ఆ ప్రలోభాలకు నేను దూరం..

4 Nov, 2016 18:25 IST|Sakshi
‘నా జీవితం ఆయన పాదసేవకే అంకితం’

తిరుమల : తనపై వచ్చిన ఆరోపణలపై తిరుమల స్వామివారి ఆలయం ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు స్పందించారు. తన జీవితం స్వామివారికే అంకితమని, 50 ఏళ్లుగా తన పేరు ప్రతిష్టలను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాగా గతనెలలో స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నైవేద్య విరామ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా మనవడిని ఆలయంలోనికి తీసుకువెళ్లడంతో పాటు తిరునామానికి సంబంధించి రమణ దీక్షితులపై ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ...'1974 నుంచి స్వామిరవారికి కైంకర్యాలను నిర్వహిస్తున్నాం.

ఉత్తమమైన పదవులను వదులుకుని దైవ సేవకు వచ్చా. సామరస్యం, సంస్కారం నా సొంతం. ఇంత అనుభవం ఉన్నా...నన్ను వేలెత్తి చూపుతున్నారు. ఇది దురదృష్టకర ఘటన. అర్చకులపై నిందారోపణలు రావడం శోచనీయం. నాపై కక్ష సాధింపు కోసమే ఈ ఆరోపణలు. నా పాత్ర వరకే నేను పరిమితం, ఇతర విషయాలు పట్టించుకోను. అపచారాలను నేను వేలెత్తి చూపుతాను.

దేవాలయంలో ప్రలోభకరమైన విషయాలు ఉన్నాయి. కానుకలు, డబ్బులు, పదవుల కేంద్రంగా ఇవి సాగుతున్నాయి. ఈ ప్రలోభాలకు నేను దూరం. చేసేవారికి సహకరించకపోవడం వల్లే కక్ష కడుతున్నారు.’ అని తెలిపారు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా తన మనవడిని ఆలయంలోకి తీసుకు వెళ్లిన ఘటనపై టీటీడీ యాజమాన్యం.. రమణ దీక్షితులకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు