చదువు కొనసాగించేందుకు ఓపెన్‌ స్కూల్‌ వేదిక

4 Sep, 2016 00:04 IST|Sakshi
మాట్లాడుతున్న డీఈఓ నాంపల్లి రాజేష్‌

ఖమ్మం : చదువు మధ్యలో ఆపేసినవారికి, గృహిణులకు, పదోన్నతుల కోసం ప్రయత్నించే వారికి ఓపెన్‌ స్కూల్‌ ఒక మంచి వేదిక అని డీఈఓ నాంపల్లి రాజేష్‌ అన్నారు. శనివారం తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ఓపెన్‌స్కూల్‌ అధ్యయన కేంద్రాల కోఆర్డినేటర్ల సమన్వయ సమావేశం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓపెన్‌స్కూల్‌ ప్రాముఖ్యతను వివరించారు. ఈ విద్యా సంవత్సరంలో జరుగుతున్న పదో తరగతి, ఇంటర్‌ ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్లను బాగా చేసి జిల్లాను ముందంజలో ఉంచాలని కోరారు. జిల్లాలో పదో తరగతి, ఇంటర్‌లో వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఈ కోర్సుల్లో చేరబోయే అభ్యర్థులు జిల్లాలోని ముదిగొండ, పాల్వంచ, మధిర అధ్యయన కేంద్రాల్లో కోఆర్డినేటర్లను సంప్రదించి అడ్మిషన్‌ పొందవచ్చునని చెప్పారు. కార్యక్రమంలో ఆర్‌ఐఓ దస్రూ, మధిర ఉప విద్యాశాఖాధికారి బి.రాములు, ఓపెన్‌ స్కూల్‌ స్టేట్‌ కోఆర్డినేటర్‌ హిమబిందు, డీసీఈబీ సెక్రటరీ కనపర్తి వెంకటేశ్వర్లు, జిల్లా కోఆర్డినేటర్‌ అవధానుల మురళీకృష్ణ, జిల్లాలోని ఓపెన్‌స్కూల్‌ అధ్యయన కేంద్రాల కోర్డినేటర్లు, అసిస్టెంట్‌ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు