రేషన్‌ బియ్యం పట్టివేత

18 Sep, 2016 01:47 IST|Sakshi
రేషన్‌ బియ్యం పట్టివేత
తడ : తడ పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోని సెల్వకుప్పంలో శనివారం రెవెన్యూ, సివిల్‌ సప్లయీస్‌ అధికారులు పోలీసుల సాయంతో దాడులు నిర్వహించి ఐదు ఇళ్లల్లో అక్రమంగా దాచి ఉంచిన 175 బస్తాల తమిళ, ఆంధ్రా రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొంత కాలంగా పూడికుప్పం, సెల్వకుప్పం కేంద్రంగా ఈ వ్యాపారం సాగుతుంది. చిన్నచిన్న వ్యాపారుల వద్ద నుంచి తమిళ,  ఆంధ్రా రేషన్‌ బియ్యం కొనుగోలు చేసి గ్రామంలోని ఇళ్లల్లో నిల్వ చేసి రాత్రి సమయాల్లో లారీల్లో తమకు అనుకూలమైన రైస్‌ మిల్లులకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో స్మగ్లర్ల మధ్య వాటాల విషయంలో ఇటీవల విభేదాలు తలెత్తడంతో గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారం రచ్చకెక్కింది. ఇటీవల సెల్వకుప్పం నుంచి ఓ లారీలో తమిళ రేషన్‌బియ్యం తీసుకు వెళ్తుండగా ఓ వర్గం అడ్డుకుని పోలీసులు ఫిర్యాదు చేశాడు. తడలో తప్పించుకున్న ఆ లారీని సూళ్లూరుపేట ఎస్‌ఐ గంగాధరం టోల్‌ప్లాజా వద్ద పట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం గ్రామంలో బియ్యం నిల్వ ఉన్నట్టు ప్రత్యర్థి వర్గం స్మగ్లర్లు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌కే ఇంతియాజ్‌క్‌ ఫోన్‌లో సమాచారం అందించారు. ఆయన ఆదేశాలతో తడ తహసీల్దార్‌ ఏడుకొండలు, సూళ్లూరుపేట సివిల్‌ సప్లయీస్‌ డీటీ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ సురేష్‌బాబు సహకారంతో గ్రామంలో తనిఖీలు చేవారు. ఐదు ఇళ్లల్లో దాచి ఉంచిన 175 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కొండూరు వద్ద ఉన్న సివిల్‌ సప్లయీస్‌ గోదాముకు తరలించారు. అయితే బియ్యం ఉన్న ఇళ్లల్లో ఎవరూ కాపురం లేకపోగా, ఆ సరుకు తమదంటూ ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రస్తుతానికి ఎవరిపైనా కేసులు నమోదు చేయలేదని తహసీల్దార్‌ తెలిపారు.  
>
మరిన్ని వార్తలు