రామయ్యా... ప్రసాదమేదయ్యా?!

11 Sep, 2016 23:05 IST|Sakshi
ప్రసాదం అయిపోవటంతో క్వూ లై¯ŒSలో వేచి ఉన్న భక్తులు


భద్రాచలం :
అది, భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం. సెలవు రోజవడంతో భక్తులు పెద్ద సంఖ్యలోనే వచ్చారు. రామయ్య దర్శనానంతరం బయటకు వచ్చిన భక్తులకు అర్చకులు ప్రసాదం ఇవ్వలేదు! ఎందుకు ఇవ్వలేదో వెంటనే అర్థమవలేదు. కొన్ని నిముషాల తరువాత...‘‘ప్రసాదం అయిపోయింది. కొద్దిసేపు ఆగితే వస్తుంది’’ అని అక్కడి అర్చకులు చెప్పారు. కొద్దిసేపు కాదు.. దాదాపుగా పావుగంట తరువాత తీరిగ్గా ప్రసాదాన్ని తీసుకొచ్చి పంపిణీ చేశారు. అంతసేపు క్యూలైన్‌లో నిలబడలేక వృద్ధులు, చంటి పిల్లల తల్లులు, చిన్న పిల్లలు ఇబ్బందిపడ్డారు. ప్రసాదం కోసం భక్తులను ఇలా క్యూలైన్‌లో ఇంతసేపు నిలబెట్టడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ కొన్నిసార్లు ఇలాగే జరిగింది. ‘ఆలయంలో పాలన గాడి తప్పిందనడానికి, పర్యవేక్షణ కొరవడిందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి?’– ఈ ఆలయంలోని ఇటీవలి పరిణామాలు తెలిసిన (క్యూ లైన్‌లోని) ఒకరిద్దరు భక్తుల వ్యాఖ్యానమిది.
దేవస్థానానికి పూర్తిస్థాయి కార్యనిర్వహణాధికారి(ఈఓ) లేకపోవడంతో ఆలయ పాలన గాడి తప్పిందని భక్తులు బాహాటంగానే అంటున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం గర్భగుడి నుంచి బయటకు వచ్చే భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేస్తారు. ఆదివారం ప్రసాదం అందుబాటులో లేకపోవటంతో భక్తులు వేచి ఉండాల్సి వచ్చింది. ప్రసాదం అయిపోయిందనే విషయాన్ని అర్చకుడు చెబుదామంటే.. దగ్గరలో ఆలయ ఉద్యోగులెవ్వరూ లేరు. ప్రసాదాల తయారీశాలలోని సిబ్బందికి చెప్పిన తరువాత పావు గంటకు ప్రసాదాన్ని తీసుకొచ్చారు. ఆ తరువాత దానిని భక్తులకు పంపిణీ చేశారు. ప్రసాదాల పంపిణీ కౌంటర్‌ వద్ద భక్తులకు అందజేసే ప్రసాదం సరిపడా ఉందా లేదా, అనే విషయాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ప్రసాదం అయిపోతుందని ముందుగానే గుర్తించి, భక్తులకు అసౌకర్యం కలగకుండా సిద్ధం చేయాలి. ఆలయంలో పర్యవేక్షణ లేకపోవటంతో అంతా గందరగోళంగా తయారవుతోంది.ఇటీవలి పరిణమాలతోనైనా దేవస్థానం అధికారులు కళ్లు తెరవకపోవటంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో జరిగే విషయాలను మీడియాకు చెప్పవద్దని ఉద్యోగులతో ప్రమాణాలు చేయించి, మరో అపఖ్యాతి మూటగట్టుకున్న ఆలయ అధికారులు.. తమ లోపాలను సరిచేసేందుకు మాత్రం శ్రద్ధ చూపడం లేదని భక్తులు విమర్శిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు