ వెంటనే మరో రూ.8 వేల నగదు అందజేసి ప్రతి ఒక్కరికీ జామెట్రీ బాక్స్‌ (కాంపాస్‌ బాక్స్‌లు) కొనుగోలు చేసి ఇవ్వాలని కోరారు.
మరిన్ని వార్తలు