రాజీవ్ రహదారి మరో 100 కి.మీ.

13 Oct, 2015 02:25 IST|Sakshi
రాజీవ్ రహదారి మరో 100 కి.మీ.

♦ సిర్పూర్ మీదుగా మహారాష్ట్ర  వరకు నాలుగువరుసల నిర్మాణం
♦ రోడ్లు, భవనాల శాఖ {పతిపాదనకు ప్రభుత్వం ఆమోదం
♦ దాదాపు రూ.వేయి కోట్ల వ్యయం!
 
 సాక్షి, హైదరాబాద్: రాజీవ్ రహదారిని మరో వంద కిలోమీటర్లు నాలుగు వరుసలుగా నిర్మించేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించనున్న ఈ రహదారి నిర్మాణానికి రూ.వేయి కోట్లు ఖర్చవుతుందని అంచనా. దీనికి సంబంధించి రోడ్లు భవనాల శాఖ డీపీఆర్ సిద్ధం చేస్తోంది. దీని నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నుంచి మహరాష్ట్ర సరిహద్దు వరకు ఎలాంటి అంతరాయం లేకుండా రాకపోకలు సాగించడానికి వీలు కలుగుతుంది. ఆసిఫాబాద్, సిర్పూర్, మంచి ర్యాల ప్రాంతాల్లో సింగరేణి బొగ్గు గనులతోపాటు వివిధ రకాల పరిశ్రమలు, పేపర్ మిల్స్ ఉండడంతో ఈ రోడ్డు బీఓటీ కింద నిర్మాణం సాధ్యమని నిర్ణయానికి వచ్చిన రోడ్లు భవనాల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. టోల్‌గేట్ల ద్వారా నిర్మాణ సంస్థలు ఆదాయం పొందుతాయి.  

 వంద కిలోమీటర్ల విస్తరణ...
 ప్రస్తుతం రాజీవ్ రహదారి హైదరాబాద్ నుంచి రామగుండం వరకు విస్తరించి ఉంది. ఇందులో మంచిర్యాల దాటిన తర్వాత ఇందారం వరకు మాత్రమే నాలుగు వరుసలుగా ఉంది. ఆ తరువాత నిజామాబాద్-జగ్దల్‌పూర్ జాతీయ రహదారి కలుస్తుంది. దాన్ని దాటుకుని అటు ఆసిఫాబాద్, ఇటు సిర్పూర్ వరకు సరైన రోడ్డు వ్యవస్థ లేదు. ఇది బొగ్గు గనులు, పరిశ్రమలతో ఉన్న ప్రాంతం కావడంతో ఆ రోడ్డును విస్తరించాలని చాలాకాలంగా డిమాండ్ ఉంది. అక్కడి నుంచి అటు మహారాష్ట్రకు ఎగుమతులు, దిగుమతులు ఉంటుండడంతో భారీ ట్రాక్కుల రాకపోకలూ జరుగుతాయి.

దీన్ని దృష్టిలో ఉంచుకుని రోడ్లు భవనాల శాఖ తాజాగా సర్వే నిర్వహించి బీఓటీ కింద రోడ్డును విస్తరించేందుకు వెసులుబాటు ఉందని గుర్తించి ప్రభుత్వానికి నివేదించింది.  టోల్‌ప్లాజాల  రూపంలో వచ్చే ఆదాయంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నిర్మాణ సంస్థలు అంతగా ఉత్సాహం చూపడం లేదు. కానీ పరిశ్రమలు, బొగ్గు గనులున్నందున ఈ మార్గంలో ఆదాయం బాగానే ఉంటుందని రోడ్లు భవనాల శాఖ నిర్ధారణకు వచ్చింది. హైదరాబాద్ నుంచి రామగుండం వరకు ఇప్పటికే నిర్మాణమైన రాజీవ్ రహదారిలో ఉన్న లోపాలను సరి దిద్దేందుకు పం పిన ప్రతిపాదనలకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాగా, ఇందుకోసం అవసరమైన భూసేకరణ సంబంధించి ప్రతిపాదనకు మాత్రం ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది.

>
మరిన్ని వార్తలు