చూసొద్దాం రండి

7 May, 2017 00:17 IST|Sakshi
చూసొద్దాం రండి

‘సీమ’కే తలమానికం రత్నగిరి క్షేత్రం
రొళ్ల (మడకశిర) : చెక్కుచెదరని కోటలు, కొండపై ఎత్తైన బురుజు, గజశాలలు, రాతి ఏనుగులు, కల్యాణిబావులు, మంటపాలు, పురాతన కట్టడాలతో రత్నగిరి క్షేత్రం రాయలసీమకే తలమానికంగా నిలుస్తోంది. రత్నగిరికి 1900 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. రత్నగిరి సంస్థానాన్ని మొదట రాజుగ తిమ్మప్పనాయక పాలించారు. అతని తాత మాదప్పనాయక ఆనేగొందిని పాలించారు.ఆయనకు నలుగురు సంతానం మొదటి రాజు అయిన కెంపు లక్ష్మణనాయక, లక్ష్మణనాయక, మంద నాగనాయక, రత్రాంబిక అనే వారు ఉండేవారని చరిత్ర చెబుతోంది. క్రీ.శ.1799లో ఇక్కడికి వచ్చిన కర్ణాటక ప్రాంత మైసూరు శ్రీరంగపట్టణం టిప్పుసుల్తాన్‌రాజు రత్నగిరికి ‘ముస్తాఫాబాద్‌’ అని నామకరణం కూడా చేశారు.

అలనాటి రాజుల పాలనకు గుర్తుగా ఎన్నో దేవాలయాలు, భవనాలు, కోట ముఖద్వారాలు, ఇరు పక్కల రాతి ఏనుగులు, కల్యాణి బావులు నిర్మించారు. రాజులు నిర్మించిన శత్రుదుర్బేధ్యమైన కోటలు, రాణులు స్నానం ఆచరించడానికి  ప్రత్యేకంగా నిర్మించిన ఈత కొలనులు, కొండ పైకి ఎక్కేందుకు బండపై చెక్కిన మెటికెలు, ఇక్కడ శత్రువుల రాకను పసిగట్టి రాజును, సైనికులను అప్రమత్తం చేసేందుకు ఏర్పాటు చేసిన స్థలం, రాణి నివసించేందుకు ఏర్పాటు చేసిన విశాలమైన భవంతి, శత్రువులు ప్రవేశించడానికి వీలుకాకుండా కొండపైన చుట్టూ 35 అడుగుల ఎత్తులో ప్రహరీ నిర్మించారు. రత్నగిరి కొండను చేరుకునేందుకు చుట్టూ ఏడు కోటలు ఉన్నాయి. గ్రామంలో అక్కడక్కడ కనిపించే జైన దేవాలయాను బట్టి చూస్తే రత్నగిరి ప్రాంతాల్లో జైనమతం విలసిల్లినట్లు తెలుస్తోంది. రాజవంశస్తులు పూజించే కులదేవత శ్రీకొల్లాపురిమహాలక్ష్మిదేవి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏడాదీ చైత్రమాసంలో అత్యంత వైభవంగా ఉత్సవాలు జరపడం ఆనవాయితీ. ఆలయ సమీపంలో గల పాలబావిలో గంగ పూజ చేస్తే సంతానం లేనివారికి సంతానభాగ్యం, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాధులు నయం అవుతాయని భక్తుల నమ్మకం.

ఇలా చేరుకోవచ్చు..
రొళ్ల మండల కేంద్రం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో గల కర్ణాటక ప్రాంతం మధుగిరి పట్టణానికి వెళ్లే మార్గంలో ఈ క్షేత్రం ఉంది. జిల్లా కేంద్రం అనంతపురం నుంచి అయితే 139 కిలోమీటర్ల దూరం ఉంది. పెనుకొండ వయా మడకశిర నుంచి రొళ్ల మీదుగా రత్నగిరి చేరుకోవచ్చు.

మరిన్ని వార్తలు