రామ రామ..!

21 Aug, 2016 23:57 IST|Sakshi
సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది
  •  సీతమ్మ వారి మంగళ సూత్రాలు మాయం
  •  లక్ష్మణ స్వామి బంగారు లాకెట్‌ ఎక్కడుందో!
  •  ఆభరణాల మాయంపై విచారణకు ఈఓ ఆదేశం
  •  వైదిక సిబ్బందితో అత్యవసర సమావేశం
  •  నేటి సాయంత్రం వరకు గడువు కోరిన అర్చకులు

  • భద్రాచలం :    భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో సీతమ్మవారి మంగళసూత్రాలు మాయమయ్యాయి. లక్ష్మణస్వామి మెడలో ధరింపజేసే బంగారు లాకెట్‌ కూడా కనిపించటం లేదు. గర్భగుడిలోని బీరువాలో భద్రంగా ఉండాల్సిన రెండు బంగారు గొలుసులు ఎక్కుడున్నాయనే దానిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. నిత్య కల్యాణంలో అలంకరించేందుకు భక్తులు సమర్పించిన మంగళసూత్రాలు, బంగారు లాకెట్‌ మాయమైనట్లుగా దేవస్థానం ఈఓ రమేష్‌బాబు ధ్రువీకరించారు. రామాలయంలో ఇటీవలి పరిణామాలు భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేవాదాయశాఖ ఉన్నతాధికారులు సైతం దీనిపై కన్నెర్రజేస్తున్నారు.

    • నగలు ఏమైనట్టు?

    దేవస్థానంలో పవిత్రోత్సవాలు ముగిసిన తరువాత ఈ నెల 19 నుంచి  స్వామివారి నిత్యకల్యాణాలు పునః ప్రారంభయ్యాయి. కల్యాణోత్సవంలో స్వామివారికి ఆభరణాలను అలంకరించే  సమయంలో కొన్ని నగలు మాయమైనట్లు గుర్తించిన అర్చకులు విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. కానీ విషయం బయటకు పొక్కిందనే విషయాన్ని గ్రహించిన అర్చకులు ముందు జాగ్రత్తగా ఈఓ రమేష్‌బాబు దృష్టికి తీసుకెళ్లారు. ఇన్‌చార్జి ఈఓ కావటంతో ఆయన ఇక్కడ అందుబాటులో లేరు. ఆదివారం హుటాహుటిన భద్రాచలం చేరుకున్నారు. జరిగిన పరిణామాలపై అర్చకులు, ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బందితో చర్చించారు. గర్భగుడిలో బంగారు ఆభరణాలు భద్రపరిచే బీరువా, బాక్సులను పరిశీలించారు. అర్చకుల ఆధ్వర్యంలో ఉన్న ఆభరణాల లెక్క తేల్చాలని ఆదేశించటంతో ఆదివారం మధ్యాహ్నం ఆలయ తలుపులు మూసిన తరువాత వాటి లెక్కింపు ప్రారంభించారు. ఈ ప్రక్రియ సోమవారం కూడా కొనసాగనుంది. తీవ్ర చర్చనీయాంశమైన ఆభరణాల మాయంపై పోలీసులతో పాటు నిఘా వర్గాలు సైతం ఆరా తీశాయి.

    • వైదిక సిబ్బందితో అత్యవసర సమావేశం

     గర్భగుడిలోని బీరువాలో భద్రంగా ఉండాల్సిన రెండు బంగారు ఆభరణాలు కనిపించకపోవటంపై ఈఓ రమేష్‌బాబు తీవ్రంగానే స్పందించారు. భక్తుల మనోభావాలతో కూడిన అంశం కావటంతో వైదిక సిబ్బందితో తన చాంబర్‌లో అత్యవసర సమావేశమయ్యారు. మిగతా సిబ్బందినెవర్నీ లోపలకి రానివ్వకుండా, చివరకు మీyì యా ఫొటోలు తీసుకునేందుకు కూడా నిరాకరించి, సుమారు గంటపాటు సుదీర్ఘంగా దీనిపై వైదిక సిబ్బందితో చర్చించారు.

