అంత్యా సిద్ధం

30 Jul, 2016 22:28 IST|Sakshi
భద్రాచలం పుష్కర ఘాట్‌
  •   నేటి నుంచి 12 రోజుల పాటు అంత్య పుష్కరాలు
  •  శోభాయమానంగా భద్రాద్రి  ఘాట్‌
  •  
    భద్రాచలం : గోదావరి అంత్య పుష్కరాలకు సర్వం సిద్ధమైంది. ఆదివారం నుంచి పన్నెండు రోజుల పాటు  పుష్కరాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. భద్రాచలం, పర్ణశాల ఘాట్లలో భక్తులు పుష్కర స్నానాలు ఆచరించేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తీర్చిదిద్దారు. ఆదివారం ఉదయం 6గం.లనుంచి 7.30గం.ల వరకూ గోదావరి తీరాన శాస్త్రోక్తంగా అంత్య పుష్కరాల ప్రారంభ వేడుక నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు అన్నీ సిద్ధం చేశారు. ఉదయం స్వామి వారి ప్రచార మూర్తులను, చక్ర పెరుమాళ్లు, శ్రీపాదుకలతో గోదావరి తీరానికి ఊరేగింపుగా వెళ్లి, స్వామి వారికి పూజలు నిర్వహించిన తర్వాత సామూహిక పుష్కర స్నానం చేస్తారు. ఆదివారం నుంచి ఆగస్టు 11 వరకు రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ప్రతీ రోజూ స్వామి వారికి సహస్ర నామార్చన, క్షేత్రమహాత్యం, ప్రవచనం, నిత్య కల్యాణోత్సవం, ప్రభుత్వ సేవ నిర్వహించనున్నారు. పూజాది కార్యక్రమాల్లో భక్తులు కూడా పాల్గొని స్వామి వారికి సేవలు చేసుకోవచ్చని దేవస్థానం అధికారులు తెలిపారు.  భద్రాద్రి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని ఈఓ రమేష్‌బాబు తెలిపారు. పుష్కర స్నానం ఆనంతరం భక్తులు శ్రీసీతారామచంద్రస్వామి వారిని దర్శించుకునేందుకు వీలుగా ఆలయంలో తగిన ఏర్పాట్లు చేశారు. స్వామి వారి దర్శనం సకాలంలో అయ్యేలా చూడటంతో పాటు, భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా క్యూలైన్‌ ఏర్పాటు చేశారు. గోదావరి తీరంలో పుష్కర స్నానాలు ఆచరించే సమయంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకున్నారు. గోదావరి నదీ వైపు ఇనుప కంచెను ఏర్పాటు చేయడంతో పాటు, అత్యవసర సమయంలో భక్తులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు గజ ఈతగాళ్లను కూడా సిద్ధంగా ఉంచారు. 
    • శోభాయమానంగా పుష్కర ఘాట్‌ 
     అంత్య పుష్కరాలతో గోదావరి స్నానఘట్టాల రేవు శోభాయమానంగా కనిపిస్తోంది. గోదావరి తీరంలో ఉన్న ఆలయాలకు రంగులు వేసి, విద్యుత్‌ దీపాలు అమర్చారు. అదే విధంగా గోదావరి తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. గత ఏడాది ఆది పుష్కరాల సమయంలో గోదావరి నదిలో ఆశించిన స్థాయిలో నీరు లేదు. కానీ ప్రస్తుతం  భద్రాచలం వద్ద శనివారం సాయంత్రం 22.5 అడుగుల నీటి మట్టంతో గోదావరి నిండుగా ప్రవహిస్తుంది. దీంతో భక్తులు ఎటువంటి ఇబ్బందులు పుణ్యస్నానాలు  చేయవచ్చు. ఇటీవల వరదలకు ఘాట్లపై పేరుకుపోయిన బురదను పంచాయతీ అధికారులు ఫైర్‌ ఇంజిన్‌ సహకారంతో  యుద్ధ ప్రాతిపదికన తొలగించి శుభ్రం చేశారు. ఈ పన్నెండు రోజుల పాటు భద్రాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు  నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా ప్రతీ రోజు సాయంత్రం 6 నుంచి 6.15 గంటల వరకూ గోదావరికి నదీ హారతులు ఇస్తారు. దీని కోసం నది ఒడ్డున ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 
    • పుష్కరాలకు తరలిస్తున్న భక్తులు 
    అంత్య పుష్కరాల సమయంలో గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు భద్రాచలం తర లివస్తున్నారు. పుష్కరాల ప్రారంభోత్సవానికి రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు, హైకోర్టు జడ్జిలు, ఇతర ఉన్నతాధికారులు హాజరవుతారని దేవస్థానం అధికారులకు సమాచారం అందింది. దీంతో భక్తులతో పాటు,  వీఐపీలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని భద్రాచలం పట్టణంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తామని సీఐ శ్రీనివాసులు తెలిపారు. 
     
    భద్రాచలం పుష్కర ఘాట్‌ 
మరిన్ని వార్తలు