రెవెన్యూ సదస్సులకు సిద్ధం కండి

24 Jun, 2017 22:13 IST|Sakshi
  కలెక్టర్‌ సత్యనారాయణ
 
కర్నూలు(అగ్రికల్చర్‌):  రైతులు ఎదుర్కొంటున్న భూసమస్యల పరిష్కారానికి జూలై మొదటి లేదా రెండో వారాల్లో ‘మీ ఇంటికి మీ భూమి’ తరహలో సదస్సులు నిర్వహిస్తున్నామని, వీటికి అధికారులు సిద్ధం కావాలని కలెక్టర్‌ సత్య నారాయణ సూచించారు. శనివారం సాయంత్రం కాన్ఫరెన్స్‌ హాలులో జరిగిన రెవెన్యూ అధికారుల సదస్సులో కలెక్టర్‌ పాల్గొని వివిధ అంశాలపై సూచనలు ఇచ్చారు. డివిజన్‌ వారిగా ల్యాండ్‌ బ్యాంకులను ఏర్పాటు చేసి అందులో ప్రభుత్వ భూములను నమోదు చేయాలని సూచించారు.  2014 తరువాత ఇచ్చిన ఇళ్ల స్థలాల పట్టాల్లో అనర్హులు ఉంటే గుర్తించి పట్టాలను రద్దు చేయాలని వివరించారు. జాయింట్‌ కలెక్టర్‌ ప్రసన్నవెంకటేష్‌ మాట్లాడుతూ..రెవెన్యూ రికార్డుల నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల సమస్యలు పెరుగుతున్నాయన్నారు. తహసీల్దార్లు జవాబుదారి తనంతో పనిచేయాలని సూచించారు. తహసీల్దార్లు డిజిటల్‌ కీ లను కంప్యూటర్‌ అపరేటర్లకు అప్పగించకుండా సొంతంగా నిర్వహించడంతో చాలా వరకు సమస్యలు తగ్గుతాయని పలువురు డిప్యూటీ కలెక్టర్లు పేర్కొన్నారు. సమావేశంలో జేసీ2–రామస్వామి, ఆర్డీఓలు హుస్సేన్‌సాహెబ్, ఓబులేష్, రామసుందర్‌రెడ్డి, డిప్యూటీ కలెక్టర్‌ మల్లికార్జున, సత్యనారాయణ, సత్యం, అన్ని మండలాల తహసీల్దార్, డీటీలు పాల్గొన్నారు.   
 
మరిన్ని వార్తలు