    • అవును...ఆభరణాలు కనిపించటం లేదు: ఈఓ

    రెండు బంగారు ఆభరణాలు కనిపిం^è టం లేదని ఈఓ రమేష్‌బాబు విలేకరులతో అన్నారు. నిత్య పూజలు, శ్రీరామనవమి, ఇతర ఉత్సవాల్లో స్వామివారికి అలంకరించే బంగారు ఆభరణాలన్నీ కలిసిపోయాయి.. కాబట్టి లెక్కింపు కొంత ఇబ్బందిగా ఉందని అర్చకులు చెప్పారని, సోమవారం సాయంత్రం వరకు దీనిపై గడువు కోరినట్లుగా తెలిపారు. వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా తాను కూడా స్వయంగా ఆభరణాలను పరిశీలించి, దీనిపై సమగ్ర నివేదిక ఉన్నతాధికారులకు అందజేస్తానన్నారు. ఆభరణాలను భద్రపరచటంలో అర్చకుల నిర్లక్ష్యం ఉన్నట్లుగా తేటతెల్లమవుతోందన్నారు.

    • ఎందుకిలా..!

    శ్రీసీతారాముల వారి మూర్తుల ఆభరణాలకు ఎంతో విశిష్టత ఉంది. లోకానికి ఆదర్శమూర్తులైన శ్రీసీతారాముల వారికి ధరింప జేసిన వస్తువులకు భక్తుల నుంచి మంచి ఆదరణ ఉంటుంది. వాటిని పొందేందుకు కొంతమంది ఎంత డబ్బులైనా వెచ్చిస్తారు. భక్తుల ప్రగాఢ విశ్వాసాన్ని భద్రాద్రి దేవస్థానంలోనిlకొంతమంది అర్చకులు సొమ్ము చేసుకునే క్రమంలోనే బంగారు ఆభరణాలు మాయమవుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఉత్సవమూర్తులపై ఉన్న ఆభరణాలను మాయం చేయటం, వాటిని లక్షలాది రూపాయలకు అమ్ముకోవటం, ఒక వేళ ఈ విషయం బయటకు పోక్కితే అదే ఆకృతిలో ఉన్న ఆభరణాన్ని తయారు చేయించి యథాస్థానంలో పెడుతున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. గతంలో ఇలాగే రెండుసార్లు ఉత్సవమూర్తుల ఆభరణాలు మాయమయ్యాయని, ఈ విషయం బయటకు పొక్కనీయకుండా బాధ్యులైన అర్చకులతోనే వాటిని తయారు చేయించి యథాస్థానంలో ఉంచారనే ప్రచారం ఉంది.

    • రాములోరి బంగారం భద్రమేనా..?

    భద్రాద్రి ఆలయానికి భక్తులు సమర్పించిన కానుకలతో పాటు రామదాసు కాలం నాటి ఆభరణాలను కలుపుకొని మొత్తం 50 కేజీల వరకు బంగారు నిల్వలున్నాయి. 750 కేజీల వెండి ఉంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో రామాలయంలో బంగారం భద్రమేనా? అనే సందేహం నెలకొంది. ఉత్సవమూర్తులను అమెరికాకు అమ్మకానికి పెట్టడం.. విదేశాల్లో రాములోరి కల్యాణం పేరుతో కొందరు అర్చకులు తమ ఇళ్లలోని విగ్రహాలను తీసుకెళ్లి సొమ్ము చేసుకోవడం.. ఉత్సవమూర్తులకు బంగారు కవచం ధరింపజేసే సమయంలో బంగారం కనిపించకపోవడం.. ఆలయ ప్రతిష్టను దిగజార్చుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొంతమంది అర్చకుల వ్యవహాశైలితోనే ఇలా జరుగుతోందని భక్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు.

     

మరిన్ని వార్తలు