రేషన్‌ షాపుల్లో ఆగని మోసాలు

9 Aug, 2016 18:33 IST|Sakshi
రేషన్‌ షాపుల్లో ఆగని మోసాలు

సాక్షి, విశాఖపట్నం : ఈపాస్, ఐరిస్, ఎలక్ట్రానిక్‌ వేయింగ్‌ మిషన్లు.. ఇలా సాంకేతిక పరిజ్ఞానం ఎంత అందుబాటులో తీసుకొచ్చినా రేషన్‌డీలర్ల మోసాలు మాత్రం ఆగడం లేదు. ఈపాస్‌తో ఎలక్ట్రానిక్‌ వేయింగ్‌ మిషన్లను అనుసంధానించినప్పటికీ వీరి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. జిల్లావ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా లీగల్‌ మెట్రాలజీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. వారం రోజులపాటు సాగించిన ఈ తనిఖీల్లో అనేక అవకతవకలు బయటపడ్డాయి. నగరంతోపాటు అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం, కె.కోటపాడు, గొలుగొండ, అచ్యుతాపురం, ఎస్‌.రాయవరం, రోలుగుంట, నాతవరం, అరకు, బొర్రా, సుంకరమెట్ట, బోసుబెడ, శివలింగాపురం వంటì  ప్రాంతాల్లోని రేషన్‌ డిపోలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 10 కేజీల నుంచి 30 కేజీల బియ్యం సరఫరాలో అర కే జీ నుంచి రెండు కేజీల వరకు తక్కువ తూకం ఇస్తున్నట్టుగా గుర్తించారు. కొన్నిచోట్ల తక్కువ తూకం కోసం రాళ్లు కూడా పెట్టి సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. ఇలా తూకంలో చేస్తున్న మోసాలకు పాల్పడిన 34 షాపులపై లీగల్‌ మెట్రాలజీ అధికారులు కేసులు నమోదు చేశారు. లీగల్‌ మెట్రాలజీ సహాయ సంచాలకుడు పి.సుధాకర్‌ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి.

ఎక్కడైనా తక్కువ తూకం తూస్తే ఫిర్యాదు చేయండి
తూకాల్లో మోసాలు చేస్తే సహించేది లేదు. బియ్యం తూకం వేసేటప్పుడు విధిగా గుడ్డ సంచులను గాని తక్కువతూకం కలిగిన ఇతర సంచులను మాత్రమే వినియోగించాలి. అధిక బరువు కలిగిన ఉక్కు, ఇనుప, ప్లాస్టిక్‌ గిన్నెలను వినియోగించడానికి వీల్లేరు. ఈ పాస్‌ అనుసంధానిత కాటాలో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా చర్యలు తప్పవు.
ఎక్కడైనా తూకం తక్కువగా ఇస్తున్నట్టు గుర్తిస్తే వెంటనే ఈ కింది నెంబర్లకు ఫిర్యాదు చేయండి.
సహాయ నియంత్రాధికారి కార్యాలయం : 0891–2799551
సహాయ నియంత్రకులు :9490165675
విశాఖపట్నం సిటీ ఏరియా:9885828883
గాజువాక ఏరియా :9866672119
అనకాపల్లి ఏరియా :9885334497
నర్సీపట్నం ఏరియా :9703353679
– పి.సుధాకర్, సహాయ నియంత్రకులు,లీగల్‌ మెట్రాలజీ, విశాఖపట్నం
 
 

మరిన్ని వార్తలు