రేషన్‌ బియ్యం పట్టివేత

29 Sep, 2016 01:28 IST|Sakshi
రేషన్‌ బియ్యం పట్టివేత
 
  •  అక్రమ తరలింపును అడ్డుకున్న స్థానికులు  
ఆత్మకూరురూరల్‌ : పేద ప్రజలకు అందాల్సిన రేషన్‌ బియ్యాన్ని గోడౌన్‌ అధికారులు, డీలర్లు, ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు కుమ్మక్కై అక్రమంగా తరలిస్తుండగా, స్థానికులు అడ్డుకుని అధికారులకు పట్టించారు. ఈ సంఘటన బుధవారం ఆత్మకూరులో జరిగింది. బుధవారం ఉదయం 10 గంటలకు డీసీఎం మినీలారీలో 18వ నంబరు రేషన్‌ దుకాణానికి 105 బస్తాల బియ్యం సరఫరా చేస్తూ రసీదుతో సహా పంపారు. అయితే ఈ వాహనం 18వ నంబరు రేషన్‌ దుకాణం వరకు వచ్చినా, అక్కడ సరుకు దించకుండా సమీపంలోని రైస్‌మిల్లు వద్దకు వెళ్తుండగా పసిగట్టిన స్థానికులు అడ్డుకుని అధికారులకు సమాచారం అందించారు. దీంతో లారీడ్రైవర్‌ పరారయ్యాడు. స్థానిక ఇన్‌చార్జి తహసీల్దారు సారంగపాణి, వీఆర్‌ఓలు కేశవమూర్తి, మురళి తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని వాహనంతో సహా బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన 5,250 కేజీల బియ్యం (105 బస్తాలు) రేషన్‌ బియ్యమేనని అధికారులు ధ్రువీకరించారు. అయితే రసీదు మేరకు 18వ నంబరు రేషన్‌ డీలర్‌ దుకాణంలో లేరు. విచారించగా ఆయన చెన్నైకు వెళ్లారని అధికారులు తెలుసుకుని ఫోన్‌లో సంప్రదించారు. తనకు 45 బస్తాల బియ్యం రావాల్సి ఉందని, తాను ఊర్లో లేనందున మరో రోజు పంపాలని కోరినట్లు ఆయన వివరించారు. తహసీల్దారు సిబ్బందితో కలిసి రేషన్‌ దుకాణంలో స్టాక్‌ను పరిశీలించారు. పట్టుబడిన లారీ, బియ్యం సహా ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు తరలించారు. అక్కడ గోదాముల్లో స్టాకును పరిశీలించారు. ఈ మేరకు 6ఏ కేసు నమోదు చేసినట్లు  తహసీల్దారు సారంగపాణి తెలిపారు.  
మరిన్ని వార్తలు