ఏ పక్షంలో ఉన్నా నిధులొస్తాయి: రావుల

9 Sep, 2015 14:10 IST|Sakshi
ఏ పక్షంలో ఉన్నా నిధులొస్తాయి: రావుల

వనపర్తి : చిత్తశుద్దితో పని చేస్తే అధికార, ప్రతిపక్షంలో ఎక్కడ ఉన్న ప్రజాప్రయోగ పనులకు నిధులు సాధించడం సులువేనని వనపర్తి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. అధికార పక్షంలోనే ఉంటే నిధులొస్తాయి, ప్రతిపక్షంలో ఉంటే నిధులు రావానే అపోహ సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. బుధవారం వనపర్తిలోని బ్రహ్మణ సంస్కృతిక భవన నిర్మాణం, రూ. కోటి రూపాయాలతో నిర్మించిన ఇండోర్ స్టేడియం పనులను ఆయన పరిశీలించారు. బ్రహ్మణ సంస్కృతిక భవనానికి తాను రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో రూ.5 లక్షలు ఇచ్చానని రావుల ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.  

భవన నిర్మాణానికి తన వంతుగా కృషి చేస్తానన్ని ఆయన హామీ ఇచ్చారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పటికి రాష్ట్రంలో అత్యధిక నిధులు తెచ్చిన పది నియోజకవర్గాల్లో వనపర్తి పేరుండటం ఇందుకు నిదర్శనమని రావుల పేర్కొన్నారు. వనపర్తి నియోజకవర్గ అభివృద్ది కోసం తాను అవసరమైన ప్రతి చోట ఒక్క మెట్టు కిందికి దిగానని... అందువల్లే నియోజకవర్గం పది మెట్లు పైకి నిలబెట్టాగలిగామని అన్నారు. వనపర్తి ఆర్డీవో కొత్త భవనానికి రూ. 2 కోట్లు, ఐసీడీఎస్ భవనానికి రూ. 40 లక్షలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రూ. కోటి, సబ్‌ ట్రేజరీ కార్యాలయానికి రూ.కోటి, ఎంపీడీవో కార్యాలయాన్నికి రూ. రెండు కోట్ల చొప్పున తన హయంలో నిధలు విడుదలైన సంగతిని ఆయన వివరించారు.

సబ్‌ ట్రేజరీ, మండల పరిషత్ తప్ప మిగతా ఏ కార్యాలయాల పనులు ప్రారంభం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాను జిల్లా కలెక్టర్‌ను కలిసి పనులు పూర్తి అయ్యేలా కృషి చేస్తానన్నారు. డాక్టర్ బాలకృష్ణయ్య క్రీడా ప్రాంగణంకు అనుబంధంగా రూ. కోటి రూపాయాలతో అన్ని వసతులు,సౌకర్యాలతో ఇండోర్ స్టేడియం పూర్తియిందని... ఇది క్రీడకారులకు ఉపయుక్తంగా ఉండనుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంకటయ్యయాదవ్, కౌన్సిలర్లు ఉంగ్లం తిరుమల్, పార్వతి, టీడీపీ నాయకులు నందిమల్ల అశోక్, గిరి, నందిమల్ల రమేష్, పి. రవి, షఫీ, బాలరాజు, దినేష్ , కిశోర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు