యథేచ్ఛగా "నల్ల" దందా

3 Oct, 2016 00:31 IST|Sakshi
యథేచ్ఛగా "నల్ల" దందా
సాక్షి, హన్మకొండ :
గుట్టు చప్పుడు కాకుండా గుడుంబా మత్తులో తండాలు తూగుతున్నాయి. పోలీసు, ఎక్సైజ్‌ అధికారుల దాడులకు చిక్కకుండా బెల్లం మాఫియా కొత్త పద్ధతిలో పనులు చక్కబెట్టుకుంటోంది. గతంలో మహబూబాబాద్‌ కేంద్రంగా ఉన్న తమ అడ్డాలను మార్చి చుట్టుపక్కలకు విస్తరించారు. మొబైల్‌ ఫోన్లను విరివిగా ఉపయోగిస్తూ గుడుంబా తయారీదారులకు నల్లబెల్లాన్ని యథేచ్ఛగా సరఫరా చేస్తున్నారు.
కొత్త పంథాలో..
బెల్లం అక్రమ రవాణాలో ఆరితేరిన వ్యక్తులు కొత్త పంథాలో గుడుంబా తయారీదారులకు చేరవేస్తున్నారు. రెండేళ్ల క్రితం వరకు మహబూబాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో గుడుంబా విచ్చలవిడిగా తయారయ్యేది. మహబూబాబాద్‌ మార్కెట్‌లో బెల్లం విరివిగా లభ్యమయ్యేది. పొరుగు రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల నుంచి లారీల్లో వచ్చే బెల్లం లోడును మహబూబాబాద్‌ పట్టణంలో నిల్వ చేసేవారు.  తాజాగా జరుగుతున్న దాడులతో మహబూబాబాద్‌లో బెల్లం అమ్మకాలు తగ్గిపోయి చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించాయి.  మహబూబాబాద్‌ కేంద్రంగా భారీ ఎత్తున బెల్లం నిల్వ చేయడాన్ని తగ్గించిన వ్యాపారులు.. శివారు ప్రాంతాల్లో తాత్కాలిక అడ్డాలను ఏర్పాటు చేసుకుని పనులు చక్కబెడుతున్నారు.
ఫోన్లలో సమాచారం..
అక్రమంగా బెల్లం సరఫరా చేసే వ్యక్తులు మొబైల్‌ ఫోన్ల ద్వారా గుడుంబా తయారీదారులతో నిత్యం టచ్‌లో ఉంటున్నారు. ఎవరెవరికి ఎంత బెల్లం కావాలో ఆర్డర్‌ తీసుకుని లారీలలో బెల్లం లోడు వచ్చే రోజు, సమయం గురించి గుడుంబా తయారీదారులకు చేరవేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా పైన ఉల్లిగడ్డ బస్తాలు, అడుగున నల్లబెల్లం పెడుతున్నారు. ఇలా పకడ్బందీ వ్యూహంతో వచ్చే బెల్లం లోడు  లారీలను అర్ధరాత్రి , తెల్లవారుజామున మహబూబాబాద్‌ పట్టణానికి ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరంలో గల నిర్మానుష్య ప్రాంతంలో నిలిపి ఉంచుతారు. ముందస్తు సమాచారం ప్రకారం అక్కడికి చేరుకున్న టాటామ్యాజిక్, ఆటోలు, ద్విచక్ర వాహనాలపై బెల్లాన్ని గుడుంబా బట్టీలకు తరలిస్తున్నారు. రెండు గంటల వ్యవధిలోనే ఈ మొత్తం తతంగాన్ని పూర్తి చేస్తున్నారు.
క్వింటా రూ .8000..
ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు, చిత్తూరు నుంచి బెల్లం మహబూబాబాద్‌కు సరఫరా అవుతోంది. అక్కడ బహిరంగ మార్కెట్‌లో క్వింటా ధర మూడు వేల రూపాయలుగా ఉంది. అదే బెల్లాన్ని ఇక్కడికి తీసుకొచ్చి క్వింటా రూ. 8000కు అమ్ముతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒక్క క్వింటాపై దాదాపు మూడు రెట్ల లాభాలు ఉండటంతో ఈ వ్యవహారంలో పాలుపంచుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది. దీంతో అక్రమ పద్ధతిలో బెల్లం అమ్మకాలు పుంజుకుంటున్నాయి. ఇటీవల అర్ధరాత్రి వేళ నల్లబెల్లం సరఫరా చేసేందుకు వెళ్లిన ఓ యువకుడు పోలీసుల భయంతో చీకట్లో పరిగెత్తి వ్యవసాయ బావిలో పడిపోయి చనిపోయిన సంఘటన బెల్లం మాఫియా ఆగడాలకు ఉదాహరణగా నిలుస్తోంది. ఎక్సైజ్, పోలీసు అధికారులు బెల్లం మాఫియాలో ఉన్న ప్రధాన సూత్రదారులను చూసీ చూడనట్లుగా వదిలేస్తున్నాని, సా«ధారణ వ్యాపారులు, ఆటోడ్రైవర్లపై ఎక్కువ నిర్భంధం అమలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

  • మానుకోట చుట్టూ  నల్లబెల్లం విక్రయాలు
  • శివారు ప్రాంతాల్లో వ్యాపారుల అడ్డా 
  • మొబైల్‌ ఫోన్ల ద్వారా సమాచారం
  • రెండు గంటల్లో వ్యవహారం పూర్తి
  • అర్ధరాత్రి దందాకు అడ్డుకట్ట ఏదీ ? 
మరిన్ని వార్తలు