మేల్కొనకపోతే సీమ ఎడారే

19 Sep, 2016 22:41 IST|Sakshi
మేల్కొనకపోతే సీమ ఎడారే
– రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి  
 
ఎమ్మిగనూరు: కోస్తాంధ్రపై వ్యామోహంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, అందరూ మేల్కొనకపోతే సీమ ఎడారిగా మారే ప్రమాదముందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరతరామిరెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం ఎమ్మిగనూరు కుర్ణి కల్యాణ మండపంలో, హŸళగుందలోని సినిమా టాకీస్‌ యజమాని వేణుగోపాల్‌రెడ్డి నివాసంలో ఆయన మాట్లాడారు. సాగునీటి విషయంలో రాయలసీమ జిల్లాలకు అనాదిగా నష్టం జరుగుతూనే ఉందన్నారు. పైభాగంలో ఉన్న రాయలసీమకు కాకుండా కింది ప్రాంతంలో ఉన్న కోస్తాంధ్రకు సాగునీటిని తరలిస్తున్నారని ఆరోపించారు. స్థిరీకరించిన సాగునీటి ప్రాజెక్టులన్నీ దిగువ ప్రాంతంలో కడుతున్నారని విమర్శించారు. తుంగభద్ర నదిపై మేళిగనూరు, ఆర్డీఎస్‌ రైట్‌ కెనాల్, గుండ్రేవుల ప్రాజెక్టులు కట్టే అవకాశం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవటంలేదన్నారు. తుంగభద్ర డ్యాంలో వాటాను 26 టీఎంసీల నుంచి 16కు తగ్గించినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. వాటా నీటి కోసం, సాగునీటి ప్రాజెక్టుల కోసం రాయలసీమ వాసులు ఉద్యమబాట పట్టాలని పిలుపునిచ్చారు. ఈనెల 26న ఆదోని ఆర్డీవో కార్యాలయం ఎదుట చేపట్టే ధర్నాకు ఎల్లెల్సీ రైతులు తరలి రావాలన్నారు.  పులికనుమ ప్రాజెక్టు పూర్తికోసం భవిష్యత్తులో పాదయాత్ర చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించామనీ ఆయన తెలిపారు. సదస్సులో టీబీ ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్‌ విష్ణువర్దన్‌ రెడ్డి, ఎల్లెల్సీ డైరెక్టర్‌ గడ్డం నారాయణరెడ్డి, ఐరన్‌గల్‌ శ్రీనివాసరెడ్డి,  కామినేని వేణుగోపాల్‌రెడ్డి, ఆది నారాయణరెడ్డి, విరుపాక్షప్ప తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు