శరవేగంగా పునర్విభజన!

11 Jun, 2016 09:31 IST|Sakshi

కామారెడ్డి జిల్లా  కేంద్రంపై కలెక్టర్ సమీక్ష
ఉద్యోగుల విభజనపై అధికారులతో భేటీ
జిల్లా కార్యాలయాలకు జేసీ బృందం స్థల పరిశీలన
మండలాలు, డివిజన్లపై వచ్చిన స్పష్టత

 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ :  కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. పునర్విభజన కోసం సీఎం కేసీఆర్ రెండు రోజుల సమావేశంలో కలెక్టర్‌లకు సూచించిన ఫార్మాట్ ప్రకారం కార్యాచరణ సాగుతోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు కావాల్సిన అధికారులు, ఉద్యోగుల కేటాయింపు, విభజనలపై కలెక్టర్ డాక్టర్ యోగితారాణా శుక్రవారం రెండు దఫాలుగా సమావేశం నిర్వహించారు. ఉదయం ప్రగతిభవన్‌లో జిల్లా అధికారులతో ఆయా శాఖలలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది వివరాలపై చర్చించినట్లు తెలిసింది.

జిల్లాలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులకు తోడు కొత్తగా అవసరమయ్యే వారి జాబితాను తయారు చేసే పనిలో ఉన్నతాధికారులు నిమగ్నం కావాలని సూచించారు. సాయంత్రం సర్పంచ్‌లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఆర్‌డీవోలు, డీఎల్‌పీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ పునర్విభజనపై అభిప్రాయ సేకరణ చేసినట్లు తెలిసింది. కొత్తగా ఏర్పడే మండలాలు, రెవెన్యూ డివిజన్లపై సూచనలు చేసినట్లు సమాచారం. కాగా నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూరు, బాల్కొండ, బోధన్ నియోజకవర్గాలతో నిజామాబాద్ జిల్లా, బాన్సువాడ, కామారెడ్డి, జుక్కల్, ఎల్లారెడ్డిలతో ఏర్పడే కామారెడ్డి జిల్లా కోసం ఉద్యోగులు, సిబ్బంది, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లపై సమీక్షించారు. కొత్తగా 10 మండలాలు ఖాయం జిల్లాలో మొన్న కొత్తగా ఏర్పడిన ఆర్మూరు రెవెన్యూ డివిజన్‌తోపాటు నాలుగు ఉండగా, శరవేగంగా పునర్విభజన!

నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూరులకు తోడు బాన్సువాడ డివిజన్ కొత్తగా ఏర్పడనుంది. అలాగే 36 మండలాలకు తోడు కొత్తగా మరో 10 మండలాలను కలిపి 46 చేయనున్నారు. ఇప్పుడున్న మండలాలకు తోడు నిజామాబాద్ నార్త్, నిజామాబాద్ సౌత్, నిజామాబాద్ రూరల్, ఆలూరు, రెంజర్ల, బాన్సువాడ రూరల్, రుద్రూరు, బీబీపేట, దేవునిపల్లి, మరో మండలం ఏర్పడనుంది. ఈ ప్రతిపాదనలకు ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో కూడా సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కాగా మండలాలు, డివిజన్ల ఏర్పాటు దాదాపుగా ఖరారు కాగా, ఉద్యోగుల విభజన, కేటాయింపు, కామారెడ్డి జిల్లాలో కొత్త కార్యాలయాల ఏర్పాటుపైనా కలెక్టర్ డాక్టర్ యోగితారాణా, జాయింట్ కలెక్టర్ రవీందర్‌రెడ్డి దృష్టి సారించారు. మిగతా జిల్లాలతో పోలిస్తే నిజామాబాద్‌లోనే పునర్విభజన పనులు శరవేగంగా జరుగుతున్నాయన్న చర్చ కూడా ఉంది.

 కామారెడ్డిలో జేసీ రవిందర్ రెడ్డి పర్యటన
జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా కామారెడ్డిలో కలెక్టరేట్ భవన సముదాయం, ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ కోసం జేసీ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో అధికారుల బృందం శుక్రవారం కామారెడ్డిలో భవనాలు, స్థల పరిశీలన చేసింది. దసరా నాటికి కొత్త జిల్లాల్లో పరిపాలన సాగుతుందన్న సీఎం ప్రకటన నేపథ్యంలో అధికారయంత్రాంగం శరవేగంగా ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగానే జేసీ రవీందర్‌రెడ్డి, అర్కిటెక్చర్ ఉషారెడ్డి, డ్వామా పీడీ వెంకటేశ్వర్లు, హౌసింగ్ పీడీ చైతన్యకుమా ర్, ల్యాండ్ సర్వే రికార్డ్స్ అధికారులు శుక్రవారం కామారెడ్డిలో పర్యటిం చారు. తాత్కాలికంగా జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన భవనాలను పరిశీలించారు. కలెక్టరేట్ సముదాయ నిర్మాణానికి గాను అడ్లూర్ శివారులోని ప్రభుత్వ భూమిని కూడా అధికారులు పరిశీలించారు.

 నూతన మండల కేంద్రంగా ‘ రెంజర్ల’ ...!
బాల్కొండ/మోర్తాడ్ : మండలాల పునర్విభజనలో భాగంగా రెంజర్ల మండలం తెరపైకి వచ్చింది. బాల్కొండ, మోర్తాడ్ మండలాల్లోని గ్రామాలను కలిపి రెంజర్ల మండలంగా ఏర్పాటు చేయాలని జిల్లా అధికార యంత్రాంగం ప్రతిపాదనలను సిద్ధం చేసింది. రెండు మండలాల్లోని 15 గ్రామాలతో కొత్తగా రెంజర్ల మండలం ఏర్పాటు ప్రతిపాదనలపై ఆమోదం, అభ్యంతరాలు ఉంటే తీర్మానాలు చేసి పంపాల్సిందిగా జిల్లా కలెక్టర్ శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మండల స్థాయి, గ్రామ స్థాయి అధికారులకు సూచించారు.

చబాల్కొండ మండలంలోని చాకీర్యాల్, మెండోరా, కోడిచర్ల, సావెల్,  వెల్కటూర్, వెంచిర్యాల్, రెంజర్ల, నాగంపేట్, కొత్తపల్లి , మోర్తాడ్ మండలంలోని ఏర్గట్ల, తాళ్ల రాంపూర్, దోంచంద, గుమ్మిర్యాల్,  బట్టాపూర్, తడ్‌పాకల్  గ్రామాలను కలుపుతు రెంజర్ల మండల కేంద్రంగా ఏర్పాటు  చేస్తున్నారు.  ఇవే గ్రామాలతో 1985 గెజిట్ ప్రకారం ఏర్గట్ల మండలం ఏర్పాటు కావాల్సి ఉండగా అప్పట్లో ఏర్గట్లకు బదులు కమ్మర్‌పల్లి మండలంగా ఏర్పడటంతో ఏర్గట్ల మండలం రద్దు అయ్యింది.

అయితే ఇప్పుడు మండల కేంద్రానికి మండలంలోని గ్రామాలు 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉండాలని ప్రభుత్వం సూచించడంతో ఏర్గట్లకు బదులు రెంజర్ల మండల కేంద్రంగా ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. అంతే కాకుండ జాతీయ రహదారి 44 ను జాతీయ రహదారి 63 ను కలుపుటకు  డబుల్ రోడ్డు సౌకర్యం ఉంది. అయితే మండలాల పునర్విభజన కొంత దుమారంరేపుతోంది. అధికారులు మాత్రం అభ్యంతరాలను పరిశీలించిన తరువాత ప్రభుత్వానికి తుదినివేదిక పంపించే అవకాశం ఉంది.

 తీర్మానం పంపాలన్నారు
రెంజర్ల మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తూ బాల్కొండలోని తొమ్మిది గ్రామాలు, మోర్తాడ్‌లోని  ఆరు గ్రామాల తీర్మానాలు  చేసి  ఈనెల 15 లోపు  పంపాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.    - శ్రీనివాస్, ఎంపీడీఓ, బాల్కొండ

మరిన్ని వార్తలు